64% పెరిగిన ఐడియా లాభం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో టెలికం సంస్థ ఐడియా సెల్యులార్ నికర లాభం 64 శాతం పెరిగి రూ. 767 కోట్లుగా నమోదైంది. డేటా, వాయిస్ విభాగాల వ్యాపార పరిమాణం గణనీయంగా పెరగడం దీనికి తోడ్పడిందని కంపెనీ తెలిపింది. క్రిత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో కంపెనీ నికర లాభం రూ. 468 కోట్లు, కాగా ఆదాయం రూ. 6,613 కోట్లు. తాజా క్వార్టర్లో ఆదాయం 21 శాతం పెరిగి రూ. 8,017 కోట్లకు చేరింది.
గతేడాది మొత్తం మీద (2014) కొత్తగా 2.22 కోట్ల మేర కనెక్షన్లు పెరిగాయని కంపెనీ తెలిపింది.
ఐడియాకు అత్యధిక కొత్త కస్టమర్లు: గ్రామీణ ప్రాంతాల్లో గత ఏడాది డిసెంబర్లో 41.5 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులయ్యారని సీఓఏఐ తెలిపింది. దీంతో డిసెంబర్ చివరి నాటికి మొత్తం గ్రామీణ వినియోగదారుల సంఖ్య 31.97 కోట్లకు చేరిందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల్లో ఐడియా సెల్యులర్కు అత్యధికంగా వినియోగదారులు లభించారు. 20.4 లక్షల మంది కొత్త వినియోగదారులు లభించారు. ఆ తర్వాతి స్థానంలో 8.5 లక్షల మంది కొత్త వినియోగదారులతో భారతీ ఎయిర్టెల్ రెండో స్థానంలో నిలిచింది.