సాక్షి, విజయవాడ: ఏపీ బడ్జెట్లో ఆర్టీసికి రూ.1572 కోట్లు కేటాయించడంపై ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీకి అండగా నిలిచారని ఆర్టీసీ ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినా గత ప్రభుత్వాలు ఆదుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో బొత్స సత్యనారాయణ రవాణా మంత్రిగా ఉన్న సమయంలో బస్సుల కొనుగోలు కోసం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీకి చిల్లిగవ్వ కూడా కేటాయించలేదని పలిశెట్టి మండిపడ్డారు. పైగా ప్రభుత్వం ఆర్టీసీకి సకాలంలో బకాయిలు చెల్లించని కారణంగా కార్మికులు ఉద్యమాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
ఆర్టీసీ కార్మికులందరి తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, వర్కింగ్ ప్రెసిడెంటు యం.హనుమంతురావు, చీఫ్ వైస్ ప్రెసిడెంటు పి.సుబ్రమణ్యంరాజు, ఉప ప్రధానకార్యదర్శులు జి.వి.నరసయ్య, ఆవుల ప్రభాకర్ తదితరులు సంతోషం వ్యక్తం చెేశారు. కాగా ఆర్టీసీకి కేటాయించిన నిధుల్లో బస్‌పాసులకు, ఇతర రాయితీలకు రూ.500 కోట్లు, బస్సు కొనుగోలుకు రూ.50 కోట్లు, ఆర్థిక సహాయార్థం రూ.1000 కోట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment