‘విజిట్’లో టెక్నో ఫెస్టివల్ ఉత్సవ్–2కె17
తెలికిచెర్ల (నల్లజర్ల) : కళాశాలలో ఎంతమంది చేరారన్నది ముఖ్యం కాదు వారిలో దేశానికి ఉపయోగపడేవారిని ఎంతమందిని తయారు చేయగలిగామన్నదే తమ ధ్యేయమని విజిట్ కళాశాల చైర్మన్, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. కళాశాలలో శుక్రవారం టెక్నో ఫెస్టివల్ ఉత్సవ్–2కె 17ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు జ్ఞానం అందించకుండా కేవలం సర్టిఫికెట్లకే పరిమితం చేయడం దేశద్రోహంగా భావిస్తానని చెప్పారు. అలా విద్యాభ్యాసం చేసిన వారు దేశ ప్రగతికి అవరోధంగా, భారంగా మారుతున్నారన్నారు. అలా చేయడం తన విధానానికి విరుద్ధమని చెప్పారు. తొలుత జేఎన్టీయూ కాకినాడ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్య కమిటీ సభ్యులు గ్రంధి సత్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు దేశభక్తి, సేవానిరతి, గౌరవభావం పెంపొందించుకోవాలని వారు ఉద్భోదించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జీవీ రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గ్రంధి సాయిబాబా వరప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఆనంద్‌కుమార్, కార్యక్రమ కన్వీనర్ డాక్టర్ రాంబాబు, ఎంబీఏ విభాగాధిపతి ప్రొఫెసర్ కేవీ సత్యప్రకాష్, సివిల్ విభాగాధిపతి ప్రొఫెసర్ సోమశేఖర్రాజు, ఈఈఈ విభాగాధిపతి కె.రాజేంద్ర, మెకానికల్ విభాగాధిపతి డాక్టర్ హసన్ పాల్గొన్నారు.