బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరుగుతున్న అవినీతిపై న్యాయవిచారణ..
ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో జరుగుతున్న అవినీతిపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బుధవారం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. బీఎంసీ పరిపాలనా విభాగంలో అవినీతిని అరికట్టగలిగితే నగరంలోని భూముల ధరలు చదరపు అడుగుకు రూ.500 తగ్గే అవకాశముందని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డెరైక్టర్ జనరల్ ప్రవీణ్ దీక్షిత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
కాగా, బాధ్యత గల ఉన్నతోద్యోగి వ్యాఖ్యలను ఉటంకిస్తూ బీఎంసీలో జరుగుతున్న అవినీతిపై వెంటనే న్యాయవిచారణ జరిపించాలని రెండుపార్టీల నాయకులు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, తనకు ఒక కాంట్రాక్టర్ రూ.100 కోట్ల లంచం ఇస్తానని ఆశచూపించాడని రాష్ట్ర నీటి సంరక్షణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ చేసిన వ్యాఖ్యలపై కూడా వారు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.
ఒకవేళ మంత్రి వ్యాఖ్యలు నిజమైతే.. సదరు కాంట్రాక్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారో లేదో తెలుసుకుని దానిపై కూడా విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో అసెంబ్లీ విపక్షనేత రాధాకృష్ణవిఖే పాటిల్, ముంబై కాంగ్రెస్ శాఖ అధ్యక్షుడు జనార్ధన్ చందూర్కర్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాయ్ జగ్తప్, అమిన్ పాటిల్, ఎన్సీపీ ఎమ్మెల్యేలు జితేంద్ర అవ్హాడ్,విద్యాచవాన్ తదితరులు ఉన్నారు.