విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి
రెంటచింతల: దశాబ్దాలుగా నిరాదరణకు గురైన విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తానని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ సింహాద్రి కనకాచారి అన్నారు. సోమవారం ఆయన విశ్వబ్రాహ్మణుల సమావేశంలో మాట్లాడుతూ 5 వృత్తులతో జీవితాలను కొనసాగించేది ఒక్క విశ్వబ్రాహ్మణులేనని, వారు ఉమ్మడి రాష్ట్రంలో 60 లక్షల మంది ఉండగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో 25 లక్షల నుంచి 30 లక్షల మంది ఉన్నారన్నారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో వెనుకబాటుకు గురైన విశ్వబ్రాహ్మణులకు 2015–16లో రూ. 19 కోట్లను, 2016–17కిగానూ రూ. 22 కోట్లను ప్రభుత్వం కేటాయిందన్నారు. సొసైటీగా ఏర్పడితే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని తమ కుటుంబాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. కృష్ణానది పుష్కరాలలో భాగంగా సత్రశాలలో పుణ్యస్నానాలు ఆచరించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. జిల్లా అధ్యక్షులు కొమరిగిరి కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు చిలకపాటి బ్రహ్మయ్య పాల్గొన్నారు.