ఇన్ఫీలో నెక్ట్స్ ఏంటి?
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్‌లో ముదురుతున్న వివాదంపై ఎట్టకేలకు ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి కార్యాచరణకు దిగుతున్నారు. ఈ మేరకు రేపు (బుధవారం,ఆగస్టు 23) సాయంత్రం ఇన్వెస్టర్లతో సమావేశం కానున్నారు. మరోవైపు తాజాపరిణామాలపై ఇన్ఫోసిస్ కో ఛైర్మన్ రవి వెంకటేశన్ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీని కలిశారు. సంస్థ సీఈఓ విశాల్ సిక్కా ఆకస్మిక రాజీనామా చేసిన నేపథ్యంలో అరుణ్ జైట్లీ కంపెనీలో ఉన్న అనిశ్చితిపై సమాచారం అందించినట్టు తెలుస్తోంది. షేర్ హోల్డర్స్‌ను రక్షించుకునేందుకు జరుగుతున్న చర్యలపై వివరించారట. దీంతో టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కోసం గత నాలుగు రోజులు కల్లోలం నేపథ్యంలో నెక్ట్స్ ఏం జరగబోతోందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
అటు విశాల్ సిక్కా స్థానంలో కొత్త సీఈవోని ఎంపిక చేసే కసరత్తు ఇంకా ఒక కొలిక్కి రావడంలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దే పీస్ మేకర్‌గా మరో కో ఫౌండర్ నందన్ నీలేకనీ రంగంలోకి దిగనున్నారు. ఈమేరకు బోర్డు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ఫౌండర్ గ్రూపునకు, బోర్డు మధ్య వివాదం పరిష్కారంలో ఆయన మధ్యవర్తిత్వం వహించ నున్నారని తాజా నివేదికల సమాచారం. ఇవన్నీ ఇలా ఉండగా మార్కెట్ రెగ్యులేటరీ సెబీ కూడా రంగంలోకి దిగింది. చిన్న వాటాదారులను ప్రయోజనాలను, సంపదను కాపాడేందుకు సన్నద్ధమవుతోంది. సిక్కా రాజీనామా, బై బ్యాక్, ఇన్ఫోసిస్ లేదా దాని అధికారులచే ఉల్లంఘించిన ఆరోపణలపై అమెరికా చట్ట సంస్థలదర్యాప్తు చేస్తున్న వార్తలు, ఇన్వెస్టర్ల వేల కోట్ల సంపద తదితర అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది. అటు సంస్థలో ప్రధాన వాటాదారు ఎల్ఐసీ కూడా ఈ పరిణామాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఏది ఏమయినప్పటికీ ఇండియన్ ఐటీలో దిగ్గజంలా వెలిగిన ఇన్ఫోసిస్ ప్రతిష్ట, మార్కెట్ వాల్యూ మసక బారుతోంది. సీఈవోగా విశాల్ సిక్కా ఆకస్మిక రాజీనామా చేసిన రోజు ( ఆగష్టు 18) ఇన్ఫోసిస్ షేర్ దాదాపు పది శాతం క్షీణించింది. దాని మార్కెట్ విలువ ఒక రోజులో రూ .22,518 కోట్లకు చేరుకుంది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా టాప్ -10 నిఫ్టీ కంపెనీల జాబితాలో చోటు కోల్పోయింది. వేలకోట్ల సంపదను చిన్న, పెద్ద ఇన్వెస్టర్లు నష్టపోయారు. అయితే విశాల్ స్థానంలో యూబీ ప్రవీణ్‌రావును మధ్యంతర సీఈవోగా నియమించినా, తాజా పరిణామాలపై ఇన్ఫోసిస్ ఇంకా అధికారంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.