రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం...
హైదరాబాద్: హైదరాబాద్‌లో త్వరలోనే తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్ సంగీతా రెడ్డి తెలిపారు. విదేశీ పెట్టుబడులను ఆకర్శించేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలో ఏదేశంలోనూ లేని పారిశ్రామిక విధానాన్ని రూపొందించిందనీ, దీని ద్వారా లక్షల కోట్లు పెట్టుబడులుగా రాబట్టవచ్చని చెప్పారు. గురువారం జరిగిన తమిళనాడు గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఆమె స్వాగతోపన్యాసం చేశారు.
పారిశ్రామిక రంగంలో మరింత పురోభివృద్ధి సాధించేందుకు వీలుగా తమిళనాడు రాష్ట్రం రూ.లక్ష కోట్ల పెట్టుబడులను గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ ద్వారా సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మే 23, 24 తేదీలలో చెన్నైలో జరిగే ఈ సదస్సులో దేశంలోని వివిధ రాష్ట్రాల పారిశ్రామికవేత్తలతో పాటు సింగపూర్, మలేషియా, శ్రీలంక, జపాన్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా, కెనడా,ఆస్ట్రేలియా దేశాల నుంచి దాదాపు మూడువేల మంది పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారని తమిళనాడు పరిశ్రమలశాఖ మంత్రి పి.తంగమణి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. పారిశ్రామిక రంగంలో తమిళనాడు రాష్ట్రం నిశ్శబ్ద విప్లవం సాధిస్తోందని, విజన్ 2023లో భాగంగా రాబోయో ఎనిమిదేళ్లలో గతంలో ఎన్నడూ చూడలేనంత ప్రగతిని తమ రాష్ట్రం సాధించబోతుందన్నారు. ఏరోస్పేస్, ఆగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ఆటో కాంపొనెంట్స్, రసాయనాలు, పెట్రోకెమికల్స్, మినరల్స్, ఎలక్ట్రానిక్స్ హార్డ్‌వేర్, హెవీ ఇంజినీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాసూటికల్స్, బయోటెక్నాలజీ, రెన్యువబుల్ ఎనర్జీ, స్కిల్ డెవలప్మెంట్, జౌళి రంగాల్లో ప్రపంచంలోని వివిధ దేశాల ఇన్వెస్టర్లనుంచి పెట్టుబడులను ఆశిస్తున్నామని తంగమణి చెప్పారు. ఈ సదస్సులో సురానా ఇండస్ట్రీస్ అధినేత దేవేంద్ర సురానా, బాబు థామస్ (హెచ్ఎల్ఎల్ లైఫ్‌కేర్), ఇలాంజెళియన్ (సన్మినా)తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.