తల్లిదండ్రుల చేతుల్లోనే భవిష్యత్
యండమూరి వీరేంద్రనాథ్
చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : విద్యార్థులు చాలా చదువులో వెనకబడి ఉన్నారంటే దానికి మూల కారణం పాఠం ఉపాధ్యాయులు కాదని, ముఖ్య కారణం తల్లిదండ్రులేనని సినీ రచయిత, కవి యండమూరి వీరేంధ్రనాథ్ అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని విష్ణుప్రియ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ’విద్యార్థులు, పోషకులు’ అనే కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ... విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో ఆట, పాట కూడా అంతే అవసరమన్నారు.
శని, ఆదివారాల్లో తమ పిల్లలకు ఆటపాటలతో చారిత్రక సంఘటనలు వివరించాలన్నారు. అలా చేస్తే ప్రతి విద్యార్థి అబ్దుల్ కలాం, మదర్ థెరిస్సా అవుతారని అన్నారు. తాను విద్యార్థి దశలో అనేక కష్టాలను అనుభవించానని యుండమూరి గుర్తు చేసుకున్నారు. 6, 7 తరగతుల్లో ఫెయిల్ అయ్యానని, ఆ సమయంలో తన తండ్రి తనను సరైన మార్గంలో పెట్టడానికి ఎంతో కృషి చేశారని అన్నారు. అప్పటి నుంచి పట్టదలతో సీఏ పూర్తి చేశానన్నారు.
అటు తరువాత చిన్న చిన్న కథలు రాయడం ఆ కథలను ప్రజలు ఆదరించడం జరిగిందన్నారు. అప్పట్లో చిరంజీవి నటించిన అభిలాష సినిమా కథ తనదేనన్నారు. అటు తరువాత అనేక పుస్తకాలు, నవలలు రాస్తూనే ఉన్నట్లు యుండమూరి అన్నారు. అంతకు ముందు ఆయన కొంతమంది విద్యార్థులను పిలిచి వారి ఇష్టాఇష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉన్న అనుబంధాలను గురించి వివరించారు. కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు రామచంద్రారెడ్డి, సీఐ బాలాజీసింగ్, విద్యా నిపుణులు కోడి రంగప్ప, కసపా మాజీ తాలూకా అధ్యక్షుడు గోపాలగౌడ తదితరులు పాల్గొన్నారు.