చిన్నా.. మనసు వెన్న
దూలపల్లి: ఏ షాపు ముందైతే కిలోమీటర్ మేర క్యూ ఉంటుందో... ఎప్పుడు చూసినా షాపు మూసే ఉంటుందో... అది రేషన్ షాపే అని అందరికీ తెలుసు... ఎప్పుడో ఒకసారి సరుకులు ఇచ్చి... వారం పది రోజులు కనిపించకుండా పోయే డీలర్లు ఎంతోమంది ఉన్నారు. రేషన్ ఎప్పుడు వచ్చిందో.. ఎప్పుడు అయిపోయిందో తెలియక పేదలు కిరాణా షాపులను ఆశ్రయిస్తున్న సంఘటనలు దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక వేళ డీలర్‌ను బతిమాలినా.. నువ్వు రాలేదు రేషన్ అయిపోయింది పో... అనే బెదిరింపుతో పేదలు ఆవేదన చెందుతున్నారు. రేషన్ వచ్చిన రోజు పనులు మానుకొని రేషన్ షాపుల్లో గంటల కొద్దీ నిరీక్షించి సరుకులు తీసుకెళ్తున్నారు. కానీ సూరారం కాలనీలో ఉన్న రేషన్ షాపులో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. ఎప్పుడు వెళ్లినా ప్రజలు రేషన్ సరుకులు తీసుకోవచ్చు.
సూరారం కాలనీలోని రేషన్ షాపు నంబరు 566ను ఎల్.దీనమణి పేరు మీద ఉండగా ఆమె భర్త ఎల్.చిన్నా నిర్వహిస్తున్నాడు. ఈ దుకాణ పరిధిలో 814 కార్డులు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, కూలీనాలి చేసుకునే ప్రజలే అధికం. వారి ఇబ్బందులను గుర్తించిన నిర్వాహకుడు చిన్నా ప్రతినెలా 1 నుంచి 20వ తేదీ వరకు సమయపాలన పాటిస్తూ దుకాణాన్ని తెరిచే ఉంచుతున్నాడు. సరుకులు వచ్చిన వెంటనే కార్డుదారుల ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నాడు. వివిధ కారణాలతో ఒక నెల రేషన్ సరుకులు తీసుకెళ్లకపోయినా తర్వాత నెలలో రెండు నెలల రేషన్ సరుకులు అందజేస్తున్నాడు. సరుకుల వివరాలు ఎప్పటికప్పుడు రాసి ఉంచుతున్నాడు. దీంతో వివిధ రేషన్ దుకాణాల్లో ఉన్న వారు చిన్నా షాపులోకి తమ రేషన్ కార్డులను మార్చుకుంటున్నారు. ఎప్పుడూ రేషన్ సరుకులు తీసుకోకుండా వెనుదిరిగన రోజులు లేవని లబ్ధిదారులు చెబుతున్నారు.
ఇటీవల ఆహార భద్రత కార్డులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించే బాధ్యత రేషన్‌డీలర్లకు అప్పగించిన విషయం తెలిసిందే. రేషన్ డీలర్ల పనితీరును పరిశీలిస్తున్న నేపథ్యంలో చిన్నా దుకాణానికి వచ్చిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ దుకాణంలో ఉంచిన సరుకుల వివరాలు, ఆహార భద్రత కార్డుల విషయమై ఉంచిన సమాచారాన్ని చూసి ముగ్ధులయ్యారు. వెంటనే బాలానగర్ ఏఎస్‌ఓకు ఫోన్ చేసి షాపు నంబరు-566 మాదిరిగా మిగిలిన దుకాణాల్లో కూడా అమలు చేయాలని సూచించారు. చిన్నా పనితీరు బాగుందని కితాబు ఇచ్చారు.
మెసేజ్‌తో ఎంతో సులువు
నేను సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నా. గతంలో ఇక్కడే ఉండేవాళ్లం. పిల్లల చదువుల నిమిత్తం ప్రస్తుతం ఖైరతాబాద్‌లో ఉంటున్నాం. రేషన్ సమాచారాన్ని ప్రతి నెలా డీలర్ చిన్నా మెసేజ్‌లు పెట్టడం వల్ల సులువుగా ఉంది. దీని వల్ల రేషన్ కోసం సెలవు పెట్టాల్సిన అవసరం లేకుండాపోయింది. - రామారావు
సమయానికి సరుకులు
మా కార్డు వేరే రేషన్ దుకాణం పరిధిలో ఉండేది. సరుకుల కోసం ప్రతి నెలా నాలుగైదు సార్లు దుకాణం చుట్టూ చక్కర్లు కొట్టాల్సివచ్చేది. ఒక్కోసారి సరుకులు అవిపోయేవి. చిన్నా దుకాణం పనితీరు గురించి తెలుసుకుని కార్డు మార్పించుకున్నాం. సమయానికి సరుకులు అందుతున్నాయి. - కృష్ణకుమారి
పేదలు ఇబ్బందులు పడొద్దనే
ఇక్కడ అంతా పేద, మధ్యతరగతి కుటుంబాల వారే. సరుకులు అందకపోతే వారు పడే ఇబ్బందులు నాకు తెలుసు. అందుకే సరుకులు వస్తే ఫోన్లకు మెసేజ్ పెట్టి రేషన్ సరుకులు అందేలా చూస్తున్నాను. అన్ని సరుకులు అందుబాటులో ఉంచుతున్నా. సమయపాలన పాటిస్తున్నాను. - చిన్నా