ప్రభుత్వ వైఖరి వల్లే ఆర్టీసీకి నష్టాలు
నెల్లూరు (దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాల వల్లే ఆర్టీసీ నష్టాల బాటలో పయనిస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆరోపించారు. ఆర్టీసీని రక్షించాలని కోరుతూ బస్టాండ్‌లో సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దామోదరరావు మాట్లాడుతూ ఆర్టీసీని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ పద్దుల కింద బాకీపడ్డ రూ.2 వేల కోట్లను విడుదల చేయాలన్నారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచనను విరమించాలన్నారు. ప్రైవేటు వాహనాల అక్రమ రవాణా వల్ల ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు ఆదాయం కోల్పోతుందన్నారు.
సమ్మె సన్నాహక యాత్రలో భాగంగా తిరుపతి రీజియన్ కార్మికులు మంగళవారం అలిపిరి నుంచి తిరుమలకు పాదయాత్ర నిర్వహిస్తారన్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈనెల 11 నుంచి నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని ఈయూ అదనపు ప్రధాన కార్యదర్శి హెచ్చరించారు. ఆర్టీసీ పరిరక్షణకు తలపెట్టిన సమ్మెకు ఉద్యోగులు, కార్మికులు, అధికారులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్రమణ్యంరాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రకాష్, నెల్లూరు జోన్ అధ్యక్ష, కార్యదర్శులు మహబూబ్, శ్రీనివాసులరెడ్డి, నెల్లూరు -1 డిపో అధ్యక్ష, కార్యదర్శులు బాషా, వెంకటేశ్వర్లు, 2డిపో అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, ప్రసాద్ పాల్గొన్నారు.