viswanatha
-
నియమబద్ధ పుష్కరస్నానమే ఫలదాయకం
మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ రాజమహేంద్రవరం కల్చరల్ : గోదావరి ఆది పుష్కరాల్లోనైనా, అంత్య పుష్కరాల్లోనైనా స్నానం చేయడం వలన మూడున్నర కోట్ల తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని మహామహోపాధ్యాయ, శాస్త్రనిధి విశ్వనాథ గోపాలకృష్ణ అన్నారు. ‘పుష్కరస్నానం వినోదానికి కాదు. తీర్థస్నానాల విషయంలో మహర్షులు కొన్ని నియమాలను, సాంప్రదాయాలను ఏర్పాటు చేశారు. వాటిని ఆచరించినప్పుడే పుష్కరస్నాన ఫలితం లభిస్తుంది’ అన్నారు. గోదావరికి అంత్యపుష్కరాలు సమీపిస్తున్నందు పుష్కర స్నానానికి సంబంధించి ఆచార వ్యవహారాలను, శాస్త్రనియమాలను వివరించమని ‘సాక్షి’ కోరినప్పుడు ఇలా వివరించారు.. ‘నదీప్రవాహానికి అభిముఖంగా నిలబడి స్నానం చేయాలి. సాధారణంగా రాత్రి సమయాల్లో, భోజనానంతరం స్నానం నిషేధం. కానీ, మహానదుల విషయంలో–గ్రహణ, పుష్కరసమయాల్లో ఇటువంటి పట్టింపులు లేవు. గురు, శుక్రవారాలు, అధికమాసాలు, మూఢమి పట్టింపులు లేవు. పుష్కరదినాల్లో రాత్రివేళ ‘గౌతమీ మాహాత్మ్యము’ పారాయణ చేసి, మరుసటిరోజు పుష్కరస్నానం చేయడం ఒక సాంప్రదాయం. స్నానానికి ముందు గట్టుపై నిలబడి, మట్టిని తీసి, గోదావరి జలాల్లోకి ఈ కింది శ్లోకం చదువుతూ విసరాలి. ‘పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాం తే మయాదతా ్తమహారార్థం ప్రకల్పయా’ పై విధంగా చేయకపోతే, స్నానం చేసే వారి పుణ్యాన్ని ‘కృత్య’అనే శక్తి భక్షించి వేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక గోదావరి జలాల్లో స్నానం ప్రారంభించాలి. ముందుగా గోదావరీమాతకు నమస్కరించి, ఆచమనం చేసి, ఇలా సంకల్పం చెప్పుకోవాలి. ‘అస్యాం మహానద్యాం సమస్త పాపక్షయార్థం, సింహం గతే దేవగురౌ, సార్థ త్రికోటి తీర్థసహిత తీర్థరాజ సమాగమాఖ్య మహాపర్వణి పుణ్యకాలే అఖండ గౌతమీస్నాన మహం కరిష్యే’ సంకల్పం చెప్పాక సూర్యభగవానునికి అర్ఘ్యం ఇచ్చి, మరో సారి స్నానం చేయాలి. స్నానం పూర్తయ్యాక షోడశోపచారాలతో గోదావరి నదీమతల్లికి పూజలు చేయాలి. యథాశక్తి దానధర్మాలు చేయాలి. ఆదిపుష్కర స్నాన ఫలితమే అంత్యపుష్కర స్నానంతోనూ వస్తుందనడంలో సందేహం లేదు. -
తెలుగు నవలా చక్రవర్తి విశ్వనాథ
