చారిత్రక అసత్యాలతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’
పంజగుట్ట: గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో చరిత్రను పూర్తిగా వక్రీకరించారని, సినిమా మొత్తం చారిత్రక అసత్యాలతో కూడి ఉందని పలువురు చరిత్రకారులు అన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షులు కెప్టెన్ ఎల్.పాండురంగారెడ్డి, హైదరాబాద్ డక్కెన్ డెమోక్రటిక్ అలయన్స్ అధ్యక్షులు డాక్టర్ చిరంజీవి కొల్లూరి, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రతినిధి డి.పి.రెడ్డిలు మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన తెలంగాణ చరిత్రను, ఇక్కడి కళాకారులను ప్రొత్సహించేది పోయి చరిత్రను వక్రీకరించిన సినిమాకు వినోదపన్ను రాయితీ ఇవ్వడం సరికాదని వారు ఆగ్రహంవ్యక్తం చేశారు.
(చదవండి : ఇది ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కానేకాదు )
వినోదపన్ను రద్దు కమిటీ నివేదిక లేకుండా పన్ను రద్దు చేశారని, వెంటనే పన్ను రద్దును ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు హెచ్చరించారు. సినిమాలో పేర్కొన్నట్లుగా గౌతమీపుత్ర శాతకర్ణి కోటి లింగాలలో జన్మించలేదని, ఇతని తల్లి బాలశ్రీ నాసిక్‌లో వేయించిన శిలా శాసనములో ఈ విషయాన్ని పేర్కొనలేదని గుర్తుచేశారు. ఈయన భారతదేశం మొత్తం పాలించారని చూపారని, కాని కేవలం పశ్చిమ దక్కన్ పీఠభూమి మాత్రమే శాతకర్ణి ఆధీనంలో ఉందని తెలిపారు. శాతకర్ణి ఇండో గ్రీకు రాజైన డిమిట్రిస్తో యుద్ధం చేశాడన్నది చారిత్రక అసత్యమని, డిమిట్రిస్ క్రీస్తుపూర్వం 312కు చెందిన వారని, అతనికి శాతకర్ణికి 390 సంవత్సరాలు తేడా ఉందన్నారు. అతను తెలంగాణ వారిగా చూపారని, కాని మహారాష్ట్రకు చెందిన వారని తెలిపారు. ప్రజల్ని తప్పుదోవపట్టించి డబ్బులు సంపాదించుకునేందుకు సినిమా బృందం వినోదపన్ను రద్దు చేయించుకుని, ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతోందని ఆరోపించారు.