వారికి ‘మామూలే’! | Excise commissioner who MRP mandatory in alcohol sales | Sakshi
Sakshi News home page

వారికి ‘మామూలే’!

Published Mon, Jun 26 2017 3:21 PM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM

వారికి ‘మామూలే’! - Sakshi

వారికి ‘మామూలే’!

► మద్యం అమ్మకాల్లో ఎమ్మార్పీ తప్పనిసరి చేసిన ఎక్సైజ్‌ కమిషనర్‌
► ఎక్సైజ్‌ అధికారులకు మామూళ్ల నిలిపివేసిన వ్యాపారులు
► అర్ధరాత్రి అమ్మకాల కోసం పోలీస్‌ శాఖకు మామూళ్లు
► రక్షకభటుల్లోనూ మార్పు వస్తే అక్రమ అమ్మకాలకు చెక్‌


సాక్షి, అమరావతిబ్యూరో: మద్యం అక్రమంగా విక్రయించడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయి. వాటిని అరికట్టాల్సిన పోలీసులే పరోక్షంగా ఇందుకు కారణమవుతున్నారు. మద్యం వ్యాపారుల వద్ద మమూళ్లు తీసుకుని అక్రమ అమ్మకాలను చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనివల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల్లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ లక్ష్మీనరసింహం... ఎమ్మార్పీకే మద్యం విక్రయించాలని ఆదేశించారు. ఈ మేరకు వ్యాపారులు ఎమ్మార్పీకే మద్యం విక్రయిస్తున్నందున ఎక్సైజ్‌ శాఖకు నెలవారీ మామూళ్లను నిలిపివేశారు.

అయితే, అర్ధరాత్రి వరకు అమ్మకాలు కొనసాగిస్తున్నప్పటికీ పట్టించుకోని పోలీసులు మాత్రం యథావిధిగా డబ్బులు తీసుకుంటూనే ఉన్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ లక్ష్మీనరసింహం స్వయంగా డీజీపీకి లేఖ రాశారు. దీంతో ఎవరూ మామూళ్లు తీసుకోవద్దని డీజీపీ అన్ని జిల్లాల ఎస్పీలకు చెప్పినట్లు సమాచారం. పోలీసులు కూడా లంచాలు తీసుకోకుండా... నిబంధనలు పాటించాలని వ్యాపారులను హెచ్చరిస్తే మద్యం అక్రమ విక్రయాలను అరికట్టే అవకాశం ఉంటుంది.

ఎక్సైజ్‌కు చెక్‌..!
రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, తెనాలి, నరసరావుపేట ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాల పరిధిలో 695 మద్యం దుకాణాలు ఉన్నాయి. నెలకు ఒక వైన్‌ షాపు నుంచి రూ.30వేలు చొప్పున మామూళ్లు ఇచ్చేవారు. ఈ లెక్కన 695 షాపుల నుంచి రూ.2.85 కోట్లు వసూలు చేసేవారు. ఆ నగదును ఎక్సైజ్‌ శాఖ ఉన్నతాధికారుల నుంచి కానిస్టేబుల్‌ వరకు పంచుకునేవారు.

మరోవైపు స్టేట్‌ టాస్క్‌ఫోర్స్, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పేరుతో అదనపు మామూళ్లు ఇచ్చేవాళ్లమని వైన్‌ షాపుల యజమానులు తెలిపారు. ఇందుకు ప్రతిఫలంగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు సాగించేవారు. ఎమ్మార్పీ ఉల్లంఘించేవారు. బెల్టు దుకాణాలు నిర్వహించేవారు. లూజు విక్రయాలు, రాత్రి, పగలు అనే తేడా లేకుండా విక్రయించడం, మద్యంలో కల్తీ చేయడం.. ఇలా అడుగడుగునా ఇష్టానుసారంగా వ్యవహరించేవారు.

ఇటీవల ఎక్సైజ్‌ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీనరసింహం నిర్ణయాల వల్ల నెలవారీ మామూళ్లకు చెక్‌ పడింది. ఎమ్మార్పీ తప్పకుండా అమలు చేయడంతో వైన్‌ షాపుల యజమానులకు మామూళ్ల బెడద తగ్గింది. అదే సమయంలో ఆదాయం కూడా కాస్త తగ్గింది. దీంతో ఎక్సైజ్‌ శాఖకు మామూళ్లు ఇచ్చుకోలేమని చెప్పేశారు. నెలవారీ ఆదాయం రాక అధికారులు మథనపడుతూ ఇండెంట్ల పేరుతో ఎంతో కొంత రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నా, వ్యాపారులు మాత్రం ససేమిరా అంటున్నారు.

పోలీస్‌ శాఖ విషయంలో మార్పు లేదు
ఎక్సైజ్‌ శాఖకు మామూళ్లు నిలిపివేసిన మద్యం వ్యాపారులు... పోలీస్‌ శాఖకు మాత్రం యథావిధిగానే ఇస్తున్నారు. ఒక్కో మద్యం షాపు నుంచి ప్రతి నెలా పోలీస్‌స్టేషన్‌కు రూ.13 వేల చొప్పున సమర్పించుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు. ఈ క్రమంలో 695 దుకాణాలకు నుంచి నెలకు రూ.90 లక్షల వరకు ముట్టజెబుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే ఎమ్మార్పీకి మద్యం విక్రయిస్తున్నందున లాభాలు తగ్గాయని, పోలీసులు కూడా కఠినంగా వ్యవహరిస్తే తాము నష్టపోతామని వ్యాపారులు చెబుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విక్రయాలు సాగిస్తే తమకు లాభాలు వస్తాయని, అందుకోసం పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.

ఈ క్రమంలో రాత్రిళ్లు షాపులు మూసివేసి, పక్కనే బడ్డీ కొట్లు, చిన్న గదుల్లో బెల్ట్‌ దుకాణాలు ఏర్పాటు చేసి తెల్లవారే వరకు మద్యం విక్రయిస్తున్నారు. పోలీసులు కూడా మమూళ్లు తీసుకోకుండా ఉంటే మద్యం షాపులు నిబంధనల ప్రకారం నడిపే అవకాశం ఉంటుంది. ఈ విషయంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement