visitation of families
-
8 నుంచి షర్మిల పరామర్శ యాత్ర
⇒ కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రారంభం ⇒ మహానేత మరణవార్త విని మృతిచెందిన కుటుంబాల పరామర్శ ⇒ వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడి ⇒ యాత్ర పోస్టర్ విడుదల మహబూబ్‌నగర్ అర్బన్: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించిన మేరకు ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లాలో ఆయన సోదరి షర్మిల పరామర్శ యాత్ర నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, సీజీసీ మెంబర్ ఎడ్మ కిష్టారెడ్డి వెల్లడించారు. సోమవారం స్థానిక న్యూటౌన్‌లోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం, మాల్నుంచి కురిమేడు గ్రామంలో షర్మిలమ్మ యాత్ర ప్రవేశిస్తుందన్నారు. మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణవార్త విని తట్టుకోలేక వేలాదిమంది చనిపోయారని అన్నారు. ఆ సందర్భంగా నల్లకాలువలో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ తమ తండ్రి మరణాన్ని విని ప్రాణాలుకోల్పోయిన అందరి కుటుంబాలను సందర్శించి ఓదారుస్తానని మాటిచ్చారని గుర్తుచేశారు. అప్పట్లో రాయలసీమ, ఆంధ్రాతోపాటు ఖమ్మం జిల్లాలో జగనన్న ఓదార్పుయాత్రను దిగ్విజయంగా చేపట్టారని అన్నారు. అప్పుడు జిల్లాలో జరగాల్సిన యాత్ర వాయిదా పడిందని.. ఆ యాత్రను ఇప్పు డు జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల పూర్తి చేసేందుకు వస్తున్నారని చెప్పారు. ఈ యాత్ర జిల్లాలో ఐదు రోజులపాటు పది అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 19 కుటుంబాలను కలుసుకొని వారిని పలుకరించనున్నట్లు తెలిపారు. ఇది ఎన్నికల సమయం కాదని, మరో ఐదేళ్ల వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలూ లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి జిల్లాలో షర్మిల పర్యటిస్తున్నారని చెప్పారు. యాత్రకు సహకరించండి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాల తారతమ్యం లేకుండా అన్ని వర్గాల ప్రజల కోసం సంక్షేమ, సహాయ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఎడ్మ కిష్టారెడ్డి అన్నారు. అందుకే మహానేత ప్రజలందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించారని, రాజకీయాలకతీతంగా జరిగే ఈ యాత్రకు సహకరించాలని కోరారు. రైతులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా వినూత్న పథకాలు అమలు చేసినందుకే వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఈ యాత్ర సందర్భంగా పలుచోట్ల వైఎస్ విగ్రహాలతోపాటు ఆయా గ్రామాల్లోగల జాతీయ నాయకులందరికీ నివాళులు అర్పిస్తారని, మరికొన్ని చోట్ల పార్టీ శ్రేణులు, అభిమానులు నిర్మిస్తున్న నూతన విగ్రహాలను ఆవిష్కరిస్తారని తెలిపారు. జిల్లాలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకోగా తమ పార్టీ పరంగా 157 మందికి సొంతంగా, 421 జీఓ, ఎన్ఎఫ్బీఎస్ పథకాల కింద ఆర్థికసహాయం అందించామని అన్నారు. అందుకే వీలైతే ఈ పరామర్శయాత్రలో సందర్శించే గ్రామాల్లోగల రైతు ఆత్మహత్యల కుటుంబాలను కూడా పరామర్శించే అవకాశం ఉందన్నారు. వైఎస్ అభిమానులు యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు మాదిరెడ్డి భగవంతురెడ్డి, మామిడి శ్యాంసుందర్‌రెడ్డి, బీష్వ రవీందర్, హైదర్ అలీ, జెట్టిరాజశేఖర్, పుల్లయ్యశెట్టి, భీమయ్యగౌడ్, బంగి లక్ష్మణ్, హన్మంతు, నసీర్, శేఖర్ పంతులు పాల్గొన్నారు. -
బిజీబిజీగా..
