షేర్ల బదిలీతో ఆదాయం రాలేదు..
* దానిపై పన్ను విధించడానికి కూడా వీల్లేదు
* వోడాఫోన్ పన్ను వివాదంలో బొంబే హైకోర్టు చారిత్రక తీర్పు
* ఈ తరహా కేసులు ఎదుర్కొంటున్న ఇతర కంపెనీలకు ఉత్సాహం
సాక్షి, హైదరాబాద్: వాటాల విక్రయం, బదిలీకి సంబంధించి ఆదాయపు పన్ను శాఖతో ఏర్పడిన వివాదంలో బాంబే హైకోర్టు వోడాఫోన్ ఇండియా సర్వీసెస్ లిమిటెడ్ (వీఐఎస్పీఎల్)కు అనుకూలంగా తీర్పునిచ్చింది. వాటాల బదిలీని ఆదాయంగా పరిగణించడానికి వీల్లేదని ఆ తీర్పులో తేల్చి చెప్పింది. అది ఆదాయమే కానప్పుడు దానిపై పన్ను విధించడానికి అవకాశమే లేదని హైకోర్టు తన 53 పేజీల తీర్పులో స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్ ఎస్.షా, జస్టిస్ ఎం.ఎస్.సంక్లేచాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం చారిత్రక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదమవుతూ వస్తున్న ఈ అంశంలో స్పష్టత లభించినట్లయింది. ఆదాయపు పన్ను శాఖతో ఇదే రకమైన వివాదాలు ఎదుర్కొంటున్న షెల్ ఇండియా, హెచ్ఎస్బీసీ, ఎస్సార్ గ్రూప్‌కు చెందిన 5 కంపెనీలు, భారతీ ఎయిర్టెల్ తదితర కంపెనీలకూ ఊరట లభించే అవకాశం ఉంది.
వోడాఫోన్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం..
దీనిపై వోడాఫోన్ ఇండియా న్యాయ పోరాటం ప్రారంభించింది. ఆదాయపు పన్ను శాఖ అధికారుల తాఖీదులపై బొంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అంతర్జాతీయ లావాదేవీ ద్వారా ఆదాయం సమకూరనప్పుడు ఆదాయపు పన్ను చట్టంలోని చాఫ్టర్ 10 వర్తించదని తెలిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం వోడాఫోన్ వాదనలతో ఏకీభవించింది. యాజమాన్యపు కంపెనీకి వాటాల జారీ చేయడం ద్వారా వోడాఫోన్ ఇండియా మూలధ న రాబడి పొందలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. విదేశీ యాజమాన్యపు కంపెనీకి ప్రీమియంతో వాటాలు జారీ చేసి నిధులు పొందితే, దానిని ఆదాయంగా పరిగణించడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది.
‘దేనిపై పన్ను వేయాలో ఆదాయపు పన్ను చట్టంలో స్పష్టంగా ఉంది. చాఫ్టర్ 10లో పన్ను విధింపు సెక్షన్ లేనప్పుడు, దాని ఆధారంగా పన్ను విధించడం తగదు. ఈ కేసులో వాటాల బదలాయింపు ద్వారా వోడాఫోన్ ఇండియా పొందిన నిధులను ఆదాయంగా పరిగణించడానికి వీల్లేదు. ఆదాయమే కానప్పుడు దానిపై పన్ను వేయడానికి కూడా వీల్లేదు’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. పన్ను చెల్లించాలంటూ ఆదాయపు పన్ను శాఖాధికారులు జారీ చేసిన నోటీసులను, తదానుగుణ ఉత్తర్వులను కొట్టివేసింది.
ఇదీ వివాదం...
యాజమాన్య కంపెనీ (హోల్డింగ్) అయిన వోడాఫోన్ టెలీ సర్వీసెస్ (ఇండియా) హోల్డింగ్స్ లిమిటెడ్‌కు వోడాఫోన్ ఇండియా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనుబంధ కంపెనీ. 2008-09 ఆర్ధిక సంవత్సరంలో ఈ కంపెనీకి మన దేశంలో టెలికమ్యూనికేషన్ సర్వీసులు ప్రారంభించేందుకు తన యాజమాన్య కంపెనీ అయిన వోడాఫోన్ టెలీ సర్వీసెస్ నుంచి నిధులు అవసరమయ్యాయి. దీంతో వోడాఫోన్ ఇండియా రూ.10 ముఖ విలువ కలిగిన 2,89,224 ఈక్విటీ వాటాలను ఒక్కో వాటా రూ.8,519 ప్రీమియంతో ఎన్ఆర్సీ అయిన వోడాఫోన్ టెలీ సర్వీసెస్‌కు జారీ చేసి, రూ.246.38 కోట్లు తీసుకుంది.
2008 ఆగస్టు 21న రూ.86.93 కోట్లు, నవంబర్ 5న మిగిలిన రూ.159.46 కోట్లు తీసుకుంది. క్యాపిటల్ ఇష్యూస్ (కంట్రోల్) చట్టం 1947కు అనుగుణంగా వోడాఫోన్ ఇండియా తన షేరు విలువను నిర్ణయించింది. అయితే ఆదాయపు పన్ను అధికారులు మాత్రం షేరు విలువను తక్కువ చేసి చూపారని, రూ.53,775 ఉండాల్సిన ఒక్కో వాటా విలువను రూ.8,519గా మాత్రమే నిర్ణయించారని, దీని వల్ల మొత్తంగా రూ.1308.91 కోట్లను తక్కువగా చూపారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ 1308.91 కోట్లను ఆదాయపు పన్ను చట్టంలోని చాఫ్టర్ 10 (ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్) కింద ఆదాయంగా పరిగణిస్తున్నామని తేల్చారు. అంతేకాక ఈ రూ.1308 కోట్ల మొత్తాన్ని వోడాఫోన్ టెలీ సర్వీసెస్‌కు రుణంగా ఇచ్చినట్లు, దీనిపై రూ.88.35 కోట్లు వడ్డీ ఆదాయంగా పొందినట్లు పరిగణిస్తున్నామని, అందువల్ల దీనికి పన్ను చెల్లించాలంటూ తాఖీదులు జారీ చేశారు.