జియో 4జీ వేగం ఇంత తక్కువా?
కొత్తగా 4జీ మార్కెట్లోకి అరంగేట్రం చేసిన రిలయన్స్ జియో ఇంటర్నెట్ స్పీడ్, ఇతర టెలికాం కంపెనీలు ఆఫర్ చేసే నెట్ స్పీడ్ లతో పోలిస్తే చాలా తక్కువగా ఉందని ట్రాయ్ వెల్లడించింది. జియో కంటే వేగవంతమైన ఇంటర్నెట్ను ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్, అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్లే అందిస్తున్నాయని ట్రాయ్ తన వెబ్సైట్లో పేర్కొంది. ఎయిర్టెల్ 4జీ వేగం 11.4 ఎంబీపీఎస్, ఐడియా 7.6 ఎంబీపీఎస్, వొడాఫోన్ 7.3 ఎంబీపీఎస్, ఆర్‌కామ్ 7.9ఎంబీపీఎస్లు ఉన్నట్టు తెలిపింది. అదే ముఖేష్ అంబానీ జియో విషయానికి వస్తే 4జీ నెట్‌వర్క్‌పై కేవలం 6.2ఎంబీపీఎస్ స్పీడ్‌లోనే ఇంటర్నెట్ ను అందిస్తున్నట్టు వెల్లడించింది. అయితే ట్రాయ్ డేటాతో రిలయన్స్ కంపెనీ విభేదిస్తోంది.
యూజర్ డౌన్లోడ్ చేసుకునే 4జీబీ డేటా ఫేర్ యూసేజ్ పాలసీ(ఎఫ్‌యూపీ) లిమిట్ మొత్తాన్ని వినియోగదారులు ఖర్చుచేశాక వేగాన్ని ట్రాయ్‌ను లెక్కగట్టిందని పేర్కొంటోంది. ఒక్కసారి వినియోగదారులు ఎఫ్‌యూపీ లిమిట్ మొత్తాన్ని వాడుకున్నాక, వేగం 256 కేబీపీఎస్ వరకు పడిపోతుందని జియో ఓ ప్రకటనలో తెలిపింది. జియో కస్టమర్లు 4జీ స్పీడ్‌ను బాగా సద్వినియోగ పరుచుకుంటున్నారని, వేగం తగ్గిపోయిందనడంలో ఎలాంటి నిజం లేదని కంపెనీ పేర్కొంటోంది.
మరోవైపు జియో వచ్చిన తొలి రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ 40 ఎంబీపీఎస్ వరకూ ఉండేదని, క్రమంగా ఆ వేగం తగ్గిపోతుందని వినియోగదారులూ వాపోతున్నారు. జియో సర్వీసులన్నీ 4జీలో ఉండడంతో చార్జింగ్ కూడా త్వరగా అయిపోతోందని, దీంతో మాటిమాటికి బ్యాటరీని రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 31 వరకు ఉచిత డేటా, ఉచిత వాయిస్ వంటి సంచలన ప్రకటనలు చేస్తూ జియో సెప్టెంబర్‌లో టెలికాం పరిశ్రమలోకి అడుగు పెట్టింది. వాయిస్ కాల్స్‌పై అసలు వినియోగదారులకు ఎలాంటి చార్జీలు వసూలు చేయమని, రూ.50కు 1జీబీ డేటాను ఆఫర్ చేస్తామని కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.