viswa bramhins
-
సీఎం చిత్రపటానికి విశ్వబ్రాహ్మణుల క్షీరాభిషేకం
ఒంగోలు : సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ సంఘ నేతలు, వైఎస్సార్సీపీ నాయకులు శనివారం క్షీరాభిషేకం చేశారు. స్థానిక రంగారాయుడు చెరువు వద్ద ఉన్న మది్వరాట్ శ్రీపోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పిలిస్తే పలికే దైవంలా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు. రాష్ట్రవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు సైతం ఇబ్బందిగా ఉన్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో ప్రత్యేకమైన జీవో ద్వారా నెలకు రూ.5 వేలు కేటాయిస్తూ ఉత్తర్వులివ్వడం హర్షణీయమన్నారు. విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం మొత్తానికి ఇది ఒక శుభదినంగా చెప్పారు. జీవో జారీ అయ్యేందుకు కృషిచేసిన స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గోనుగుంట్ల రజని, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుతారం శ్రీనివాసులు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, కటారి శంకర్, సాంస్కృతిక విభాగం జోనల్ ఇన్చార్జి బొట్ల సుబ్బారావు, ధరణికోట లక్ష్మీనారాయణ, నగరపాలక సంస్థ కార్పొరేటర్ ఆదిపూడి గిరిజా శంకర శాండిల్య తదితరులు పాల్గొన్నారు. -
బీసీలందరూ జగన్ వెంటే ఉన్నారు
భవానీపురం (విజయవాడ పశ్చిమ): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇన్నాళ్లకు బీసీలు గుర్తొచ్చారా అని ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ ప్రశ్నించారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఎందుకు ఈ కులాలు గుర్తుకు రాలేదని నిలదీశారు. గురువారం విజయవాడ గొల్లపూడిలో ఉన్న బీసీ సంక్షేమ భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లూ బీసీల పార్టీ అని చెప్పుకుని ఓట్లు దండుకుని అధికారంలోకి వచి్చన తరువాత వారిని మోసం చేసిన చంద్రబాబు పెట్టాల్సింది సాధికార సభలు కాదని, బీసీలకు బహిరంగ క్షమాపణ సభలని అన్నారు. రాష్ట్రంలో బీసీలందరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట ఉన్నారని స్పష్టంచేశారు. జనరల్ స్థానాల్లో బీసీలకు మేయర్, జిల్లా పరిషత్ చైర్మన్లుగా అవకాశం కల్పించిన సీఎం జగన్మోహన్రెడ్డి బీసీల పక్షపాతిగా నిలిచారని అన్నారు. బీసీ మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించటం ద్వారా వారు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనటం రాజకీయ చైతన్యం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే బీసీల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారని, ఆ పని మీరు ఎందుకు చేయలేక పోయారని చంద్రబాబును ప్రశ్నించారు. నాలుగు దశాబ్దాలుగా బీసీ ఉద్యమాల్లో ఉన్న ఆర్ కృష్ణయ్యను ఎన్నికల్లో వాడుకుని చంద్రబాబు వదిలేస్తే ఆయన్ని రాజ్యసభకు పంపిన ఘనత సీఎం జగనన్నకు దక్కుతుందన్నారు. -
ఇత్తడైనా.. ‘బుడితి’ చేతిలో పుత్తడే !
‘బుడితి’ వస్తువు లేకపోతే శుభ కార్యాల్లో వెలితి అని ఉత్తరాంధ్ర వాసుల నోట నానేటి మాట. అక్కడి నుంచి ఇత్తడి సారె, సామాను తీసుకురాకుంటే ఏ పెళ్లికైనా నిండుదనం రాదంతే. ఆ ఊరి విగ్రహాలు లేకుంటే ఎంత పెద్ద ఆలయానికైనా శోభ రాదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలోని బుడితి గ్రామం కంచు, ఇత్తడి వస్తువులకు శతాబ్దానికి పైగా కేరాఫ్. సారవకోట: దాదాపు నూటయాభై ఏళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాలోని బుడితి పుత్తడి బొమ్మలకు పెట్టింది పేరు. స్వచ్ఛమైన బంగారంతో ఇక్కడి కళాకారులు చేసే ఏ వస్తువైనా ప్రత్యేకంగా కనిపిస్తుండేది. కాలక్రమేణా వీరి వృత్తి పుత్తడి నుంచి ఇత్తడికి చేరింది. ముడి సరుకు మారినా వారి పనితీరు మాత్రం మారలేదు. అప్పట్లో చేతితోనే ఏ వస్తువైనా తయారు చేసేవారు. ఇలా ఇక్కడి విశ్వ బ్రాహ్మణులు ఓ బ్రాండ్‌గా మారి ఇత్తడి వస్తువుల పరిశ్రమను అభివృద్ధి చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఇక్కడ సుత్తుల సవ్వడులు, బిందెల మోతలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీరి వృత్తిలోనూ యంత్రాల వినియోగం ఊపందుకోవడంతో.. ఆ మేరకు కార్మికుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుండం గమనార్హం. నమ్మకమే పెట్టుబడి.. ఇక్కడి కార్మికుల పనితీరుపై ఉన్న నమ్మకమే ఇత్తడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి దోహదపడింది. పవిత్రమైన దేవాలయాల నుంచి సామాన్య మధ్య తరగతి ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు అవసరమైన వస్తువులూ ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ తయారైన దేవతా విగ్రహాలు దేశంలోని పలు దేవాలయాల్లో కొలువై ఉన్నాయి. బిందెలు, గృహోపకరణాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాల్లో ఉపయోగించే మకర తోరణాలు, గంటలు వీరి ప్రత్యేకత. ఇక్కడి వస్తువులపై నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు వస్తుంటాయి. ప్రతి ఇంటా అనుబంధం ఇత్తడితో ప్రతి ఇంటికీ విడదీయరాని అనుబంధం ఉంటుంది. పెళ్లి నుంచి చావు వరకు ఈ వస్తువులు లేని కార్యక్రమం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ ఇంటిలోనైనా పెళ్లి కుదిరిందంటే ముందుగా బంగారం కన్నా ఇత్తడి వస్తువులనే కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం యంత్రాలతో తయారవుతున్న వస్తువులు మార్కెట్లో విరివిగా చలామణి అవుతుండడంతో వీరి ఆదాయానికి భారీగా గండి పడుతోంది. లేపాక్షి ఆర్డర్లు.. ఇక్కడ తయారైన వస్తువులు లేపాక్షి వారు కొనుగోలు చేసి వాటిని పలు ప్రాంతాలు, రాష్ట్రాల్లో జరుగుతున్న వస్తు ప్రదర్శనలకు తీసుకెళ్తుంటారు. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ వస్తు ప్రదర్శనల్లో బుడితి కంచు, ఇత్తడి వస్తువులకు భలే గిరాకీ ఉంటుందని తయారీ దారులు తెలిపారు.అయితే లేపాక్షి వారు వస్తువులు ఆర్డర్ చేసే సమయంలో అడ్వాన్స్‌గా తక్కువ మొత్తం చెల్లిస్తుండడంతో.. వస్తువులు తయారు చేయడానికి తగిన పెట్టుబడి లేక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర పనులకు వెళ్లిపోతున్నారు గ్రామంలో సుమారు వందేళ్ల నుంచి మా కుటుంబం ఈ పనిచేస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఇత్తడి వస్తువులకు డిమాండ్ అనుకున్నంత లేకపోవడంతో కొందరు ఈ పనిని వదిలి ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. గతంలో వందలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవి. – పాటోజు శ్రీనివాసాచార్యులు, చీడిపూడి, సారవకోట మండలం ఈ పనిపైనే జీవిస్తున్నాం మా తాత, ముత్తాతల నుంచి ఈ పనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నేను చిన్నతనం నుంచి పనిచేస్తున్నాను. ఇదే పనిని వృత్తిగా చేసుకుందామని ప్రస్తుత యువతరం ముందుకు రావడం లేదు. దీంతో మా తదనంతరం ఈ పని చేసేవారు ఉంటారనే నమ్మకం లేకుండా పోతుంది. – కింతాడ కృష్ణారావు, విగ్రహ తయారీ దారు, చీడిపూడి, సారవకోట -
జయంతిని వర్ధంతి అంటారా?
సాక్షి, గుంటూరు : ఈనెల 17న విశ్వకర్మ జయంతి సందర్భంగా జయంతికి బదులుగా వర్ధంతి, విశ్వబ్రాహ్మణులకు బదులుగా నాయీ బ్రాహ్మణులుగా చంద్రబాబు పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపినట్లుగా ఏబీఎన్ టీవీ చానల్లో స్క్రోలింగ్ ప్రసారమైందని విశ్వబ్రాహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంఘం నేత కె.మయబ్రహ్మాచారి ఆదివారం గుంటూరు కొత్తపేటలోని మూడంతస్తుల హోర్డింగ్ పైకి ఎక్కి నిరసన తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బ్రహ్మాచారితో మాట్లాడి కిందికి దించి, అతన్ని స్టేషన్‌కు తరలించారు. విశ్వబ్రాహ్మణ సంఘీయుల మనోభావాలు దెబ్బతీసిన ఏబీఎన్ యాజమాన్యం, ప్రతిపక్ష నేత చంద్రబాబు క్షమాపణ చెప్పాలని బ్రహ్మాచారి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు బీసీ కులాలపై చిన్నచూపు తగదని హితవు పలికారు. -
ఆ భరోసాతో స్వర్ణ కాంతులు
పేరులో స్వర్ణముంది. బతుకు మాత్రం దుర్భరంగా మారింది. ఒకప్పుడు పట్టిందల్లా బంగారమే అన్నట్టు వారి జీవితాలు సాగిపోయేవి. ఇప్పుడు పూట గడవటమే కష్టంగా మారింది. స్వర్ణకారుల జీవితంలో చీకట్లు అలముకున్నాయి. ఇప్పుడు వారంతా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే భారం వేశారు. ఆదుకుంటామని ఆయన ఇచ్చిన భరోసాతో కొండంత ధైర్యాన్ని నింపుకున్నారు. పార్వతీపురం : ‘ముక్కు పుడకల నుంచి మంగళ సూత్రాల వరకు.. ఉంగరం మొదలుకుని నెక్లెస్ వరకు అన్నీ రెడీమేడ్ దొరుకుతున్నాయి. మాకు బతుకుదెరువు లేకుండా పోయింది’ అని స్వర్ణకారులంతా ముక్తకంఠంతో చెప్పారు. స్వర్ణకారుల జీవితాలు ఎలా ఉన్నాయి, వారు ఎదుర్కొంటున్న సమస్యలేమిటి అన్న అంశంపై పార్వతీపురం స్వర్ణకారులతో ‘సాక్షి’ రచ్చబండ నిర్వహించింది. పొట్నూరి రవికిరణ్ మాట్లాడుతూ.. ‘ఆభరణాల రంగంలోకి కార్పొరేట్ సంస్థలు వచ్చాక స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలకు డిమాండ్ తగ్గింది. కొర్పొరేట్ వ్యాపారులతో కొంతవరకు అయినా పోటీ పడాలంటే.. మేం కూడా యంత్రాలు కొనాలి. విద్యుత్ చార్జీలు భరించాలి. అంత సొమ్ము మా దగ్గర లేదు. ఏం చేస్తాం’ అని వాపోయాడు. ‘రసాయనాల వాడకం వల్ల మా ఆరోగ్యం దెబ్బతింటోంది. 50 ఏళ్లకే మేం మంచాన పడుతున్నాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు’ అని సింహాద్రి దుర్గారావు అనే స్వర్ణకారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా తమ సమస్యలు తెలుసుకున్నారని స్వర్ణకారులు చెప్పారు. ఉపాధి లేక అల్లాడుతున్న తమకు వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా కొండంత ధైర్యాన్ని నింపిందన్నారు. తమ జీవితాల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తమ పాలిట దేవుడిలా కనిపిస్తున్నారని చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. స్వర్ణకారుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే ఏం చేయాలి, వైఎస్ జగన్ ఇచ్చిన హామీలేమిటనేది వారి మాటల్లోనే..- బంకపల్లి వాసుదేవరావు రాజన్న పాలనలో లబ్ధి పొందాం వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో స్వర్ణకారులమైన మేం అనేకవిధాల అబ్ధి పొందాం. ఇళ్లు వచ్చాయి. రుణాలు ఇచ్చారు. ఆయన మరణంతో కార్పొరేషన్ ఏర్పాటు ఆగిపోయింది. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్‌ను పక్కన పెట్టి ఫెడరేషన్‌ను ముందుకు తెచ్చింది. దీనివల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. తద్వారా అందరికీ రుణాలు అందుతాయి. . – ముంతా సంతోష్‌కుమార్, స్వర్ణకారుడు విద్యుత్ రాయితీ ఇవ్వాలి బంగారు ఆభరణాల విక్రయాల్లోకి కార్పొరేట్ శక్తులు వచ్చిన తరువాత స్వర్ణకారులు తయారు చేసే ఆభరణాలకు డిమాండ్ తగ్గింది. బంగారు ఆభరణాలు తయారు చేసే యంత్రాలు కొనుగోలు చేయాలంటే పెట్టుబడులు కావాలి. కార్పొరేషన్ ఏర్పాటైతే ఈ సమస్య తీరిపోతుంది. యంత్రాలను వినియోగిస్తే విద్యుత్ ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులకు విద్యుత్ చార్జీల్లో రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి. ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తానని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆయన ఒక మాట ఇస్తే.. మాట మీద నిలబడే వ్యక్తి. అందుకే ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం.– పొట్నూరు రవికిరణ్, స్వర్ణకారుడు జిల్లాకో పారిశ్రామిక శిక్షణ కేంద్రం కావాలి బంగారు ఆభరణాల తయారీపై ప్రతి జిల్లా కేంద్రంలో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే యువతకు ఎంతో ఉపయోగ పడుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వారికి బ్యాంకుల్లో బంగారం నాణ్యత, తూకం వేసే ఉద్యోగాలు ఇవ్వాలి. కార్పొరేట్ వ్యాపారులకు నగలు తయారు చేసేలా శిక్షణ ఇవ్వాలి.– పట్నాల వెంకట్రావు, కార్యదర్శి, స్వర్ణకార సంఘం, పార్వతీపురం తాళిబొట్ల తయారీ హక్కు మాకే ఇస్తామన్నారు తాళిబొట్లను తయారు చేసుకునే హక్కును స్వర్ణకారులకే ఇస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన విశ్వ బ్రాహ్మణులకు అనేక హామీలు ఇచ్చారు. ఉపాధి అవకాశాలు కొరవడుతున్న సమయంలో తాళిబొట్లు తయారు చేసే హక్కును మాకు ఇస్తామని చెప్పడంతో స్వర్ణకార యువతలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మా కష్టాలు విన్న నాయకుడు ఆయనొక్కడే. ఆయన అధికారంలోకి రాగానే మాకు మంచి రోజులొస్తాయి – వి.చంద్రశేఖర్, స్వర్ణకారుడు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు విశ్వబ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్సీ సీటు ఇచ్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టంగా చెప్పారు. విశ్వ బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్న అన్నివర్గాల అభ్యున్నతికి కట్టుబడి ఉంటానని మాట ఇచ్చారు. ఆయన మాటకు కట్టుబడి ఉండే మనిషి. అందువల్ల ఆ మాటను విశ్వసిస్తూ ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు అండగా ఉండాలని భావిస్తున్నాం– నడితోక శంకర్రావు, అధ్యక్షుడు, స్వర్ణకార సంఘం, పార్వతీపురం -
4న విశ్వబ్రాహ్మణ ఆత్మగౌరవ సభ
హైదరాబాద్: విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ సాధనకు వచ్చేనెల 4న నాగోల్‌లోని శుభం కన్వెన్షన్‌లో లక్షన్నర మందితో ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం సభ పోస్టర్‌ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భిక్షపతి మాట్లాడుతూ..తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే విశ్వబ్రాహ్మణుల సమస్యలు తీరుతాయనుకుని ఉద్యమంలో ముందుండి పోరాడామని, రాష్ట్రం వచ్చాక కూడా ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణులకు రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి పాలకమండలి నియమించాలని, యాభై ఏళ్లు దాటిన విశ్వబ్రాహ్మణులకు రూ. 5 వేల పింఛను ఇవ్వాలని, నిరుపేద విద్యార్థులకు విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీటితోపాటుగా ప్రమాదంలో మృతి చెందిన వారికి రూ. 5 లక్షల పరిహారం ఇవ్వాలని, విశ్వబ్రాహ్మణులను బీసీ ‘బీ’నుంచి బీసీ ‘ఏ’కు మార్చాలని కోరారు. తమ డిమాండ్లు ఏ పార్టీ నెరవేరుస్తుందో వారికే తమ పూర్తి మద్దతిస్తామన్నారు. సభకు అన్ని పార్టీల నాయకులకు ఆహ్వానం పంపినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డె సుదర్శనాచారి, ప్రధానకార్యదర్శి బచ్చల పద్మాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుపూరి వీరాచారి, కోశాధికారి మోత్కూరి వీరభద్రాచారి, గోపాలచారి, శ్రీనివాస్, బాలాచారి, బ్రహ్మంతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. -
విశ్వబ్రాహ్మణులు ఎదగాలి
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ భాయి పిలుపు ఐక్యతతో రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్ష సాక్షి, హైదరాబాద్: విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని గుజరాత్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ భాయి పాంచాల్ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలోని విశ్వకర్మ సోదరులందరూ ఐక్యంగా ఉండి.. అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలని, ఉన్నత స్థానాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారమిక్కడ రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మల) ఐక్యవేదిక ఏర్పాటు చేసిన సభలో పాంచాల్ మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు ఐక్యతతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలకు చేరుకోవడం సులువవుతుందని చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి విశ్వకర్మలందరూ ఆశీస్సులు అందజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశంలో 12 కోట్ల మంది విశ్వకర్మలున్నారని, మోడీ అధికారంలోకి రాగానే.. వారు చేతివృత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సాయమందిస్తామని హామీ ఇచ్చారు. గుజరాత్ రాష్ట్ర ఆర్టీసీ డెరైక్టర్ భగవాన్‌దాస్ పాంచాల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పక్షాలూ విశ్వబ్రాహ్మణులకు అన్యాయం చేశాయన్నారు. మనవారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఐక్యతతో ఉండాలని, అప్పుడే రాజకీయ ప్రాధాన్యత ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వకర్మలను ఏకం చేయటానికే తామిక్కడకు వచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర వహించిన విశ్వకర్మల ముద్దుబిడ్డలు జయశంకర్, శ్రీకాంతాచారిలకు జోహార్లు తెలుపుతున్నానన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వెంకటాచారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల నుంచి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోవడం శోచనీయమన్నారు. అందరమూ ఒకేతాటిపై నిలిచి రాజకీయంగా ఎదిగి అసెంబ్లీలో పాగా వేద్దామని విశ్వబ్రాహ్మణ సంఘం నేత పి.బ్రహ్మానందాచారి పిలుపు ఇచ్చారు. బీసీ నేత కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ దివంగత వైఎస్సార్‌హయాంలో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ను ప్రకటిస్తే.. కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం రూ.14.69 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చైర్మన్ కె.సి.కాలప్ప, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి టీఆర్ చారి, ఇంకా వడ్ల రాజు, కె.బంగారుబాబు, పి.ఆంజనేయులు, వి.నాగేశ్వరాచారి, దేవరకొండ వీరాచారి తదితరులు పాల్గొన్నారు.