Vishakha agency
-
మన్యంలో విజృంభిస్తున్న చలి
పాడేరు/అరకులోయ: విశాఖ ఏజెన్సీలో మళ్లీ చలి గాలులు విజృంభిస్తున్నాయి. మూడు రోజుల నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం తెల్లవారుజామున చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యల్పమని పరిశోధన స్థానం ఇన్చార్జి చెప్పారు. జి.మాడుగులలో 5.58, జి.కె.వీధిలో 5.72, అరకులోయలో 6.45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నెలకొన్నాయి. పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీబోర్డు వద్ద 9 డిగ్రీలు, అరకులోయ కేంద్రం కాఫీబోర్డు వద్ద 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురవడంతో ఉదయం 9.30 గంటల వరకు ఏజెన్సీలోని అరకులోయ, పాడేరు, చింతపల్లి ప్రాంతాల్లో సూర్యోదయం కాలేదు. మంచు తీవ్రత చలిగాలులతో వ్యవసాయ పనులు, వారపుసంతలకు వెళ్లే గిరిజనులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచుతో పాడేరు, చింతపల్లి, అనంతగిరి ఘాట్ రోడ్లలో వాహన చోదకులంతా లైట్లు వేసుకునే వాహనాలు నడిపారు. -
వెదురు కంజి టేస్టే వేరబ్బా.!
ముంచంగిపుట్టు(అరకు): కూరగాయల్లో ఎన్నో రకాలుంటాయి. కానీ మన్యంలో లభించే వెదురు నుంచి తీసిన చిగురు కూర రుచి వేరు అంటున్నారు గిరిజనులు. దీనిని వెదురు కొమ్ములు, వెదురు కంజి అని కూడా పిలుస్తారు. వెదురు కంజి కూర వాహ్వా.. అంటూ లొట్టలేసుకుంటున్నారు. ప్రస్తుతం మన్యంలోని మండల కేంద్రాల్లో హాట్ కేకుల్లా వెదురు కంజి అమ్మకాలు జరుగుతున్నాయి. అటవీ కొండ ప్రాంతాల్లో ఉన్న వెదురు బొంగు నుంచి లేత వెదురును తీసి చిగురును సేకరిస్తారు. దానిని శుభ్ర పరిచి ముక్కలుగా చేస్తారు. వాటిని గిరిజనులు మండల కేంద్రాలకు తెచ్చి వాటాల రూపంలో రూ.20 నుంచి రూ.40 లు వరకు విక్రయిస్తారు. వెదురు కంజిల వాటా రూ.20, అమ్మకానికి సిద్ధంగా వెదురు కంజి వెదురు కంజిని రెండు రకాలుగా కూర తయారీకి వినియోగిస్తారు. పచ్చి వెదురు కంజిని ఓ రకంగా, ఎండబెట్టి మరో విధంగా కూర తయారీకి వాడతారు. పచ్చిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు కూర తయారు చేసుకోవాలి. ఎండబెడితే ఏడాది కాలంలో ఎప్పుడైనా కూర వండుకోవచ్చు. వేపుడు, పచ్చడి, పులుసు వంటి రకాలుగా కూరను తయారు చేసుకుని చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కూర తయారు చేసే ముందు రెండు మూడు సార్లు వెదురు కంజిని బాగా కడగాలి. అప్పుడే వెదురు కంజిలో ఉండే చేదు పోతుంది. వెదురుకంజిని బాగా ఉడకబెట్టి దాని కషయాన్ని తాగితే శరీరానికి మంచి చలువ చేస్తుందని గిరిజనులు చెబుతున్నారు. మధుమేహం, కపం, మూల వ్యాధి నివారణకు ఆయుర్వేదపరంగా ఎంతో ఉపశమనం ఇస్తుంది. కడుపులో నులి పురుగును తొలగిస్తుంది. గాయం మానేందుకు వెదురు కంజిని పేస్ట్‌గా చేసి గాయంపై రాస్తారు.మారుమూల గిరిజనులు పాము, తేలు కాటుకు ఔషధంగా సైతం దీనిని వినియోగిస్తున్నారు. -
'గిరిజనులకు బతికేహక్కు లేదా?'
-
'గిరిజనులకు బతికేహక్కు లేదా?'
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు సర్కార్ అనుమతివ్వడం గిరిజనులకు అన్యాయం చేయడమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర విమర్శించారు. గిరిజనులు బతకాల్సిన అవసరం లేదా, వారికి బతికే హక్కు లేదా అని రాజన్న దొర ప్రశ్నించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 2008లో టీడీపీ నాయకులు పాదయాత్ర చేశారని, ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అసెంబ్లీలో కూడా మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటిది టీడీపీ అధికారంలోకి వచ్చాక బాక్సైట్ తవ్వకాలకు అనుమతివ్వడాన్ని రాజన్న దొర తప్పుపట్టారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని, టీడీపీ నాయకులు రాజ్యంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ చింతపల్లి, జెర్రెల బ్లాకుల్లోని 3,030 ఎకరాల (1,212 హెక్టార్ల) అభయారణ్యాన్ని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బదలాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే. -
ఉనికి కోల్పోయారు
పాడేరు,న్యూస్‌లైన్: విశాఖ ఏజెన్సీ ప్రశాంతంగా ఉండాలన్నదే తమ ఆశయమని జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజనులంతా అభివృద్ధిని కోరుకుంటున్నారన్న విషయం ఇటీవలి ఎన్నికలే రుజువు చేశాయన్నారు. మావోయిస్టులు ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చినప్పటికీ గిరిజనులు స్వేచ్ఛగా ఓటు వేశారని ఆయన తెలిపారు. ప్రగతి నిరోధకులైన మావోయిస్టులు ఇప్పుడు ఉనికి కోల్పోయారని అన్నారు. మావోయిస్టు మిలీషియా సభ్యులు వందలాది మంది లొంగిపోయారని పలువురు దళ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులను కూడా అరెస్ట్ చేశామన్నారు. కిల్లంకోట, బలపం, పెదబయలు, ముంచంగిపుట్టు, చింతపల్లి, అన్నవరం, సప్పర్ల, దారకొండ వంటి మారుమూల ప్రాంతాల్లో వారికి ఎదురు దెబ్బ తగిలిందన్నారు. ఏజెన్సీలోని అన్ని మారుమూల రోడ్లను అభివృద్ధి చేసి రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయిన రోడ్ల పనులన్నీ వేగవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఏఎస్పీ కె.ఫకీరప్ప, ట్రైనీ డీఎస్పీ మహేంద్ర, సీఐ ఎన్.సాయి, ఎస్ఐలు ధనుంజయ్, ప్రసాద్ ఉన్నారు. మోదకొండమ్మకు ఎస్పీ పూజలు మోదకొండమ్మ తల్లి ఉత్సవాలను తిలకించేందుకు విక్రమ్‌జీత్ దుగ్గల్ సోమవారం పాడేరు వచ్చారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి రూరల్ ఎస్పీ కుటుంబం పేరిట ప్రత్యేక కుంకుమార్చన పూజలు కూడా జరిపారు. నర్సీపట్నం ఓఎస్డి ఏఆర్ దామోదర్, ఏఎస్పీ కె.ఫకీరప్ప తదితరులూ అమ్మవారిని దర్శించుకున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు జాతరతో అవాంఛనీయ ఘటనలు సంభవిస్తే అనుమానితులను గుర్తించేందుకని పోలీసు శాఖ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. ఎప్పటికప్పుడు కంట్రోల్ రూంలోని అధికారులు ఈ దృశ్యాలను పరశీలిస్తున్నారు. గత 29 ఏళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.