మృత్యువులోనూ వీడని బంధం
రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల దుర్మరణం
హైదరాబాద్(బాలానగర్): రోడ్డు ప్రమాదం ఇద్దరి భార్యాభర్తలను బలిగొన్న సంఘటన శుక్రవారం ఉదయం బాలానగర్ మండల పరిధిలోని పెద్దాయపల్లి గ్రామ ఎక్స్‌రోడ్డు వద్ద గల జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... కేరళ రాష్ట్రం పాలఖడ్ తాలుకా, కాలపత్తి గ్రామానికి చెందిన రిటైర్డు సీఐఎస్ఎఫ్, రిటైర్డు మిలిటరి అధికారి అయిన విశ్వనాథం (60) అతని భార్య శ్యామల (54) మనుమరాలు ప్రియలు కలిసి బెంగుళూర్ నుంచి తన షిప్టుకారులో హైదరాబాద్‌లో నివసిస్తున్న తమ కూతుళ్లు దివ్య, ధన్యల వద్దకు బయలుదేరారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున బాలానగర్ మండల శివారులోని పెద్దాయపల్లి ఎక్స్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిని వద్ద ఎలాంటి సిగ్నల్స్ పాటించకుండా ఓ లారి కుడివైపు ఉడిత్యాలవైపు యుటర్న్ మల్లుతుండగా వీరు ప్రయాణిస్తున్న కారు లారీని బలంగా ఢీకొంది.
దీంతో కారులో ముందు భాగంలో ఉన్న భార్యభర్తలు ఇద్దరు కారులోనే ఇరుక్కుని దుర్మరణం చెందారు. వెనుక సీట్లో కూర్చున్న మనుమరాలు ప్రియ (5)కు తీవ్రగాయాలపాలైంది. విషయం తెలుసుకున్న బాలానగర్ ఎస్ఐ అశోక్‌కుమార్ తన సిబ్బందితో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున భార్యభర్తల మృతదే హాలను బయటకు తీసి తీవ్రంగా గాయపడిన ప్రియను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన విశ్వనాథం అనంతపురం జిల్లా కోడికొండవద్ద గల జీఎంఆర్ రక్షక్ ట్రేనింగ్ సెంటర్లో రక్షక్ ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా వారి కూతుళ్లకు సమాచారం అందించి మృతదేహాలను షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.