palisetti damodara rao
-
బడ్జెట్‌పై ఆర్టీసీ కార్మికుల్లో వెల్లివిరిసిన సంతోషం
సాక్షి, విజయవాడ: ఏపీ బడ్జెట్లో ఆర్టీసికి రూ.1572 కోట్లు కేటాయించడంపై ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) హర్షం వ్యక్తం చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్టీసీకి అండగా నిలిచారని ఆర్టీసీ ఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేసినా గత ప్రభుత్వాలు ఆదుకున్న పాపాన పోలేదన్నారు. గతంలో బొత్స సత్యనారాయణ రవాణా మంత్రిగా ఉన్న సమయంలో బస్సుల కొనుగోలు కోసం రూ.200 కోట్ల బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆర్టీసీకి చిల్లిగవ్వ కూడా కేటాయించలేదని పలిశెట్టి మండిపడ్డారు. పైగా ప్రభుత్వం ఆర్టీసీకి సకాలంలో బకాయిలు చెల్లించని కారణంగా కార్మికులు ఉద్యమాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులందరి తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రావు, వర్కింగ్ ప్రెసిడెంటు యం.హనుమంతురావు, చీఫ్ వైస్ ప్రెసిడెంటు పి.సుబ్రమణ్యంరాజు, ఉప ప్రధానకార్యదర్శులు జి.వి.నరసయ్య, ఆవుల ప్రభాకర్ తదితరులు సంతోషం వ్యక్తం చెేశారు. కాగా ఆర్టీసీకి కేటాయించిన నిధుల్లో బస్‌పాసులకు, ఇతర రాయితీలకు రూ.500 కోట్లు, బస్సు కొనుగోలుకు రూ.50 కోట్లు, ఆర్థిక సహాయార్థం రూ.1000 కోట్లు ప్రకటించారు. -
ప్రభుత్వ వైఖరి వల్లే ఆర్టీసీకి నష్టాలు
నెల్లూరు (దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల బాటలో పయనిస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆరోపించారు. ఆర్టీసీని రక్షించాలని కోరుతూ బస్టాండ్‌లో సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద బాకీపడ్డ రూ.2 వేల కోట్లను విడుదల చేయాలన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలన్నారు. ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతుందన్నారు. సమ్మె సన్నాహక యాత్రలో భాగంగా తిరుపతి రీజియన్ కార్మికులు మంగళవారం అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తారన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఈయూ అదనపు ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. ఆర్టీసీ పరిరక్షణకు తలపెట్టిన సమ్మెకు ఉద్యోగులు, కార్మికులు, అధికారులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్యంరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్, నెల్లూరు జోన్ అధ్యక్ష, కార్యదర్శులు మహబూబ్, శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు -1 డిపో అధ్యక్ష, కార్యదర్శులు బాషా, వెంకటేశ్వర్లు, 2డిపో అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, ప్రసాద్ పాల్గొన్నారు.