Viziawada
-
బడ్జెట్‌పై ఆర్టీసీ కార్మికుల్లో వెల్లివిరిసిన సంతోషం
సాక్షి, విజయవాడ: ఏపీ బడ్జెట్లో ఆర్టీసికి రూ.1572 కోట్లు కేటాయించడంపై ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీకి అండగా నిలిచారని ఆర్టీసీ ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినా గత ప్రభుత్వాలు ఆదుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో బొత్స సత్యనారాయణ రవాణా మంత్రిగా ఉన్న సమయంలో బస్సుల కొనుగోలు కోసం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీకి చిల్లిగవ్వ కూడా కేటాయించలేదని పలిశెట్టి మండిపడ్డారు. పైగా ప్రభుత్వం ఆర్టీసీకి సకాలంలో బకాయిలు చెల్లించని కారణంగా కార్మికులు ఉద్యమాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులందరి తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, వర్కింగ్ ప్రెసిడెంటు యం.హనుమంతురావు, చీఫ్ వైస్ ప్రెసిడెంటు పి.సుబ్రమణ్యంరాజు, ఉప ప్రధానకార్యదర్శులు జి.వి.నరసయ్య, ఆవుల ప్రభాకర్ తదితరులు సంతోషం వ్యక్తం చెేశారు. కాగా ఆర్టీసీకి కేటాయించిన నిధుల్లో బస్‌పాసులకు, ఇతర రాయితీలకు రూ.500 కోట్లు, బస్సు కొనుగోలుకు రూ.50 కోట్లు, ఆర్థిక సహాయార్థం రూ.1000 కోట్లు ప్రకటించారు. -
రైల్వే కమ్యూనిటీ హాల్లో అడ్డగోలు దోపిడీ!
సాక్షి, విజయవాడ (కృష్ణా): స్థానిక సత్యనారాయణపురంలోని రైల్వే కమ్యూనిటీ హాల్ నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. రైల్వే సిబ్బంది తమ ఇళ్లలో జరిగే శుభకార్యాలు నిర్వహించుకునేందుకు ఈ కమ్యూనిటీ హాల్స్‌ను, రైల్వే ఇనిస్టిట్యూట్‌ను రైల్వేశాఖ నిర్వహించింది. గతంలో దీన్ని ఉద్యోగస్తులతో ఓ కమిటీ ఏర్పడి నిర్వహించే వారు. అయితే సదరు కమిటీపై ఆరోపణలు రావడం.. పదవీ కాలం ముగియడంతో అధికారులే స్వయంగా నిర్వహిస్తున్నారు. అయితే గత కమిటీ ఏ విధమైన వ్యాపార ధోరణులను అవలంబించిందో అదే తరహాలో ప్రస్తుతం అధికారులు అవలంభిస్తున్నారని రైల్వే సిబ్బంది ఆరోపిస్తున్నారు. అడుగడుగునా దోపిడీ! రైల్వే కమ్యూనిటీ హాల్‌కు వెళ్లే వారికి ఖేదమే మిగులుతోంది. అడుగడుగునా దోపిడీకి గురవుతున్నామని వారంతా భావిస్తున్నారు. రైల్వే సిబ్బందికి రూ.22 వేలు, బయట వారికి రూ.32 వసూలు చేస్తున్నారు. కానీ దానికి తగ్గ సౌకర్యాలు మాత్రం కల్పించడంలేదు. 100 లీటర్లు.. నాలుగు గంటల ఏసీ? ఏసీ కావాలంటే నాలుగు గంటలకు 100 లీటర్ల డీజిల్ డిమాండ్ చేస్తున్నారు. దీనికి గాను సుమారు రూ.7000 వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. కానీ వాస్తవంగా 40 లీటర్లే సరిపోతుందని మెకానిక్‌లు చెబుతున్నారు. నాలుగు గంటలకు ఏసీకి బిల్లు చెల్లించినా రెండున్నర గం టలు వేసి ఆ చల్లదనంతోనే మిగిలిన సమయం పూర్తి చేస్తున్నారు. సామగ్రి బయటి నుంచే... ఇక కమ్యూనిటీ హాల్లో కావాల్సి సామగ్రి ఎక్కు వ బయట నుంచే అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. అదీ వారు చెప్పిన షామియానా కొట్టు నుంచే వాటిని తెచ్చుకుని వాడుకోవాలి. అలాగే డెకరేషన్ కూడా వారు చెప్పిన వారి చేతనే చేయించుకోవాలి. సామగ్రి, డెకరేషన్‌కు బయట రేట్లతో పోల్చితే కనీసం 25 శాతం ఎక్కువ వసూలు చేస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. కాగా ఇక్కడ ఉన్న వంటశాలకు రక్షణ కవచం లేకపోవడంతో కుక్‌లు ఇబ్బంది పడుతున్నారు. పాత కమిటీపై ఫిర్యాదులు గత కమిటీలో కొంతమంది సభ్యులు కబేళాలో నూతనంగా నిర్మిస్తున్న