ఫిర్యాదు కోసం పెట్టెలు
బోయినపల్లి (రాజన్నసిరిసిల్ల): నేరాల నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ సీసీ కెమెరాలు, వాట్సప్ నెంబర్లు వినియోగంలోకి తెచ్చిన జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి.. కొత్తగా ఫిర్యాదుల పెట్టెలు ఏర్పాటు చేసి జనం సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఏర్పాటు చేసే ఫిర్యాదు పెట్టెలో కేవలం పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన పిర్యాదులే కాకుండా..అన్ని ప్రభుత్వ శాఖలపై తమకు జరిగిన అన్యాయాలపై, జరిగిన నష్టంపై పిర్యాదు చేయవచ్చు. వివిధ శాఖలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ పరిశీలించి సంబంధిత శాఖల ఉన్నతాధికారులకు తగు చర్య నిమిత్తం పంపిస్తారు. ఏ జిల్లా వారైనా సరే అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పెట్టెలో ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించారు.
కళాశాలలు, చౌరస్తాల్లో
ఫిర్యాదు పెట్టెలను జిల్లాలోని పెద్ద గ్రామాల చౌరస్తాలు, కళాశాలు, హైస్కూళ్లు, బాలికల హాస్టళ్లలో ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల, హైస్కూల్, హాస్టళ్లలో ఉండే యువతులు తమకు జరిగిన అన్యాయాలపై, ఈవ్ టీజింగ్, తదితర వేధింపులపై రాసి పెట్టెలో వేస్తే సరిపోతుంది. ఈ పెట్టెలను ఎస్పీ వారానికోసారి స్వయంగా పరిశీలించనున్నారు. ఫిర్యాదులో చిరునామా ఉంటే సమస్యపై తీసుకున్న నిర్ణయాన్నీ సదరు ఫిర్యాదుదారులకు తెలియజేస్తారు.