భద్రాద్రిలో వైభవంగా రథోత్సవం
భద్రాద్రిలో వైభవంగా రథోత్సవం
సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు
యాగశాలలో మహా పూర్ణాహుతి
నేడు విశ్వరూప సేవ
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం గురువారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం, భీష్ముడు అంపశయ్య నుంచి లేచిన రోజు కావటంతో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక హోమం చేశారు.. మహా పూర్ణాహుతి ఇచ్చారు. సాయంత్రం రథోత్సవ వేడుక కోసం రథాన్ని పూలతో అలంకరించారు. రథం వద్ద 20 సేర్ల తెల్లప్రసాదాన్ని దిష్టికుంభంగా పోశారు.
పుణ్యహవచనం గావించి రథానికి సంప్రోషణ చేశారు. రథం నలుదిక్కుల బలిహరణం, సంపదాద్యంను జరిపించి రథంపై ఉన్న రంగనాథస్వామి వక్షస్థలంపై ఆరోపణగావించారు. గర్భగుడిలో స్వామివారికి దర్భార్‌సేవ, వేదస్వస్తి అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ప్రత్యేక పల్లకిపై ఉంచారు. బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ సకలరాజ లాంచనాలతో ఊరేగింపు నిర్వహించారు. తరువాత స్వామివారిని రథంపై ఉన్న ఊయల ఎక్కిం చారు. చక్కరపొంగలి నివేదన గావించి, హార తి ఇచ్చారు. అష్టోత్తర శ తనామార్చన చేశారు. రథంపై ఉన్న స్వామివారికి దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ప్రత్యేక పూజలు చేశారు.
వైభవంగా రథసేవ
రథసేవకు బయలుదేరే ముందు స్వామివారికి ఈవో హారతి సమర్పించారు. ఆమె కూడా స్వయంగా రథం లాగారు. స్వామివారు కొలువుతీరిన రథాన్ని లాగితే సంసార బాధలు తొలగుతాయనే నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆలయం నుంచి రాజవీధి మీదుగా తాతగుడి వరకు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దారి పొడువునా భక్తులు స్వామివారికి నీరాజనాలు పలికారు.
మొక్కు లు సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. తిరి గి ఆలయానికి చేరుకున్న తర్వాత స్వామివారికి ప్రణయకళోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీవో టు ఈవో నిరంజన్, పీఆర్వో సాయిబాబా, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, వేద పండితులు ప్రసాదావధాని, సన్యాసి శర్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు విశ్వరూప సేవ
శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం విశ్వరూప సేవ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారితో పాటు ఆలయ పరివార దేవతలను ఒక చోటకు చేర్చి పూజలు నిర్వహించటం ఈ సేవ ప్రత్యేకత. కమనీయంగా సాగే ఈ వేడుకలో పాల్గొనేందుకు భ క్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. దీనిలో పాల్గొనే భక్తులు రూ.1000 టికెట్టు తీసుకోవాలని దేవస్థానం ఈవో సూచించారు.