ఈసారింతే..
రాయగడకు ప్యాసింజరు
రాజధానికి ఏసీరైలు
కొత్త ప్రాజెక్టులు శూన్యం
నిరాశ మిగిల్చిన రైల్వే బడ్జెట్
1- విశాఖ-సికింద్రాబాద్ మధ్య మరో ఏసీ సూపర్‌ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య కొత్త రైలు వస్తాదని బడ్జెట్‌కు ముందు ఊహించిందే
2- రాయగడ మీదుగావిశాఖ-గుణుపూర్ మధ్య కొత్త ప్యాసింజర్ మంజూరైంది. గుణుపూరువాసుల ఆందోళన ఫలితంగా..అక్కడ ఎంపీల కృషి వల్ల ఈ రైలు సాధ్యపడింది.
విశాఖపట్నం, న్యూస్‌లైన్: మధ్యంతర రైల్వే బడ్జెట్ నిరాశ మిగిల్చింది. నాలుగు నెలల పరిమితికే అయినా మహా నగర వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. బుధవారం రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే ప్రవేశపెట్టిన ఓటాన్ రైల్వే బడ్జెట్ కొద్ది నిమిషాల్లోనే ముగిసింది. రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరిక మేరకు దక్షిణ మధ్య రైల్వేకి రెండు డబుల్ డెక్కర్ రైళ్లు మంజూరయ్యాయి. తూర్పు కోస్తా రైల్వేలోని విశాఖ నుంచి రెండు కొత్త రైళ్లకు బడ్జెట్లో ఆమోదం లభించింది. దీర్ఘకాలిక డిమాండ్లు పక్కనబెట్టి గుణుపూర్‌కు ప్యాసింజర్ వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది.
సికింద్రాబాద్‌కు మరో ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేశారు. ఈ రెండు కొత్త రైళ్లు వెనుక ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల హస్తం లేదని ప్రయాణిక సంఘం నేతలు పెదవి విరిచారు. గుణుపూరు ప్యాసింజర్ ఒఢిశా కోటాలోనూ, సికింద్రాబాద్-విశాఖ ఏసీ ఎక్స్‌ప్రెస్ మంజూరు వెనక దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రతిపాదనలుగా చెబుతున్నారు. ఈ రెండూ మినహా మన నగరానికి ఒరిగిందేమీ లేదు. కొత్త జోన్ ప్రస్తావన లేదు. ఆశించిన రైళ్లేమీ మంజూరు కాలేదు.