కల్యాణ మండపంలో భాగస్వామ్యం ఉంది. ఆ కల్యాణ మండపం నిర్మాణ విషయంలో రైల్వే కమ్యూనిటీ హాల్లోని సామగ్రిని యధేచ్ఛగా వాడుకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే కమ్యూనిటీ హాల్ కోసం కొనుగోలు చేసిన కేబుల్స్, ఇతర సామాగ్రిని అక్కడకు తరలించారని ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదయ్యాయి. దీంతో తొలుత ఏఈ స్థాయి అధికారితో విచారణ చేయించి, తర్వాత త్రిసభ కమిటీని వేశారు. ఈ కమిటీ విచారణ చేసింది కాని ఇంకా నివేదిక ఇవ్వలేదని సమాచారం. కాగా గత ఏప్రిల్‌కు ముందు ఉన్న కమిటీ ఏ విధంగా డబ్బులు వసూలు చేసేదో ఇప్పుడు అధికారులు అదే విధంగా వసూలు చేస్తున్నారు తప్ప రైల్వే ఉద్యోగస్తులకు సిబ్బందికి మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉపయోగపడేలాగా... స్టాఫ్ వెల్పేర్ ఫండ్ నుంచి సుమారు రూ.75 లక్షలు ఖర్చు చేసి కమ్యూనిటీ హాల్, ఇనిస్టిట్యూట్ అభివృద్ధి చేశారు. అదే సమయంలోనో, తర్వాతో మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి వంట సామగ్రి, ఇతర సామగ్రి కొనుగోలు చేసి ఉంటే ఆ మేరకు ఖర్చు తగ్గేది. అలాగే ఏసీ కల్యాణ మండపం అని అద్దె వసూలు చేస్తున్నారు. అందువల్ల ఏసీ సౌకర్యం ఉచితం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే కమ్యూనిటీ హాల్లో సౌకర్యాలు మెరుగు పర్చాలని కోరుతున్నారు. -
గూడులేని గురుకులం
విజయవాడలో కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలకు కష్టమొచ్చింది. గూడు కరువయ్యే పరిస్థితి నెలకొంది. 150 మంది మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారబోతోంది. ఆర్టీసీకి చెందిన భవనంలో కొనసాగుతుండగా ఖాళీ చేయాలని ఆ సంస్థ యాజమాన్యం హుకుం జారీ చేసింది. సాక్షి, భవానీపురం: మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థినులకు గూడు కల్పించి విద్యా బోధన చేస్తున్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలకు ఇప్పుడు గూడు కరువైంది. 14 ఏళ్ల నుంచి ఏపీఎస్ఆర్టీసీకి చెందిన భవనంలో అద్దెకు ఉంటున్న ఈ పాఠశాలను ఖాళీ చేయాలంటూ ఏడాది నుంచి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ హుకుం జారీచేస్తున్నారు. ఈనెల 12న పాఠశాల పునఃప్రారంభంకాగా నెల రోజుల్లో ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ ఎండీ మరోసారి హెచ్చరికలు జారీచేశారు. దీంతో విద్యార్థినుల భవితవ్యం అయోమయంలో పడింది. అద్దె భవనం కోసం వెతుకులాడుతూనే ఉన్నామని, సుమారు 150 మంది విద్యార్థినులకు సరిపోయే వసతిగృహం దొరకడం కష్టసాధ్యంగా ఉందని స్కూల్ ప్రిన్సిపాల్ ఆంధ్రవాణి చెబుతున్నారు. విజయవాడ విద్యాధరపురంలోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల గూడు గోడు ఇలా ఉంది.. రూ.70 వేలు అద్దె చెల్లిస్తున్నా వేధింపులే శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు గల 9 జిల్లాల్లోని 5 నుంచి 10వ తరగతి వరకు విద్యనభ్యసించే ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ విద్యార్థినుల కోసం ప్రభుత్వం 2003లో రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను గుణదలలోని ఒక అద్దె భవనంలో ప్రారంభించింది. అయితే అక్కడ స్థలం సరిపోకపోవడంతో గతంలో విద్యాధరపురం ఆర్టీసీ ట్రైనింగ్ స్కూల్ ఉండే భవనంలోని మొదటి అంతస్తులోకి 2005లో మార్చారు. అప్పుడు రూ.26,250 చెల్లించిన అద్దె కాలక్రమంలో ఇప్పుడు రూ.70 వేలకు చేరింది. అయినా ఖాళీ చేయాలంటూ ఆర్టీసీ యాజమాన్యం నుంచి వేధింపులు తప్పడం లేదు. ఈ భవనంలోని 20 గదులలో విద్యార్థినులకు వసతి కల్పించి విద్యా బోధన చేస్తున్నారు. వాస్తవానికి 480 మంది విద్యార్థినులు ఉండాల్సిన ఈ పాఠశాలలో ప్రస్తుతం 150 మంది మాత్రమే విద్యను అభ్యసిస్తున్నారు. అందులో మైనార్టీ విద్యార్థినులు తక్కువకాగా ఎస్సీ,ఎస్టీ విద్యార్థినులు ఎక్కువగా ఉన్నారు. విజయవాడ ఏం పాపం చేసుకుంది? కృష్ణాజిల్లాలో 5 ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. అందులో నిమ్మకూరు, ముసునూరు, పులిగడ్డ పాఠశాలలకు కొన్ని ఎకరాల స్థలంలో సొంత భవనాలు ఉన్నాయి. మచిలీపట్నం పాఠశాల కోసం సుమారు 12 ఎకరాల స్థలం కేటాయించగా భవన నిర్మాణం జరగాల్సి ఉంది. అలాగే నిమ్మకూరులోని గురుకుల కళాశాలకు కూడా సొంత భవనం ఉంది. జిల్లాలోని అన్ని పాఠశాలలకు సొంత భవనాలు ఉండగా నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన విజయవాడ ఏం పాపం చేసుకుందో అర్ధం కావడం లేదని ప్రిన్సిపాల్ ఆంధ్రవాణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని డాక్టర్ జాకీర్ హుస్సేన్ డిగ్రీ కళాశాల ఉన్న 25 ఎకరాల (వక్ఫ్) భూమిలో కొంత ఈ పాఠశాలకు కేటాయించవచ్చు. లేదంటే భవానీపురం దర్గా వద్ద కార్పొరేషన్ స్వాధీనంలో ఉన్న 2.9 ఎకరాల స్థలాన్నైనా ఈ గురుకుల పాఠశాలకు కేటాయించవచ్చు. భవనం దొరికే వరకు ఇబ్బంది పెట్టవద్దు తమ భవనాన్ని ఖాళీ చేయాలని ఆర్టీసీ ఎండీ ఆదేశించిన నేపథ్యంలో ఏడాది నుంచి భవనం కోసం వెతుకుతూనే ఉన్నాం. ఇటీవల స్కూల్ పునఃప్రారంభంకాగా మళ్లీ వచ్చి నెల రోజుల్లో ఖాళీ చేయాలని హెచ్చరించారు. ఏపీ రెసిడెన్షియల్ సొసైటీ సెక్రటరీ నాగభూషణ శర్మ పర్యవేక్షణలో భవనం కోసం అన్వేషిస్తున్నాం. దయచేసి భవనం దొరికే వరకు ఇబ్బంది పెట్టవద్దని, పిల్లలు ఇబ్బంది పడతారని అర్టీసీ ఎండీకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో నూతనంగా ఏర్పాటైన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమైనా గురుకుల పాఠశాలకు స్థలం కేటాయించాలని కోరుతున్నాం. – వి. ఆంధ్రవాణి, ఏపీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్. -
చంద్రబాబుపై మందకృష్ణ ఫైర్
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు మాదిగలను నమ్మించి మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో విశ్వరూప మహాసభకు అనుమతి నిరాకరణను ఖండిస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... మాదిగలకు నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులో టీడీపీ మాలలకే పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. దళితులు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబును.. రానున్న ఎన్నికల్లో గద్దె దించి తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. ఈనెల (మార్చి) 29న తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు. కాగా టీడీపీ హయాంలో దళితులు తీవ్ర అవమానాలకు గురైన సంగతి తెలిసిందే. ‘ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా’ అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయగా.. ‘దళితులు మీకెందుకు రా రాజకీయాలు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ విధంగా అధికార పార్టీ అహంకారానికి తార్కాణంగా నిలిచిన ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. -
పగలు బీజేపీతో.. రాత్రి కాంగ్రెస్‌తో