వైతాళికుడు: తెలుగునాట నవలలపై విస్తృత చర్చ జరుగుతున్న దరిమిలా 58 నవలలు రాసి విఖ్యాతి చెందిన విశ్వనాథను తలచుకోవడం నవలా రచనలో తెలుగువారి ప్రగాఢ ప్రవేశాన్ని గుర్తు చేసుకోవడమే. ‘నేను మానవ ప్రవృత్తిని ఆమూలాగ్రం పరిశీలించి తెలిసికొని వ్రాశాను. నాకు గ్రంథ రచన అంటే ఏమిటో తెలుసు. సగం నిద్రలో లేపి ఒక నవల డిక్టేటు చేయమంటే చేయగలను’... అంటారు విశ్వనాథ సత్యనారాయణ తన ‘నేను- నా రచనా స్వరూపం’ వ్యాసంలో. విశ్వనాథను కవిసామ్రాట్ అంటారుగానీ ఆ బిరుదు ఆయనకు న్యాయం చేయదు. ఆయన కావ్యాలే కాదు వ్యాసాలు రాశారు. కథలు రాశారు. నవలలు రాశారు. నవలల్లో కూడా ఆ విస్తృతి అసామాన్యమైనది. సాంఘిక నవలలు, చారిత్రక కాల్పనిక నవలలు, మ్యాజికల్ రియలిజం ఛాయలున్న నవలలు, మానసిక విశ్లేషణ కలిగిన నవలలు, డిటెక్టివ్ నవలలు, సైన్స్ ఫిక్షన్కు దగ్గరగా ఉండే నవలలు... ఎన్నని. ‘కావ్యరచనలో పూర్వకవులు ఎన్ని పోకడలు పోయారో నేనూ అన్ని పోయాను’ అన్న ఆయన వ్యాఖ్య ఆయన నవలలకు కూడా వర్తిస్తుందనిపిస్తుంది. విశ్వనాథ ఏ రచన చేసినా ఎలాంటి రచన చేసినా చివరికి ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడినా ప్రతి పదంలో అంతస్సూత్రంగా పాశ్చాత్యుల సాంస్కృతి సామ్రాజ్యవాదాలను అవిశ్రాంతంగా నిర్ద్వంద్వంగా వ్యతిరేకించటం తప్పనిసరిగా కనిపిస్తుంది. దేశీయ సంస్కృతి పునరుత్థానం చెందితేనే దేశం స్వచేతనను నిలుపుకోగలుగు తుందనీ ఈ దేశాన్ని ఐకమత్యంగా ఉంచగల శక్తి దానికే ఉందని ఆయన విశ్వాసం. దేశాభివృద్ధిలో గ్రామీణ వ్యవస్థ, సామాజికా భివృద్ధిలో దాంపత్య వ్యవస్థలను ఆయన మౌలికాంశాలుగా పరిగణించారు. ఈ రెండూ కట్టుదిట్టంగా ఉండటం సామాజిక అభివృద్ధికి కారణాలవుతాయని భావించారు. ఫలితంగా ‘వేయి పడగలు’తో సహా ఆయన రచనలన్నింటిలోనూ గ్రామీణ వాతావరణంలోని ఔన్నత్యం, అది బీటలు వారడం వల్ల కలిగే అనర్థాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన నవలల్లో ‘సముద్రపు దిబ్బ’ గొప్ప ప్రతీకాత్మక వ్యంగ్య రచన. స్వాతంత్య్రానంతరం భారత ప్రభుత్వం అనుసరిస్తున్న పాశ్చాత్య ప్రభావిత పథకాల వల్ల దుష్పరిణామాలు కలగనున్నాయని విమర్శిస్తూ వాటి పరిష్కారాలు సూచిస్తూ చేసిన అతి గొప్ప రచన ఇది. దేశంలోని అన్ని