బ్యాంకు ఖాతా ఉంటేనే తుపాను పరిహారం
సీఎం చంద్రబాబు స్పష్టీకరణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలోని హుద్‌హుద్ తుపాను బాధితులకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి నష్టపరిహారం అందించలేదని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధితులకు బ్యాంకు ఖాతా, ఆధార్‌కార్డు ఉంటేనే పరిహారం అందిస్తామని స్పష్టం చేశారు. సోమవారం విశాఖపట్నం పర్యటనలో భాగంగా తుపాను సహాయక చర్యలపై కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతోనూ, రాత్రి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘విశాఖ పునర్నిర్మాణం’ పేరిట ఆర్కే బీచ్‌లో ఏర్పాటైన కార్యక్రమంలోనూ ఆయన మాట్లాడారు. తుపాను నష్టాల అంచనా మరో మూడు నాలుగు రోజుల్లో పూర్తవుతుందన్నారు.
అనంతరం కేబినెట్లో చర్చించి పరిహారాన్ని నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.ఆధార్ కార్డు లేనివారు ఇప్పటికిప్పుడైనా సరే నమోదు చేయించుకోవాలన్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో పర్యటించనున్న కేంద్ర బృందానికి నివేదికను సమర్పిస్తామని బాబు వివరించారు. ‘వుడా’ పరిధిని విసృ్తతపరచి వీఎండీఏ (విశాఖపట్నం మెట్రోపాలిటిన్ డెవలప్మెంట్ అథారిటీ’గా తీర్చిదిద్దుతామనీ దానికి తానే చైర్మన్‌గా ఉంటానన్నారు. విశాఖలో సిగ్నేచర్ టవర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంట ర్మీడియట్ పరీక్షలను ఉమ్మడిగా నిర్వహించాలన్న ఏపీ ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం అర్థరహితంగా వ్యతిరేకిస్తోందన్నారు.