సాక్షి, విజయవాడ : టీడీపీకి చిత్తశుద్ది ఉంటే పెట్రో పన్నులు తగ్గించి భారత్ బంద్‌లో పాల్గొనాలని విజయవాడ వైఎస్సార్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, నగర అధ్యక్షుడు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌లు సవాల్ చేశారు. ఆదివారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పెట్రోల్‌పై రాష్ట్రం విధిస్తున్న పన్నులు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లీటర్ పెట్రోల్‌పై చంద్రబాబు సర్కార్ రూ. 4 భారం మోపుతోందని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీతో కలిసి నాలుగేళ్లుగా ప్రజలపై పన్నుల భారాన్ని మోపి, ఇప్పుడు కాంగ్రెస్‌తో కలిసి పెట్రో రేట్లు తగ్గించాలని నిరసన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీడీపీ పగలు బీజేపీతో, రాత్రి కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోందని ఎద్దేవా చేశారు. పెట్రో పన్నులు తగ్గించకుండా బంద్‌లో ఎలా పాల్గొంటారని ప్రశ్నించారు. దివంగత నేత వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు కేంద్రం సిలెండర్ ధర రూ. 50 పెంచితే..ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించింది. కానీ చంద్రబాబు హయాంలో గ్యాస్ సిలెండ్ ధర రూ. 400 నుంచి రూ.850కి పెరిగిందని విమర్శించారు. చిత్తశుద్ది లేని కాంగ్రెస్, టీడీపీ పెట్రో ఆందోళనకు విశ్వసనీయత లేదన్నారు. పెట్రో ధరల తగ్గింపుకోసం వైస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని పేర్కొన్నారు. -
వారికి ‘మామూలే’!
► మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ తప్పనిసరి చేసిన ఎక్సైజ్ కమిషనర్ ► ఎక్సైజ్ అధికారులకు మామూళ్ల నిలిపివేసిన వ్యాపారులు ► అర్ధరాత్రి అమ్మకాల కోసం పోలీస్ శాఖకు మామూళ్లు ► రక్షకభటుల్లోనూ మార్పు వస్తే అక్రమ అమ్మకాలకు చెక్ సాక్షి, అమరావతిబ్యూరో: మద్యం అక్రమంగా విక్రయించడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన పోలీసులే పరోక్షంగా ఇందుకు కారణమవుతున్నారు. మద్యం వ్యాపారుల వద్ద మమూళ్లు తీసుకుని అక్రమ అమ్మకాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం... ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఈ మేరకు వ్యాపారులు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తున్నందున ఎక్సైజ్ శాఖకు నెలవారీ మామూళ్లను నిలిపివేశారు. అయితే, అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకోని పోలీసులు మాత్రం యథావిధిగా డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎక్సైజ్ శాఖ కమిషనర్ లక్ష్మీనరసింహం స్వయంగా డీజీపీకి లేఖ రాశారు. దీంతో ఎవరూ మామూళ్లు తీసుకోవద్దని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు కూడా లంచాలు తీసుకోకుండా... నిబంధనలు పాటించాలని వ్యాపారులను హెచ్చరిస్తే మద్యం అక్రమ విక్రయాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఎక్సైజ్‌కు చెక్..! రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాల పరిధిలో 695 మద్యం దుకాణాలు ఉన్నాయి. నెలకు ఒక వైన్ షాపు నుంచి రూ.30వేలు చొప్పున మామూళ్లు ఇచ్చేవారు. ఈ లెక్కన 695 షాపుల నుంచి రూ.2.85 కోట్లు వసూలు చేసేవారు. ఆ నగదును ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు పంచుకునేవారు. మరోవైపు స్టేట్ టాస్క్‌ఫోర్స్, జిల్లా టాస్క్‌ఫోర్స్ పేరుతో అదనపు మామూళ్లు ఇచ్చేవాళ్లమని వైన్ షాపుల యజమానులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగించేవారు. ఎమ్మార్పీ ఉల్లంఘించేవారు. బెల్టు దుకాణాలు నిర్వహించేవారు. లూజు విక్రయాలు, రాత్రి, పగలు అనే తేడా లేకుండా విక్రయించడం, మద్యంలో కల్తీ చేయడం.. ఇలా అడుగడుగునా ఇష్టానుసారంగా వ్యవహరించేవారు. ఇటీవల ఎక్సైజ్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనరసింహం నిర్ణయాల వల్ల నెలవారీ మామూళ్లకు చెక్ పడింది. ఎమ్మార్పీ తప్పకుండా అమలు చేయడంతో వైన్ షాపుల యజమానులకు మామూళ్ల బెడద తగ్గింది. అదే సమయంలో ఆదాయం కూడా కాస్త తగ్గింది. దీంతో ఎక్సైజ్ శాఖకు మామూళ్లు ఇచ్చుకోలేమని చెప్పేశారు. నెలవారీ ఆదాయం రాక అధికారులు మథనపడుతూ ఇండెంట్ల పేరుతో ఎంతో కొంత రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, వ్యాపారులు మాత్రం ససేమిరా అంటున్నారు. పోలీస్ శాఖ విషయంలో మార్పు లేదు ఎక్సైజ్ శాఖకు మామూళ్లు నిలిపివేసిన మద్యం వ్యాపారులు... పోలీస్ శాఖకు మాత్రం యథావిధిగానే ఇస్తున్నారు. ఒక్కో మద్యం షాపు నుంచి ప్రతి నెలా పోలీస్‌స్టేషన్‌కు రూ.13 వేల చొప్పున సమర్పించుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో 695 దుకాణాలకు నుంచి నెలకు రూ.90 లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎమ్మార్పీకి మద్యం విక్రయిస్తున్నందున లాభాలు తగ్గాయని, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తే తాము నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విక్రయాలు సాగిస్తే తమకు లాభాలు వస్తాయని, అందుకోసం పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో రాత్రిళ్లు షాపులు మూసివేసి, పక్కనే బడ్డీ కొట్లు, చిన్న గదుల్లో బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసి తెల్లవారే వరకు మద్యం విక్రయిస్తున్నారు. పోలీసులు కూడా మమూళ్లు తీసుకోకుండా ఉంటే మద్యం షాపులు నిబంధనల ప్రకారం నడిపే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
పుష్కరాలకు మన తూర్పు భాగవతం
బొబ్బిలి రూరల్ : దేశంలోనే గుర్తింపుపొందిన తూర్పుభాగవతాన్ని కష్ణాపుష్కరాలలో ప్రదర్శించే అవకాశం లభించింది. ఈ ప్రాంతంలో ఈ కళకు గుర్తింపు తెచ్చిన కోమటిపల్లివాసి బొంతలకోటి సాంబమూర్తికి ఆంధ్రప్రదేశ్ సాంస్కతికశాఖనుంచి ఆహ్వానం అందింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలో జరిగే కళాకారుల ర్యాలీలో పాల్గొని వివిధ ప్రాంతాల్లో తూర్పుభాగవతాన్ని ప్రదర్శిస్తారు. బొంతలకోటి సాంబమూర్తి ఇందులో సత్యభామగా, గొల్లభామగా కనిపిస్తారు. ఈ అవకాశం దక్కినందుకు ఆయన సాక్షివద్ద తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. -
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి కన్నుమూత
పార్వతీపురం : తనకు ఎవరూ లేరనే ఆత్మన్యూనతతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన పెందుర్తి రవికి ఎవరూ లేరు. ఇన్నాళ్లు స్నేహితుడి ఇంట్లో ఉండేవాడు. ఇటీవల అతనికి వివాహం కావడంతో పని దొరుకుతుందని పార్వతీపురం వచ్చాడు. కానీ ఇక్కడ ఎవరూ పని ఇవ్వకపోవడంతో నాలుగు రోజులుగా ఫుట్‌పాత్‌పై పడుకున్నాడు. ఓ పక్క ఆకలి.. మరోపక్క ఎవరూ లేకపోవడంతో జీవితంపై విరక్తిచెంది శుక్రవారం పురుగు మందు తాగాడు. స్థానికులు వెంటనే గుర్తించి ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించారు. అక్కడ చికిత్స పొందుతూ రవి శనివారం మరణించాడు