‘నరేంద్ర మోదీ దేవుడు కాదు’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకం కావాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. మతమౌఢ్యాన్ని వ్యతిరేకించే పార్టీలన్నీ చేతులు కలపాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ‘నరేంద్ర మోదీ దేవుడు కాదు. ఆయనను ఆపాల్సిన అవసరముంది. మతతత్వ శక్తులను వ్యతిరేకించే పార్టీలన్నీ ఐక్యం కావాల్సిన అవసరముంద’ని దిగ్విజయ్ అన్నారు.
గోవాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విశ్వజీత్ రాణె రాజీనామాపై ఆయన స్పందించారు. ‘నిన్న ఉదయం 10 గంటలకు పార్టీ విప్ పై రాణె సంతకం చేశారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షకు ఆయన గైర్హాజయ్యార’ని దిగ్విజయ్ తెలిపారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ అవతరించినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ విశ్వజిత్ రాణె.. పార్టీకి, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.