నీళ్లు వదిలేటప్పుడు హెచ్చరికలేవీ: హైకోర్టు
హిమాచల్ ప్రదేశ్లో తెలుగు విద్యార్థులు మృతిచెందిన ఘటనపై ఆ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బియాస్ నది ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. లార్జి ప్రాజెక్టు అధికారులపై కూడా కోర్టు మండిపడింది. ఈ దుర్ఘటన వెనుక అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందని, నీళ్లు వదిలేటప్పుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని హైకోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం ఎలా సంభవించింది, అందుకు కారణాలేంటన్న వివరాలతో ఈనెల 16వ తేదీలోగా కోర్టుకు నివేదిక ఇవ్వాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు.
మరోవైపు సహాయక చర్యల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 గంటలు గడిచినా, ఇంతవరకు చాలామంది ఆచూకీ తెలియలేదని, ఆచూకీ తెలుసుకోడానికి సైన్యాన్ని రంగంలోకి దించాలని డిమాండ్ చేశారు.
ఆ ప్రాంతం సురక్షితమేనని చెప్పడం వల్లే తామంతా ఫొటోలు తీసుకోడానికి కిందకు దిగామని సురక్షితంగా బయటపడిన విద్యార్థులలో కొందరు చెప్పారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా నీళ్లు పెద్ద స్థాయిలో రావడంతో ఆ సమయానికి ఏం చేయాలో కూడా తెలియలేదని అన్నారు. అది ప్రమాదకరమైన ప్రాంతం అని తమకు ఎవరూ చెప్పలేదని విద్యార్థులు తెలిపారు.