రంగాలలో ఈనాటి దిగజారుడుతనాన్ని దుస్థితిని ఆనాడే ఆ నవల ఊహించింది. ఈ నవలలో ఓ చోట ‘శాస్త్రముల చదువు వేరు. ఉద్యోగముల కొరకు చదివెడి లౌకికపు చదువు వేరు. లౌకికపు చదువులెంత చదివినను ధనాశ వృద్ధి పొందును. అతి దురాశ వృద్ధి పొందును. మనిషి బుద్ధి సద్వివేకము పొందబోదు’ అని స్పష్టం చేస్తాడాయన. ఈనాడు చదువుకున్నవారి సంఖ్య అధికమవుతున్న కొద్దీ విద్యావంతుల సంఖ్య పడిపోవటం మనం చూస్తూనే ఉన్నాం. విశ్వనాథ రచనలు ఆరంభించే సమయానికి జాతీయోద్యమం తీవ్రస్థాయిలో ఉంది. ఇదే సమయంలో భారతీయులను భౌతికంగానే కాదు మానసికంగా కూడా బానిసలుగా చేసుకోవాలన్న బ్రిటిష్ వారి ఆలోచనా ఫలితాలు కూడా స్పష్టమవసాగాయి. భారత దేశ చరిత్రను వక్రీకరిస్తూ అనేక వేల యేళ్ల అసలైన చరిత్రను చరిత్ర పుటల్లోంచి తొలగించే ప్రయత్నాలు సఫలమవసాగాయి. విదేశీ చదువులు చదివిన భారతీయులు ఆ ప్రభావంతో మన దేశ ఔన్నత్యాన్ని ప్రాచీనత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రాచీన వాఞ్మయాన్ని చులకన చేస్తూ న్యూనతా భావాన్ని సమాజంలో ప్రచారం చేయసాగారు. ఇలాంటి విచ్ఛిన్నకరమూ ప్రమాదభరితమూ అయిన ప్రచారాన్ని అడ్డుకుని మనవారికి ఆత్మవిశ్వాసం ఇచ్చే సాంస్కృతిక ఉద్యమం విశ్వనాథ రచనల జీవం అయింది. అందువల్లనే ఆయన తన నవలలు ‘స్వర్గానికి నిచ్చెనలు’, ‘మాబాబు’, ‘విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు’, ‘దేవతల యుద్ధము’, ‘పరీక్ష’, ‘జేబుదొంగలు’, ‘గంగూలీ ప్రేమకథ’, ‘దమయంతీ స్వయంవరం’, ‘కుక్కగొడుగులు’ వంటివాటిలో ఆధునిక సమాజంలో అపోహలకు గురవుతున్న అనేక అంశాలను సర్వ రీతిలో విశ్లేషించి వివరించటం కనిపిస్తుంది. అలాగే భారతదేశంలో ఈనాడు కొందరు చిత్రిస్తున్న తీరులో వర్ణవ్యవస్థ ఉండేది కాదనీ కుల, మత, వర్ణాలకు అతీతంగా ధర్మరక్షణ ఉండేదనీ అందుకు తార్కాణంగా ఆ కాలంలోని ఆప్యాయతలు, గౌరవాలు, ఒకరిపై ఒకరు ఆధారపడే తీరు, దానిని గుర్తించి మెలిగే వ్యక్తుల ఔన్నత్యాలను చిత్రిస్తూ ‘ధర్మచక్రము’, ‘కడిమి చెట్టు’, ‘చందవోలు రాణి’, ‘ప్రళయ నాయుడు’, ‘బద్దన్న సేనాని’, ‘వీర వల్లడు’ వంటి నవలలు రాశారు. మన సంస్కృతికి ప్రాణం వంటి దాంపత్య ధర్మంపై విశ్వనాథ తన కాలంలో జరిగిన దాడులను, ఆకర్షణీయమైన విచ్ఛిన్నకర సిద్ధాంతాలను ఎదిరించాడు. సామాజిక బాధ్యతను సక్రమంగా నిర్వహించే వ్యవస్థను నిలబెట్టే దాంపత్య ధర్మాన్ని సమర్థించాడు. తెలుగు నవలల్లో, విశ్వనాథ నవలల్లో ‘ఏకవీర’ను మించి స్త్రీ పురుష మనస్తత్వాలను విశ్లేషించే నవల లేదనడం అతిశయోక్తి కాదు. ఈనాటికీ ఎవరెన్ని రకాల ప్రణయ గాథలు రాసినా వాటన్నింటిలో ఏకవీర ప్రతిధ్వనిస్తుంటుంది. విశ్వనాథ ద్రష్టత్వానికి ఇది తిరుగులేని ఉదాహరణ. విశ్వనాథ ప్రదర్శించిన వివాహ వ్యవస్థలో పురుషాధిపత్య భావన కనపడదు. సృష్టి పూర్ణానుసారమైతే స్త్రీ పురుషులు చెరి అర్ధభాగాలనీ ఒకరు లేక మరొకరు సంపూర్ణం కాదన్న సమానత్వ భావన చూపిస్తాడు. ‘ధర్మచక్రం’ నవలలో తన జన్మదోషం వల్ల రాణి తనను తక్కువగా చూస్తోందని రాజు కుములుతాడు. ‘చెలియలి కట్ట’లో రత్నావళి పాత్ర తన శరీరాన్ని వాంఛించే పురుషుల అజ్ఞానాన్ని తర్కంతో నిరూపిస్తుంది. ‘వేయి పడగలు’లో అరుంధతీ ధర్మారావుల దాంపత్యాన్ని వివరిస్తూ ‘ఈ ధర్మము పరస్పరమైనది. కాని పురుషుని ఆధిక్యత కలది కాదు’ అంటారు విశ్వనాథ. ఈ నవలలోని కిరీటి, శశిరేఖల ప్రణయగాథ ఏ ఆధునిక ప్రేమగాథకూ తీసిపోదు. ఇందులోని గిరిక ప్రణయం ఆధ్యాత్మిక ప్రణయం. అలాగే కుమారస్వామి, శ్యామలల వివాహం వర్ణాంతర వివాహం. ఇదంతా చూస్తే విశ్వనాథ ఛాందసుడనీ ఆధునిక భావ వ్యతిరేకి అని అనేవారికి విశ్వనాథను చదవడం రాదనుకోవాలి. లేదా వారు చదవకుండానే వ్యాఖ్యానిస్తున్నారని అనుకోవాలి. ‘ఏకవీర’లో ఛాయామాత్రంగా ప్రదర్శించిన ‘స్పర్శ సిద్ధాంత’ విరాట్ స్వరూపం ‘తెఱచిరాజు’లో చూడవచ్చు. ఇక ‘పులుల సత్యాగ్రహం’ ఆధునిక రాజకీయ విన్యాసాలపై వ్యంగ్య విమర్శ. విశ్వనాథ ‘కల్హణుడి రాజతరంగిణి’ ఆధారంగా ‘కాశ్మీర రాజవంశ’ నవలలు ఆరు రాశారు. కోట వెంకటాచలం నిరూపించిన భారత చరిత్ర ఆధారంగా ‘ఆరు నేపాళ రాజవంశ’ నవలలు రాశారు. ఈ 12 నవలలు కేవలం చరిత్రను సరైన రీతిలో ప్రదర్శించడం కోసమే. ఇక విశ్వనాథ సృజించిన 12 ‘పురాణ వైర గ్రంథమాల’ నవలలైతే ప్రపంచ సాహిత్య చరిత్రలో అపూర్వ సృజన. ఇవి కూడా భారత ధర్మ వ్యతిరేకతను ఖండించేవే. విశ్వనాథ రచనలు చదవడమంటే హిమాలయ శిఖరారోహణ చేస్తున్న అనుభూతిని పొందటం. చుట్టూ ఉండే ప్రకృతి ఒకవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే మరోవైపు అనంతమైన ఆలోచనల మంచు తుపానులు కుదిపి వేస్తుంటాయి. భారతీయ సంస్కృతి సంప్రదాయాల పట్ల గౌరవం వెల్లువలా పెల్లుబుకుతుంటే రత్నాలను రాళ్లుగా భావించి చేజార్చుకుని అనంతమైన అద్వితీయమైన వారసత్వ సంపద ఉండి కూడా ప్రపంచంలో నిన్న మొన్న కళ్లు తెరిచిన వారిని చూస్తూ న్యూనతకు గురవుతూ ఆత్మవిశ్వాస రాహిత్యానికి గురవుతున్న భారతజాతిని తలచుకుని బాధ అనిపిస్తుంది. పరిస్థితి మార్చేందుకు నడుం బిగించాలన్న పట్టుదల కలుగుతుంది. - కస్తూరి మురళీకృష్ణ 9849617392 -
సత్వం: మన చలం
మెడలో మల్లెపూల దండ వేసుకుని, వాటి పరిమళం పక్కవాళ్లకూ పంచుతూ, తెనాలి వీధుల్లో తిరిగిన చలం సాయంత్రాల్ని ఒకసారి ఊహలోకి తెచ్చుకుంటే...! సాక్షాత్తూ ఆనందరూపుడిగా కనబడతారు చలం. ఆయనకన్నీ, అంతటా ఆనందమే! ఊయల్లో ఉత్తినే కాళ్లూపుకుంటూ గడిపే పసిపిల్లల్ని చూసినా, పంది వెంబడి పడి రాయితో బెదిరిస్తున్న తుంటరి బాలుడిని కాంచినా, పరికిణీ రెపరెపల్తో, మువ్వల సవ్వడుల్తో వయ్యారాలుపోయే కన్నెపిల్ల ఎదురైనా, ఇంకా ఉడతలూ గోరింకలూ భీమిలి సముద్రమూ నక్షత్రాల వెలుగూ... దేనికైనా బాధపడటానికి ఏముందని? ‘అసలు బాధలో అంత బాధ లేదు’. విశ్వనాథ అన్నట్టు, ఏనాడూ ‘ఎంగిలి మాటలు’ వాడని చలం, అనవసర పదం ఒక్కటి అదనంగా రాసినా నేరమేనన్న చలం, తానే సాహిత్యంగా బతికిన చలం- మైదానం, పురూరవ, జీవితాదర్శం, దైవమిచ్చిన భార్య, బ్రాహ్మణీకం, శశిరేఖ, అమీనా, అరుణ... కథలు, నవలలు, వ్యాసాలు, సంభాషణలు, ప్రేమలేఖలు, ఉత్తరాలు, కవితలు, మ్యూజింగ్స్... ఏ రూపంలోనైనా ఆనందం చుట్టూ తాను తిరుగుతూ, అక్షరాల చుట్టూ పాఠకుల్ని తిప్పాడు, దోసిళ్లకొద్దీ జీవనరసం తాగిస్తో. ఒక్కోసారి ‘గీతాంజలి’ని చలమే రాసి తమాషాకి టాగూర్ పేరు పెట్టాడేమోనని అనిపించదూ! జీవితాన్ని ఏలుకునే తెలివిడిలేనివాళ్లకు మళ్లీ గుడిపాటి వెంకటాచలమే వచ్చి అన్నీ చెప్పాలని ఉడుక్కున్నాడు. ‘ఏం చెయ్యను? ఆ ప్రశ్నే యీ ప్రపంచంలో దారుణం. ఇన్ని భయాలకి కారణం. ఏదీ చేసీ ఏదీ చెయ్యకా పోయిందేమీ లేదని గ్రహించరు’ అని మనుషుల సౌందర్యలేమినీ, వేగపుయావనీ నిరసించాడు. ఆయన్ని ఎవరు ఎలా ఆరాధించినా, ప్రత్యేకించి స్త్రీవాదీ, పురుషవాదీకాని స్వేచ్ఛావాది... చలం. ఆయన ఎంపిక స్వేచ్ఛను కోరుకున్నాడు. స్త్రీ పురుషులు