సాయం అందిస్తే సత్తా చాటుతాం
ఆత్మకూరు : నిరుపేద కుటుంబంలో పుట్టిన క్రీడా కుసుమాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పల్లె నుంచి పొరుగు దేశంలో జరిగే ప్రతిష్టాత్మక పోటీలకు ఎంపికైనప్పటికీ అక్కడి వెళ్లే స్తోమత లేక మనోవేదనకు గురవుతున్నారు. దాతలు ఆదుకుంటే పోటీల్లో సత్తాచాటి ఓరుగల్లు కీర్తిని నలుదిశలా చాటిచెబుతామని వారు పేర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని నీరుకుళ్లకు చెందిన వాలీబాల్æ్రMీ డాకారులు లక్కర్సు చందు, నిగ్గుల ప్రేమ్‌చంద్ మహారాష్ట్రలో ఈనెల 13వ తేదీ నుంచి 17 వరకు జరిగిన అండర్–19 వాలీబాల్ ఫస్ట్ యూత్ గేమ్స్ జాతీయస్థాయి పోటీలకు తెలంగాణ జట్టు తరపున పాల్గొన్నారు. పోటీల్లో ఇద్దరు అద్భుత ప్రతిభ కనబరచడంతో జట్టుకు మొదటి బహుమతి లభించింది. దీంతో నిర్వాహకులు చందు, ప్రేమ్‌చంద్‌ను నేపాల్‌లో ఈనెల 25 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే సౌత్ ఏషియన్ వాలీబాల్ పోటీలకు భారత జట్టు తరపున ఎంపిక చేశారు. అయితే నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరికి నేపాల్‌కు వెళ్లేందుకు ప్రయాణ, ఇతర ఖర్చులు భరించే స్తోమతలేదు. దీంతో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ప్రభుత్వం, దాతలు, క్రీడాభిమానులు ఆదుకుంటే పోటీ ల్లో పాల్గొని తమ సత్తాచాటుతామని వారు పేర్కొంటున్నారు. లక్కర్సు చందుకు సాయం చేసేవారు సెల్ : 99635–22851, నిగ్గుల ప్రేమ్‌చంద్‌కు సాయం చేసేవారు సెల్: 98666–64090 నంబర్లలో సంప్రదించవచ్చు.