సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొత్తగా మరో రెండు క్రాప్ (పంట) కాలనీలు ఏర్పాటు కానున్నాయి. రెండేళ్ల కిందట ఇబ్రహీంపట్నం క్లస్టర్‌లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించిన క్రాప్ కాలనీలు విజయవంతమయ్యాయి. ఇదే స్ఫూర్తితో షాద్‌నగర్, చేవెళ్ల ప్రాంతాల్లో నూతనంగా నెలకొల్పేందుకు జిల్లా ఉద్యాన శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. సాధ్యాసాధ్యాలపై వారం రోజుల్లో సర్వే చేపట్టనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో మొత్తం 8 మండలాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రెండు నెలలపాటు సర్వే చేస్తారు.
నీటి లభ్యత, ఏ కూరగాయల పంటలు సాగుకు అనుకూలం, ప్రస్తుతం కాయగూరలు, ఆకుకూరల పంటలు ఎంత మొత్తంలో సాగవుతున్నాయి.. ఏయే పంటలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి.. నేల స్వభావం, సాగు సామర్థ్యం, రైతుల ఆసక్తి తదితర వివరాలు తెలుసుకోనున్నారు. దీంతోపాటు రైతుల వ్యక్తిగత సమాచారాన్ని కూడా సేకరిస్తారు. రైతుల పేర్లు, వ్యవసాయ భూమి విస్తీర్ణం, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్ తదితర వివరాలు తీసు కుంటా రు. మొత్తం 39 అంశాలపై వివరాలు సేకరిస్తారు. వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ), ఉద్యానశాఖ అధికారులు ఈ సర్వేలో పాల్గొంటారు.
‘పట్నం’ స్ఫూర్తితో..
వ్యవసాయ ఉత్పత్తులు పెంచడం, రైతులు స్వయం సంమృద్ధి సాధించడం, మన జిల్లాతోపాటు మహానగరంలో కొంతభాగం జనాభాకు సరిపడ కూరగాయలు, ఆకుకూరలు మన జిల్లాలో పండించాలన్నది లక్ష్యం. ఇందు కోసం అధికారులు హైదరాబాద్ శివారు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. వాస్తవంగా జనాభాకు సరిపడా కూరగాయల దిగుబడి మన దగ్గర లేదు. దీంతో ఇతర జిల్లాలు, రాష్ట్రాలపై ఆధారపడుతున్నాం. క్రాప్ కాలనీలు తీసుకురావడం ద్వారా ఈ లోటును భర్తీచేయవచ్చన్నది అధికారుల ఆలోచన. దీంతో దిగుమతులు తగ్గడంతోపాటు స్థానికంగానే పండించడం వల్ల రైతులకు ఉపాధి లభిస్తుంది. ఈ ఉద్దేశంతో క్రాప్ కాలనీలను పరిచయం చేశారు.
తొలుత ఇబ్రహీంపట్నం క్లస్టర్ కింద ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల మండలాల్లో రెండేళ్ల కిందట శ్రీకారం చుట్టారు. గతంలో ఈ మండలాల్లో 38 గ్రామాల పరిధిలో 1,450 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల కాయగూరలు, ఆకుకూరలు పండించేవారు. క్రాప్ కాలనీల ఏర్పాటు తర్వాత ప్రస్తుతం దీనికి అదనంగా 1,700 ఎకరాలకుపైగా కూరగాయల పంటలు సాగవుతండడం విశేషం. సాగుకు అవసరమైన సహకారాన్ని ప్రభుత్వం అందించింది. సబ్సిడీపై నారు, విత్తనాలతోపాటు డ్రిప్, స్ప్రింక్లర్లు, మల్చింగ్ షీట్లు, పాలీహౌజ్‌లను సబ్సిడీపై అందజేశారు. రెండేళ్లలో రూ.34.76 కోట్ల సబ్సిడీ విడుదల చేశారు. ఈ క్లస్టర్‌లో కూరగాయల సాగు రెట్టింపు కావడంతో ఇతర ప్రాంతాలపై అధికారులు దృష్టిసారించారు. ఈ క్రమంలో నగర శివారులోని షాద్‌నగర్, చేవెళ్ల క్లస్టర్లను ఎంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment