విశ్వబ్రాహ్మణులు ఎదగాలి
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ భాయి పిలుపు
ఐక్యతతో రాజకీయంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్ష
సాక్షి, హైదరాబాద్: విశ్వబ్రాహ్మణులు రాజకీయంగా ఎదిగేందుకు కృషి చేయాలని గుజరాత్‌కి చెందిన బీజేపీ ఎమ్మెల్యే జగదీష్ భాయి పాంచాల్ పిలుపు ఇచ్చారు. రాష్ట్రంలోని విశ్వకర్మ సోదరులందరూ ఐక్యంగా ఉండి.. అభివృద్ధి చెందాలని, భవిష్యత్తులో ఎంపీలు, ఎమ్మెల్యేలు కావాలని, ఉన్నత స్థానాలకు చేరాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారమిక్కడ రవీంద్రభారతిలో విశ్వబ్రాహ్మణ(విశ్వకర్మల) ఐక్యవేదిక ఏర్పాటు చేసిన సభలో పాంచాల్ మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులు ఐక్యతతో ముందుకు సాగితే ఉన్నత స్థానాలకు చేరుకోవడం సులువవుతుందని చెప్పారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి విశ్వకర్మలందరూ ఆశీస్సులు అందజేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశంలో 12 కోట్ల మంది విశ్వకర్మలున్నారని, మోడీ అధికారంలోకి రాగానే.. వారు చేతివృత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు సాయమందిస్తామని హామీ ఇచ్చారు.
గుజరాత్ రాష్ట్ర ఆర్‌టీసీ డెరైక్టర్ భగవాన్‌దాస్ పాంచాల్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రాజకీయ పక్షాలూ విశ్వబ్రాహ్మణులకు అన్యాయం చేశాయన్నారు. మనవారు ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఐక్యతతో ఉండాలని, అప్పుడే రాజకీయ ప్రాధాన్యత ఏర్పడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని విశ్వకర్మలను ఏకం చేయటానికే తామిక్కడకు వచ్చామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర వహించిన విశ్వకర్మల ముద్దుబిడ్డలు జయశంకర్, శ్రీకాంతాచారిలకు జోహార్లు తెలుపుతున్నానన్నారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.వెంకటాచారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణుల నుంచి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోవడం శోచనీయమన్నారు. అందరమూ ఒకేతాటిపై నిలిచి రాజకీయంగా ఎదిగి అసెంబ్లీలో పాగా వేద్దామని విశ్వబ్రాహ్మణ సంఘం నేత పి.బ్రహ్మానందాచారి పిలుపు ఇచ్చారు. బీసీ నేత కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ దివంగత వైఎస్సార్‌హయాంలో విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ను ప్రకటిస్తే.. కిరణ్‌కుమార్‌రెడ్డి కేవలం రూ.14.69 కోట్లు కేటాయించటం దారుణమన్నారు. కార్యక్రమంలో సౌత్‌జోన్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ చైర్మన్ కె.సి.కాలప్ప, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి టీఆర్ చారి, ఇంకా వడ్ల రాజు, కె.బంగారుబాబు, పి.ఆంజనేయులు, వి.నాగేశ్వరాచారి, దేవరకొండ వీరాచారి తదితరులు పాల్గొన్నారు.