Cluster Development Policy
-
రూ.551.9 కోట్లతో మూడు క్లస్టర్ల అభివృద్ధి
సాక్షి, అమరావతి: విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) అభివృద్ధిలో భాగంగా ఏపీఐఐసీ రెండో దశ పనులపై దృష్టిసారించింది. విశాఖ సమీపంలోని నక్కపల్లి, అచ్యుతాపురం–రాంబల్లి, చిత్తూరు సౌత్ క్లస్టర్లను ట్రాంచ్–2 కింద అభివృద్ధి చేస్తోంది. ఏడీబీ రుణ సహాయంతో విశాఖ–చెన్నై కారిడార్‌ను రూ.5,604 కోట్లతో రెండు దశల్లో అభివృద్ధి చేయనుండగా, తొలిదశ పనులు తుదిదశకు రావడంతో ఇప్పుడు రెండో దశ పనులపై ఏపీఐఐసీ దృష్టిసారించింది. ఇందుకోసం మూడు క్లస్టర్లల్లో రూ.551.9 కోట్ల విలువైన పనులకు టెండర్లను ఆహ్వానించింది. వీటిద్వారా.. ► నక్కపల్లి క్లస్టర్లో సుమారు 1,120 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను రూ.302.01 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పారిశ్రామిక పార్కు అందుబాటులోకి రావడానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► అచ్యుతాపురం–రాంబల్లిలోని 396 ఎకరాల స్టార్టప్ ఏరియాలో కూడా రూ.105.79 కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తారు. ► చిత్తూరు సౌత్ జోన్‌లోని శ్రీకాళహస్తి క్లస్టర్లో 2,770 ఎకరాల్లో స్టార్టప్ ఏరియాను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.414.53 కోట్లు వ్యయం చేయనుండగా, ఇప్పుడు తాజాగా 1.2 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉమ్మడి మురుగు నీటిశుద్ధి కేంద్రాన్ని (సీఈటీపీ–కామన్ ఎఫ్లు్యయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్) రూ.144.10 కోట్లతో ఏర్పాటుచేస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియను మేలో పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధంచేసినట్లు ఏపీఐఐసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఏడు రెట్లు పెరగనున్న తయారీరంగం ఇక వీసీఐసీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగ ఉత్పత్తి ఏడు రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కారిడార్ కింద నక్కపల్లి వద్ద 4,316 ఎకరాలు, అచ్యుతాపురం–రాంబిల్లి వద్ద 2,532 ఎకరాలు, మచిలీపట్నంలో 12,145 ఎకరాలు, శ్రీకాళహస్తి–ఏర్పేడులో 24,324 ఎకరాలు, దొనకొండలో 17,117 ఎకరాలు, కొప్పర్తిలో 6,914 ఎకరాల్లో మొత్తం 6 భారీ పారిశ్రామిక పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. ఈ ఆరు పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర తయారీ రంగంవిలువ ఏడు రెట్లు పెరిగి 2035 నాటికి రూ.7.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా. దీనివల్ల 1.1 కోట్ల మందికి అదనంగా ఉపాధి లభించనుంది. -
మరో రెండు క్రాప్ కాలనీలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్తగా మరో రెండు క్రాప్ (పంట) కాలనీలు ఏర్పాటు కానున్నాయి. రెండేళ్ల కిందట ఇబ్రహీంపట్నం క్లస్టర్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన క్రాప్ కాలనీలు విజయవంతమయ్యాయి. ఇదే స్ఫూర్తితో షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాల్లో నూతనంగా నెలకొల్పేందుకు జిల్లా ఉద్యాన శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై వారం రోజుల్లో సర్వే చేపట్టనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 8 మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు నెలలపాటు సర్వే చేస్తారు. నీటి లభ్యత, ఏ కూరగాయల పంటలు సాగుకు అనుకూలం, ప్రస్తుతం కాయగూరలు, ఆకుకూరల పంటలు ఎంత మొత్తంలో సాగవుతున్నాయి.. ఏయే పంటలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి.. నేల స్వభావం, సాగు సామర్థ్యం, రైతుల ఆసక్తి తదితర వివరాలు తెలుసుకోనున్నారు. దీంతోపాటు రైతుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తారు. రైతుల పేర్లు, వ్యవసాయ భూమి విస్తీర్ణం, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలు తీసు కుంటా రు. మొత్తం 39 అంశాలపై వివరాలు సేకరిస్తారు. వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ), ఉద్యానశాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొంటారు. ‘పట్నం’ స్ఫూర్తితో.. వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, రైతులు స్వయం సంమృద్ధి సాధించడం, మన జిల్లాతోపాటు