సమానంగా, హిపోక్రసీ లేకుండా, చిరునవ్వుల్తో పరస్పరం హృదయాల్ని వెలిగించుకుంటూ, ఒకరి ప్రపంచం మరొకరయ్యేంత గాఢంగా జీవించే కలగన్నాడు; ఒక్కోసారి అది తాత్కాలిక నీతిచట్రంతో భేదించేదే కావొచ్చుగాక! ఇప్పటి ‘నైతిక ముద్ర’ అప్పటి ఆయన గాయాలకు లేపనం ఎటూకాలేదుగానీ... ఆయన పొందినట్టుగా కనబడిందంతా ఆయన పొందాలనుకున్న కల్పనేనేమో! స్త్రీ లాంటి ఒక బలమైన ఇచ్ఛేదో లేకుండా రోజువారీ బతుకులోని నిస్సారత ఆయనకు తెలుసు. అందుకే అంటాడు: ‘నా విరహం పొందినకొద్దీ క్రమంగా, నేను ఇంకా గొప్ప శృంగారంతో, జ్ఞానంతో, నీ హృదయంలో వ్యాపిస్తాను’. ఆయన స్వేచ్ఛ జీవితానికీ, కళకూ కూడా సంబంధించినది: ‘ఇంకోళ్ళ ఆజ్ఞల ప్రకారం తన కళని వంకరతిప్పే అలవాటు, కళని ధనానికి దాస్యం చేయించే ఆ బానిసత్వం, క్రమంగా అతని ఆత్మలోకి పాకి, అతని జీనియస్ని, స్వేచ్ఛని, ధైర్యాన్ని చంపేస్తుంది’. ప్రేమికుడినుంచి అన్వేషిగా, అన్వేషకుడినుంచి ఆధ్యాత్మికుడిగా రూపాంతరం చెందుతూ... అసలు తొలినుంచీ అన్నీ ఆయనలో కలగలిసే ఉన్నాయి, ఆయన వచనంలోనే కవిత్వం మిళితమైనట్టుగా! అందుకే, తనలో ఉన్న చీకటినే కాగితం మీద పెట్టానేతప్ప ఏ బోధలూ చేయడం కోసం కాదన్నాడు. చీకాకు పరిచే ఈ ప్రపంచంతో సమన్వయం చేసుకోవడానికి ఎప్పటికి కుదురుతుందోనని వాపోయాడు. సత్యం లోపల్నుంచే దొరకాలి తప్ప, బయటెక్కడో కాదన్నాడు. చలం అనేవాణ్ని మరిచిపోయేంతగా నిత్యనూతన జీవితాన్ని, పాత మకిలి లేని జీవితాన్ని అభిలషించాడు. తనలో ఉన్న ప్రశ్నలకు ఒక మేరకైనా సమాధానపడాల్సిన పక్వస్థితికి వచ్చాక ‘అరుణాచలం’లో స్థిమితపడ్డాడు. ‘మరణం తరవాత ఎక్కడో మేలుకుంటే, ఇది కల అనుకోవా మరి! కల తరవాత మేలుకున్నప్పుడు నిద్రముందు జీవితాన్ని ఎక్కడ వొదిలావో, మేలుకుని ఆ కొనని అందుకోగలుగుతున్నావు గనక జీవితం నిజమయింది. నిద్రలో జరిగింది కల, అబద్ధం అయింది. ఎందుకూ? కల జరిగిన తరవాతి కొనను అందుకోలేవు గనక. మళ్లీ యీ జీవితం కొన అందకండా ఎక్కడో మేలుకున్న రోజున యీ జీవితం కలకాదా?’ తనలోని చివరి ప్రశ్నలు, వాటికి దొరికీ దొరకని సమాధానాలతోనే కన్నుమూసిన చలం- ఎక్కడైనా నిజంగానే మేలుకున్నాడేమో! ఈ జీవితపు కొనని అక్కడ అందుకుని ఇదంతా కలని చెప్పేందుకు కాచుకుని కూర్చున్నాడేమో! - పూడూరి రాజిరెడ్డి