‘రూట్ల ప్రైవేటీకరణ’పై స్టే పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటీకరణ చేయాలని మంత్రివర్గం చేసిన తీర్మానంపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని, మధ్యంతర స్టే ఉత్తర్వులను ఎత్తేయాలని ప్రభుత్వం చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. స్టే ఉత్తర్వుల వల్ల కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై తర్వాత ప్రక్రియ చేపట్టేందుకు వీలు లేకుండా పోయిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. స్టే రద్దు చేయాలన్న వినతిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం తిరస్కరించింది. మోటారు వాహ న చట్టంలోని 102 సెక్షన్ ప్రకారం ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా ఉంటుం దని, ఇప్పటికిప్పుడే సులభంగా చేసేది కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
రూట్ల ప్రైవేటీకరణకు కేబినెట్ తీర్మానం చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజా హిత వ్యాజ్యంపై విచారణను 22వ తేదీ శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించిం ది. అప్పటివరకు స్టే ఉత్తర్వులు అమలును కొనసాగిస్తున్నట్లు తెలిపింది. విచారణ సందర్భంగా ధర్మాసనం.. ఆర్టీసీకి సమాతరంగా ప్రైవేటు రూట్లకు అనుమతినివ్వాలని మంత్రివర్గ తీర్మానం చేయడం ప్రాథమిక దశలోని వ్యవహారమని, ఆ నిర్ణయానికి చట్టబద్ధత తెచ్చేందుకు ఆ తర్వాత చాలా ప్రక్రియ ఉంటుందని, ఇప్పుడే పిల్ దాఖలు చేయడం అపరిపక్వతే అవుతుందని వ్యాఖ్యానించింది.
సహజ వనరుల వ్యవహారమా?
సహజ వనరులను ప్రైవేటీకరణ చేసేందుకు వీల్లేదని సుప్రీంకోర్టు రిలయన్స్, టూజీ కేసుల్లో చెప్పిం దని పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభా కర్ చేసిన వాదనలు ఈ కేసుకు వర్తించవని కోర్టు చెప్పింది. సెక్షన్ 102 ప్రకారం ఆర్టీసీకి సమాంతరంగా ప్రైవేటు గ్యారేజీలకు రాష్ట్రాలకు కేంద్రమే అనుమతినిచ్చిందని గుర్తుచేసింది. రోడ్ల ప్రైవేటీకరణ సహజ వనరులుగా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నందున ప్రైవేటు ఆపరేటర్లకు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయిస్తున్నట్లు ఆర్టీసీ, ప్రభుత్వం చెబుతుంటే, ఆర్టీసీ ఆస్తులనే ప్రైవేటుకు ఇచ్చేస్తారనే భయం ఏమైనా పట్టుకుందా? అనే సందేహాన్ని ధర్మాసనం లేవనెత్తింది.
సమ్మెను అడ్డంపెట్టుకుని బస్సు రూట్లను ప్రైవేటీకరణ చేయాలని విశ్వాసరాహిత్యానికి పా ల్పడే చర్యగా పరిగణించాలని న్యాయవాది కోరా రు. నేరుగా చేయలేని దానిని పరోక్షంగా కూడా చేయకూడదు.. అని ఏనాడో సుప్రీంకోర్టు చెప్పిం దని గుర్తు చేశారు. సెక్షన్ 67, 67, 102, చాప్టర్ 5, 6ల్లోని అంశాలపై సాంకేతికపర వివరాల్ని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చాప్టర్ 5, 6లు పరస్పర విరుద్ధంగా ఏమీ లేవని ధర్మాసనం చెప్పింది.
ఈ దశలో వ్యాజ్యం చెల్లదు: ఏజీ
ఏజీ వాదిస్తూ.. పిల్ దాఖలుపై ప్రాథమికంగానే ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరాలున్నాయని చెప్పా రు. బస్సు రూట్ల ప్రైవేటీకరణ విషయాన్ని ఆర్టీసీ పరిశీలించాలని మాత్రమే కేబినెట్ తీర్మానం చేసిం దని, ఈ దశలోనే పిల్ దాఖలు చేయడం చెల్లదన్నారు. ఆర్టీసీ అమలు చేసే రవాణా విధానాలను మార్పులు, చేర్పులు చేసేందుకు 102 సెక్షన్ వీలు కల్పిస్తోందని, కేంద్ర ప్రభుత్వం చేసిన చట్ట సవరణల ద్వారానే రాష్ట్రాలకు ప్రైవేటు రూట్లకు అనుమతినిచ్చే సర్వాధికారాలు సిద్ధించాయని తెలిపారు.
