ఏడేళ్లలో 17 కొత్త గనులు: శ్రీధర్
బొగ్గు ఉత్పత్తి పెంచడమే లక్ష్యం
సింగరేణి సీఎండీగా బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి విజన్ ప్రకారం రాబో యే ఏడేళ్లలో 17 కొత్త బొగ్గు గనులు ప్రారంభిస్తామని కంపెనీ నూతన చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ శ్రీధర్ స్పష్టం చేశారు. దీంతో 32 మిలియన్ టన్నుల అదనపు బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఏర్పడుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు లోటును తీర్చేందుకు బొగ్గు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం మాట్లాడుతూ సింగరేణి సంస్థకు తనను సీఎండీగా నియమించడం సంతోషంగా ఉందని, అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కొత్త పరిశ్రమలు, కొత్త పథకాలు శరవేగంతో అమలు చేయాలన్న సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో... విదేశాల్లోనూ బొగ్గు బ్లాకులు తీసుకొని ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు చేపడుతామన్నారు.
600 మెగావాట్ల సామర్థ్యంతో మరో ప్లాంటు నిర్మాణానికి సంసిద్ధమవుతున్నట్లు చెప్పారు.
సుతీర్థ భట్టాచార్యకు వీడ్కోలు: సింగరేణి సంస్థకు ఇప్పటివరకు సీఎండీగా పని చేసిన సుతీర్థ భట్టాచార్యకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. అధికారులు ఆయనను ఘనంగా సన్మానించారు.