పాలు సలసల
గాజువాక, న్యూస్‌లైన్ : విశాఖ డెయిరీ పాల ధర లీటరుకు రూ.2లు పెరగనుంది. ఈ ధర సోమవారం నుంచే అమల్లోకి రానుంది. విశాఖ డెయిరీ గత ఏడాదిన్నర కాలంలో పాల ధరను నాలుగుసార్లు పెంచింది. ఆరు నెలలుగా అర లీటరు రూ.17 ఉన్న పాల ప్యాకెట్ ఇప్పుడు రూ.18కి చేరుకుంది. ఇప్పటికే అన్ని ధరలు పెరిగి ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఇప్పుడు పాల ధర కూడా భారంగా మారనుంది.
డెయిరీ యాజమాన్యం మునుపటిలాగా ఈసారి లీటరుకు రెండు రూపాయలు పెంచడం కాకుండా ఒక్కో పరిమాణానికి ఒక్కో విధంగా పెంచినట్టు తెలుస్తోంది. కొన్ని పాలపై రూపాయి, మరికొన్ని పాలపై రెండు రూపాయలు, ఇంకొన్ని పాలపై ఐదు రూపాయల వరకు ధర పెరిగిందని డెయిరీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి 200 ఎం.ఎల్. ప్యాకెట్‌కు కూడా ధర పెంచారు.
ఈ ప్యాకెట్లను లీటరు పరిమాణంలో తీసుకుంటే ఒకేసారి ఐదు రూపాయలు పెరిగినట్టవుతుంది. ఇటీవల రాష్ట్రంలో ఇంధన, పాల కొనుగోలు ధరలు, పాల రవాణా ఖర్చులు, ప్యాకింగ్ ఫిల్మ్ ధరలు, యంత్ర సామగ్రి, ప్రాసెసింగ్ చార్జీలు పెరిగి డెయిరీ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని, ఈ నేపథ్యంలో డెయిరీ నిర్వహణ కష్టతరమవుతోందని యాజమాన్యం విడుదల చేసిన కరపత్రంలో పేర్కొంది.