క్లస్టర్ అభివృద్ధి విధానంలో ముంబైలోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే ఆలోచనేదీ లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు.
నాగపూర్: క్లస్టర్ అభివృద్ధి విధానంలో ముంబైలోని అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించే ఆలోచనేదీ లేదని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ముంబైలోని పాత కట్టడాల పునర్నిర్మాణ ం, క్రమబద్ధీకరించని వాటి కోసం ఉద్దేశించిన క్లస్టర్ పునరాభివృద్ధి విధానాన్ని సోమవారం ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ కొత్త విధానం వల్ల పునరాభివృద్ధి విధానానికి ఎటువంటి హానీ కలగబోదన్నారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాల అభివృద్ధికి సంబంధించిన క్లస్టర్ విధానంపై విధానసభలో గురువారం జరిగిన చర్చలో మాట్లాడుతూ సీఎం పైవిషయాలు చెప్పారు. ఠాణే, ఇతర నగరాల్లో క్లస్టర్ల అభివృద్ధికి విధానం ప్రకటించాలన్న బీజేపీ, శివసేన సభ్యుల డిమాండ్‌పై స్పందిస్తూ ముంబై క్లస్టర్ అభివృద్ధి విధానాన్ని వచ్చేవారం ప్రకటిస్తామని, ఇతర నగరాల వాటిని మాత్రం నెల రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు. కొన్ని సాంకేతిక, న్యాయపరమైన ఇబ్బందుల వల్లే నెల రోజుల సమయం తీసుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ‘సింగిల్-ప్లాట్, పెన్సిల్ రీడెవెలప్‌మెంట్ భవనాల అభివృద్ధి పథకానికి మంచి స్పందన ఉంది.
క్లస్టర్ విధానానికి ఎవరూ దరఖాస్తు చేసుకోవడం లేదు. అందుకే క్లస్టర్ పునరాభివృద్ధి విధానాన్ని రూపొందించడం కష్టమే అయినా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి’ అని పృథ్వీరాజ్ చవాన్ వివరించారు. క్లస్టర్ విధానం తయారీ కోసం నియమించిన కమిటీ ఇది వరకే తన సిఫార్సులు అందజేసిందని ఆయన తెలిపారు.