కాయ్ రాజా.. కాయ్!
సాక్షి, విశాఖపట్నం : కాయ్ రాజా.. కాయ్..! ఒకటికి పది.. వందకు వెయ్యి.. లక్షకు పది లక్షలు..! ఇదేదో కోడి పందాల జోరనుకుంటే.. ఈవీఎంల్లో కాలేసినట్టే..! ప్రస్తుత ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ రాయుళ్ల జోరుకు నిదర్శనమిది. సాధారణ కార్మికుడు/ఉద్యోగి నుంచి ఉన్నతస్థాయి వ్యాపారుల వరకు ఇదే తీరు. బుధవారం ఓటింగ్ ముగిసిన వెంటనే బెట్టింగ్‌ల జోరు మొదలయింది. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తుందని ఒకటికి పది రెట్లు చెల్లించేందుకు కూడా బెట్టింగ్ వీరులు పిలుపునివ్వడం గమనార్హం.
విజయమ్మ మెజార్టీపై బెట్టింగ్‌ల జోరు
ఇప్పటి వరకు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ కాసే బెట్టింగ్ రాయుళ్ల దృష్టి ఎన్నికల ఫలితాలపై పడింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుపై జోరుగా పందేలు జరుగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బెట్టింగ్ వీరులు ఎక్కువగా దృష్టి సారించారు. అందులోనూ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ మెజార్టీపై ఎక్కువ మంది దృష్టి సారించారు. లక్ష ఓట్లు.. రెండు లక్షల ఓట్ల మెజార్టీపైనే బెట్టింగ్‌ల జోరుంది. ఇతర జిల్లాల నుంచి కూడా బెట్టింగ్ రాయుళ్లు విశాఖపై కన్నేశారు. దీనికి విజయమ్మ విశాఖ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడమే కారణం. రాయలసీమ జిల్లాలకు చెందిన వారు ఎక్కువగా ఈ స్థానంపై బెట్టింగ్ వేస్తున్నట్టు తెలిసింది. ఐపీఎల్ బెట్టింగ్ ఏజెన్సీలన్నీ ఇపుడు క్రికెట్ మ్యాచ్‌లను పక్కనెట్టి.. ఎన్నికల ఫలితాలపైనే దృష్టిసారించాయి.
వైఎస్సార్ సీపీకి 100 సీట్లు
దీంతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 100 సీట్లు వస్తాయన్న అంశంపైనా బెట్టింగ్ పోటీ తీవ్రంగా ఉంది. ఈ అంశంలో 1ః2/1ః3 నిష్పత్తిలో బెట్టింగ్ ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. వంద సీట్లు రావనేవాళ్లు రూపాయి కడితే.. వంద సీట్లకుపైనే వస్తాయనుకునేవాళ్లు రూ.2/రూ.3 కూడా చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. ఎక్కువగా విశాఖతో సంబంధం లేనివాళ్లే ఆన్లైన్/ఫోన్లైన్ల ద్వారా ఈ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికల బెట్టింగ్ రాష్ట్రమంతా విస్తరించింది. చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే జరిగేలా ఎక్కువ మంది మధ్య ఒప్పందం కుదిరినట్టు సమాచారం.
స్థానిక సీట్లపై ‘లోకల్’
మరోవైపు స్థానిక సీట్లపై కూడా బెట్టింగ్‌లు జోరుగానే ఉన్నాయి. అయితే ఇవి రూ.వేలల్లోనే పరిమితమవుతున్నాయి. నగరంలో ఎక్కువగా విశాఖ తూర్పు, ఉత్తరం నియోజకవర్గాలపై బెట్టింగ్ జోరందుకుంది. ఈ స్థానాల్లో టీడీపీ, బీజేపీ నేతలు అంచనాలకు మించి డబ్బులు వెదజల్లడం వల్లే స్థానికుల్లో ఆసక్తి నెలకొంది. దీంతో ఎక్కడ నలుగురు గుమిగూడినా.. ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది? అన్న అంశాల ప్రాతిపదికగా బెట్టింగ్ వేస్తున్నారు.