మహానగరంలో కొంతభాగం జనాభాకు సరిపడ కూరగాయలు, ఆకుకూరలు మన జిల్లాలో పండించాలన్నది లక్ష్యం. ఇందు కోసం అధికారులు హైదరాబాద్ శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వాస్తవంగా జనాభాకు సరిపడా కూరగాయల దిగుబడి మన దగ్గర లేదు. దీంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలపై ఆధారపడుతున్నాం. క్రాప్ కాలనీలు తీసుకురావడం ద్వారా ఈ లోటును భర్తీచేయవచ్చన్నది అధికారుల ఆలోచన. దీంతో దిగుమతులు తగ్గడంతోపాటు స్థానికంగానే పండించడం వల్ల రైతులకు ఉపాధి లభిస్తుంది. ఈ ఉద్దేశంతో క్రాప్ కాలనీలను పరిచయం చేశారు. తొలుత ఇబ్రహీంపట్నం క్లస్టర్ కింద ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లో రెండేళ్ల కిందట శ్రీకారం చుట్టారు. గతంలో ఈ మండలాల్లో 38 గ్రామాల పరిధిలో 1,450 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు పండించేవారు. క్రాప్ కాలనీల ఏర్పాటు తర్వాత ప్రస్తుతం దీనికి అదనంగా 1,700 ఎకరాలకుపైగా కూరగాయల పంటలు సాగవుతండడం విశేషం. సాగుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందించింది. సబ్సిడీపై నారు, విత్తనాలతోపాటు డ్రిప్, స్ప్రింక్లర్లు, మల్చింగ్ షీట్లు, పాలీహౌజ్‌లను సబ్సిడీపై అందజేశారు. రెండేళ్లలో రూ.34.76 కోట్ల సబ్సిడీ విడుదల చేశారు. ఈ క్లస్టర్లో కూరగాయల సాగు రెట్టింపు కావడంతో ఇతర ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో నగర శివారులోని షాద్‌నగర్, చేవెళ్ల క్లస్టర్లను ఎంచుకున్నారు. -
బుద్వేల్‌లో మరో ఐటీ క్లస్టర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని బుద్వేల్, రాజేంద్రనగర్ ప్రాంతాల పరిధిలో మరో ఐటీ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్ కోసం సేకరించనున్న భూములను బుధవారం మంత్రి అధికారులతో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుద్వేల్ ఐటీ క్లస్టర్‌ను త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని అన్నారు. ఈ క్లస్టర్లో కంపెనీలను స్థాపించేందుకు 30కిపైగా బహుళజాతి ఐటీ సంస్థలు, ప్రముఖ దేశీయ కంపెనీలు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయన్నారు. త్వరలోనే ఆయా కంపెనీలతో పరిశ్రమల స్థాపనకు లాంఛనంగా ఒప్పందాలు కుదుర్చుకుంటామన్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న ఈ క్లస్టర్లో అన్ని మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని టీఎస్ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఐటీ కంపెనీల స్థాపన జరిగితే లక్షా పాతిక వేల కొత్త ఉద్యోగాలు వస్తాయన్నారు. -
కట్టడాల క్రమబద్ధీకరణకు నో
నాగపూర్: క్లస్టర్ అభివృద్ధి విధానంలో ముంబైలోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే ఆలోచనేదీ లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ముంబైలోని పాత కట్టడాల పునర్నిర్మాణ ం, క్రమబద్ధీకరించని వాటి కోసం ఉద్దేశించిన క్లస్టర్ పునరాభివృద్ధి విధానాన్ని సోమవారం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కొత్త విధానం వల్ల పునరాభివృద్ధి విధానానికి ఎటువంటి హానీ కలగబోదన్నారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాల అభివృద్ధికి సంబంధించిన క్లస్టర్ విధానంపై విధానసభలో గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ సీఎం పైవిషయాలు చెప్పారు. ఠాణే, ఇతర నగరాల్లో క్లస్టర్ల అభివృద్ధికి విధానం ప్రకటించాలన్న బీజేపీ, శివసేన సభ్యుల డిమాండ్‌పై స్పందిస్తూ ముంబై క్లస్టర్ అభివృద్ధి విధానాన్ని వచ్చేవారం ప్రకటిస్తామని, ఇతర నగరాల వాటిని మాత్రం నెల రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. కొన్ని సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందుల వల్లే నెల రోజుల సమయం తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ‘సింగిల్-ప్లాట్, పెన్సిల్ రీడెవెలప్మెంట్ భవనాల అభివృద్ధి పథకానికి మంచి స్పందన ఉంది. క్లస్టర్ విధానానికి ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. అందుకే క్లస్టర్ పునరాభివృద్ధి విధానాన్ని రూపొందించడం కష్టమే అయినా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి’ అని పృథ్వీరాజ్ చవాన్ వివరించారు. క్లస్టర్ విధానం తయారీ కోసం నియమించిన కమిటీ ఇది వరకే తన సిఫార్సులు అందజేసిందని ఆయన తెలిపారు.