కేబినెట్ నిర్ణయం పూర్తి రూపుదాల్చలేదని, ఆ తీర్మానంపై గవర్నర్ ఆమోదముద్ర వేశాక జీవో జారీ అయితేనే చట్టబద్ధత వస్తుందని, అప్పుడు ఎవరికైనా అభ్యంతరాలుంటే హైకోర్టును ఆశ్రయించేందుకు వీలుంటుందని ఏజీ వాదించారు.
ఇప్పుడు గవర్నర్ మాత్రమే సమీక్ష చేయాలా?
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. కేబినెట్ నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపాకే న్యాయ సమీక్ష చేయాలని అంటున్నారా.. ఇప్పుడు గవర్నరే సమీ క్షచేయాలా.. అని ప్రశ్నించింది. ఉత్తరాంచల్ హైకో ర్టు కేసులో రెండు ప్రభుత్వ శాఖల మధ్య జరిగిన లావాదేవీలను న్యాయ సమీక్ష చేయరాదని మాత్రమే సుప్రీంకోర్టు చెప్పిందని, ఇక్కడ కేబినెట్ తీసుకున్న నిర్ణయం రెండు శాఖల మధ్య లావాదేవీలుగా ఎలా పరిగణించాలో చెప్పాలని కోరింది. తిరిగి ఏజీ వాదనలు కొనసాగిస్తూ.. కేరళలో నలుగురు జడ్జీల నియామక విషయంలో వారి పేర్లను మంత్రివర్గం గవర్నర్‌కు సిఫార్సు చేసే దశలోనే కోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిందని, ఈ తీర్పు ప్రకారం రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టులో సవాల్ చేయడానికి వీల్లేదన్నారు.
పిటిషనర్ అపోహలతో హైకోర్టును ఆశ్రయించారని, పిల్‌ను తోసిపుచ్చాలని కోరారు. స్టే ఎత్తివేసి మంత్రివర్గం తీర్మానంపై తదుపరి చర్యలకు న్యాయపరమైన అడ్డంకులు తొలగించాలని అభ్యర్థించగా, ధర్మాసనం తోసిపుచ్చింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నామని, అదే రోజున ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలపై దాఖలైన మరో పిల్‌ను కూడా విచారిస్తామని ధర్మాసనం పేర్కొంది.
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు: సీఎస్
ఆర్టీసీ సమ్మె వల్ల కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నందున యూనియన్ నేతలతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వానికి ఉత్తర్వులివ్వాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై న్యాయ సమీక్ష చేసేందుకు ఆస్కారం లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి హైకో ర్టుకు తెలియజేశారు. ఆర్టీసీ యూనియన్‌తో ప్రభుత్వం చర్చలు జరిపేలా ఉత్తర్వులివ్వాలని, ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలను అడ్డుకోవాలని విశ్వేశ్వరరావు దాఖలు చేసిన మరో పిల్లో హైకోర్టు ఆదేశాల మేరకు సీఎస్ కౌం టర్ దాఖలు చేశారు.
ఆర్టీసీ సమ్మెపై లేబర్ కోర్టు తేల్చాలని, పారిశ్రామిక వివాదాల చట్టంలోని సెక్షన్ 10 కింది కార్మికశాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకోవాలని ఇదే హైకోర్టు ఉత్తర్వులిచ్చిందని చెప్పారు. వేర్వేరు కారణాలతో కార్మికులు చనిపోతే ఆర్టీసీ సమ్మె కారణంగా చనిపోయారని పిల్లో ఆరోపించా రని చెప్పారు. సమ్మె–చర్చలు వంటి అంశాలపై ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా 2 వారాల్లో కార్మిక శాఖ కమిషనర్ తగిన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.