విశాఖ అమ్మాయి గుంతకల్లులో ప్రత్యక్షం
గుంతకల్లు : తల్లిదండ్రులు మందలించారని ఇల్లు వదిలి వచ్చిన విశాఖపట్నం సమీప వాలే్తరు గ్రామానికి చెందిన రూప (22) అనే యువతి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల చొరవతో క్షేమంగా తల్లితండ్రుల వద్దకు చేరింది. వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 14 గాయపడి అపస్మారకస్థితిలో గుంతకల్లు రైల్వే స్టేషన్లో పడి ఉన్న రూపను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. 108 వాహనంలో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆమె స్పృహలోకి వచ్చింది. వైద్యులు ఆమె వివరాలను ఆరా తీశారు. తన పేరు, స్వగ్రామం తెలిపింది. రైలులో ప్రయాణిస్తూ మూర్ఛవచ్చి పడిపోయానని చెప్పింది.
వైద్యులు కళ్యాణ్, ప్రవీణ్ ఆమె ఫొటోను వాట్సాప్ ద్వారా విశాఖపట్నంలోని తమ స్నేహితులకు పంపారు. ఈ సమాచారం యువతి తల్లిదండ్రులు అప్పారావు, సుగుణకు చేరడంతో ఆదివారం వారు గుంతకల్లు ఆస్పత్రికి చేరుకున్నారు. ఆమె తండ్రి విశాఖపట్నంలోని రైల్వే కార్యాలయంలో కమర్షియల్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ తన కుమార్తెకు మేనమామతో పెళ్లి నిశ్చయం చేశామన్నారు. ఆ అబ్బాయి మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో రూప మానసికంగా కుంగిపోయింది. ఈ పరిస్థితిలో ఈ నెల 11న ఇంటి నుంచి వెళ్లిపోయిందని వివరించారు. వైద్యులు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇజంతకర్ చంద్రశేఖర్, జీఆర్పీ పోలీసులు సమక్షంలో రూపను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. యువతి తల్లిదండ్రులు వైద్యులకు, ఆస్పత్రి సిబ్బందికి, సెక్యూరిటీ గార్డు శ్రీనివాసులుకు కృతజ్ఞతలు తెలిపారు.