సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే శ్వేతపత్రాలు, జ్యుడీషియ ల్ ఎంక్వైరీ, ప్రాజెక్టుల సందర్శన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి విమర్శించారు. కాలయాపనతో ఎన్నికల హామీ లను ప్రజలు మరిచిపోతారని ప్రభుత్వం భావిస్తోందని, ఆరు నెలల్లోపు హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అవినీతికి హక్కుదారు కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వంపై వేసే ప్రతి విచారణను బీఆర్‌ఎస్ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
రూ.లక్ష కోట్ల అవినీతి అవాస్తవమని తేలింది
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత సీఎం రేవంత్, రాహు ల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరో పణలు అవాస్తవమని శుక్రవారం మంత్రుల మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తేలిందని కడియం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి నట్లు మంత్రులు తమ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోనే అంగీకరించారని పేర్కొన్నారు.
బ్యారేజీ కుంగుబాటుపై సమగ్ర విచారణ
2014లో తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన తమ ప్రభుత్వం.. నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని తేలినందునే.. కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ ద్వారా రీ డిజైన్ చేసిందని కడియం శ్రీహరి చెప్పారు. 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.62 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు.
సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించామన్నారు. డిసెంబర్ 2008లో తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా 2014 వరకు కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎనిమిదేళ్ల పాటు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఈపీసీ విధానం తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు తదితరాల పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదని అన్నారు.
కేబినెట్ ఆమోదంతోనే ల్యాండ్ క్రూజర్ల కొనుగోలు
వాస్తవాలను పక్కన పెట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులు జ్యుడీషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ క్రూజ ర్ల కొనుగోలు కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని, ఇలాంటి అంశాలపై పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు లంకెబిందెల కోసం అధికారంలోకి వ చ్చారా? బడ్జెట్ గణాంకాలు అధ్యయనం చేయ కుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment