విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు సర్కార్ అనుమతివ్వడం గిరిజనులకు అన్యాయం చేయడమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర విమర్శించారు.
హైదరాబాద్: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు చంద్రబాబు సర్కార్ అనుమతివ్వడం గిరిజనులకు అన్యాయం చేయడమేనని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రాజన్న దొర విమర్శించారు. గిరిజనులు బతకాల్సిన అవసరం లేదా, వారికి బతికే హక్కు లేదా అని రాజన్న దొర ప్రశ్నించారు.
విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా 2008లో టీడీపీ నాయకులు పాదయాత్ర చేశారని, ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు అసెంబ్లీలో కూడా మాట్లాడారని గుర్తు చేశారు. అలాంటిది టీడీపీ అధికారంలోకి వచ్చాక బాక్సైట్ తవ్వకాలకు అనుమతివ్వడాన్ని రాజన్న దొర తప్పుపట్టారు. గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటని, టీడీపీ నాయకులు రాజ్యంగవిరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ చింతపల్లి, జెర్రెల బ్లాకుల్లోని 3,030 ఎకరాల (1,212 హెక్టార్ల) అభయారణ్యాన్ని ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి బదలాయిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.