కార్యకర్తలను, నేతలను ప్రశ్నించిన శరద్‌పవార్
సాక్షి, ముంబై: రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ విస్తరిస్తున్నా, ముంబైలో మాత్రం ఎందుకు విస్తరించడం లేదని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్‌పవార్ నాయకులను, పదాధికారులను నిలదీశారు. నగరంలో పార్టీ, అనుబంధంగా సంఘాల స్థితిగతులపై సమీక్షించేందుకు మంగళవారం సాయంత్రం శరద్ పవార్ ఓ సమావేశం నిర్వహించారు. ఇందులో నాయకులు, పదాధికారులు మొదలు బ్లాక్ అధ్య క్షులు, కీలకమైన కార్యకర్తలు కొందరు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్సీపీ విస్తరించింది. అందుకు నిదర్శనం జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ తదితర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎన్సీపీకి అనుకూలంగా రావటమేనని ఉదహరించారు. ముంబైలో మాత్రం పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందన్నారు. వచ్చే మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పటి నుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇంతకుముందు బీఎంసీ ఎన్నికల్లో ఎన్సీపీకి నామమాత్రంగానైనా కొన్ని సీట్లు వచ్చాయి. కానీ ఇటీవలి లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ముంబైలో ఎన్సీపీ పూర్తిగా చతకిలబడిపోయింది. దీంతో పార్టీకి పునరుజ్జీవం తేవాలని పవార్ తన దిగువ శ్రేణి నేతలను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎన్సీపీ నాయకులు సునీల్ తట్కరే, ఛగన్ భుజబల్, అజీత్ పవార్, జయంత్ పాటిల్, సచిన్ ఆహిర్, నరేంద్ర వర్మ, సంజయ్ పాటిల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ముంబైకర్లు ఎన్సీపీ ఎందుకు ఆదరించడం లేదు?
Published Wed, Feb 4 2015 10:12 PM | Last Updated on Wed, Apr 3 2019 4:53 PM
Advertisement