'తుపాకీ ఉంటే కాల్చిపారేసే వాడిని'
న్యూఢిల్లీ: 'నా దగ్గర తుపాకీ ఉంటే కాల్చిపారేసే వాడిని. కన్నతల్లిని తిడితే ఎవరైనా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరు. నా తల్లిని తిట్టినివాడిని కొట్టకుండా ఉండలేను' అని బీజేపీ ఎమ్మెల్యే ఓంప్రకాశ్ శర్మ అన్నారు. పటియాలా కోర్టు ఆవరణలో సోమవారం జరిగిన ఘర్షణలో సీపీఐ కార్యకర్త అమీఖ్ జమాయ్పై శర్మ చేయి చేసుకున్నారు. జమాయ్ ను కిందపడేసి మరీ కొట్టారు.
దీనిపై ఆయనను ప్రశ్నించగా దేశానికి వ్యతిరేకంగా ఎవరు నినాదాలు చేసినా కొడతానని ఆయన సమాధానమిచ్చారు. ఎవరైనా తలపై కొడితే ప్రతిస్పందన ఇలాగే ఉంటుందని చెప్పారు. తనపై ముందుగా దాడి చేశారని ఢిల్లీలోని విశ్వాస్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శర్మ తెలిపారు. కాగా, నిన్న జరిగిన దాడిలో తాను కూడా గాయపడ్డానని శర్మ కేసు పెట్టారు. ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారని, తీవ్రమైన గాయాలు కాలేదని ఢిల్లీ పోలీసు కమిషనర్ బీఎస్ బస్సీ తెలిపారు.