- బంధువులు,స్నేహితులతో కలివిడిగా జగన్ - కుటుంబ సభ్యులతో కలిసి పలు వివాహాలకు హాజరు - వేంపల్లెలో మూడు కుటుంబాలకు పరామర్శ సాక్షి కడప/కార్పొరేషన్/వేంపల్లె/ముద్దనూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడిపారు. ఒకపక్క వివాహ కార్యక్రమాలకు హాజరవుతూనే.. మరోపక్క తనను కలవడానికి వస్తున్న ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వచ్చారు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం 7గంటలవరకు క్యాంపు కార్యాలయంలో ప్రజలు, రైతులతో గడిపారు. వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం ఒకరోజు జిల్లా పర్యటనకు హైదరాబాదునుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ముద్దనూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వైఎస్సార్సీపీ అధ్యక్షుడు,ప్రతిపక్షనాయకుడు వైయస్ జగన్మోహన్రెడ్డికి అభిమానులు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ,సతీమణి భారతీరెడ్డితో కలసి రైలు దిగిన జగన్మోహన్రెడ్డికి ఎంపీ వైయస్ అవినాష్‌నెడ్డి, మైలవరం జెడ్పీటీసీ సభ్యుడు భూపేష్‌రెడ్డి,సంబటూరు ప్రసాద్‌రెడ్డి,రాయచోటి మదన్‌మోహన్‌రెడ్డి,వ్యక్తిగత కార్యదర్శి రవి ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గాన పులివెందులకు బయలుదేరి వెళ్ళారు. పులివెందులలోని వీజే కళ్యాణ మండపంలో జరిగిన వైఎస్ జోసఫ్‌రెడ్డి కుమార్తె వీణా, పవన్‌కుమార్‌రెడ్డి వివాహానికి గురువారం ఉదయాన్నే వైఎస్ జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. సాయంత్రం పాల్‌రెడ్డి ఫంక్షన్ హాలులో పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డి మనుమడు, తొండూరు మండల ఇన్‌ఛార్జి వైఎస్ మధురెడ్డి కుమారుడు వైఎస్ అభినవ్‌రెడ్డి, కృష్ణచైతన్యల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, సోదరి షర్మిల, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తదితరులతో కలిసి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనంతరం అంబకపల్లె లక్ష్మినారాయణరెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి, సుమతి వేముల జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి సోదరుడు చంద్రమోహన్‌రెడ్డి, కవితల వివాహానికి కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత కడపకు వెళ్లి సోమశేఖరరెడ్డి కుమార్తె శివతేజ, మనో వికాస్‌లను ఆశీర్వదించారు. శిల్పారామంలో ఇందుకూరు రమణారెడ్డి కుమార్తె ప్రశాంతి, సునీల్ రిసెప్షన్ వేడుకకు హాజరై వారిని ఆశీర్వదించారు. మూడు కుటుంబాలకు పరామర్శ : మండల కేంద్రమైన వేంపల్లెకు చెందిన వైఎస్ఆర్ సీపీ కార్యకర్త బొమ్మిరెడ్డి రామిరెడ్డి 10రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. గురువారం మధ్యాహ్నం వైఎస్ జగన్ వేంపల్లెకు వెళ్లి రామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కొరివి నరసింహారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వేంపల్లెకు చెందిన కొండయ్య ఈ మధ్యనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైఎస్ జగన్ కొండయ్య భార్య ఈశ్వరమ్మను పరామర్శించారు. ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్ వల్లీ ఆయన వెంట ఉన్నారు. అంతకు ముందు వేంపల్లెకు చేరుకున్న వైఎస్ జగన్‌కు ఘనస్వాగతం లభించింది. వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్యేలు : పులివెందుల పర్యటనకు వచ్చిన వైఎస్ జగన్‌ను జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కలుసుకున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌వివేకానందరెడ్డి, ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, అంజాద్‌బాషా, కొరముట్ల శ్రీనివాసులు, మేయర్ సురేష్‌బాబు తదితరులు కలిసి అనేక అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు పలువురు పాల్గొన్నారు. రాజన్న పాలన కోసం ఎదురు చూస్తున్నాం రాజన్న పాలన కోసం తాము ఎదురు చూస్తున్నామని కడపలోని రవీంద్రనగర్ మహిళలు వైఎస్ జగన్మోహన్రెడ్డితో అన్నారు. గురువారం ఆయన కొమ్మా సోమశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి వెళ్తుండగా కొందరు మహిళలు ఆయన కాన్వాయ్కి అడ్డుపడి దిగాలని పట్టుబట్టారు. ఎన్నికల్లో మీ ప్రభుత్వమే వస్తుందని ఆశపడ్డామని పరిస్థితి తారుమారయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ వారిని ఆప్యాయంగా పలకరించి, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.