పోలీసు పహారాలో అసెంబ్లీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీ చర్చకు గురువారం చివరిరోజు కావటం, బిల్లుపై ఓటింగ్‌కు అవకాశం ఉన్నందున అవాంఛనీయ ఘటనలను నివారించేందుకు అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ఒక్కో గేటు వద్ద అదనపు బలగాలు నియమించి అందర్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గుర్తింపు కార్డులను నిశితంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతించారు. ఇక గ్యాలరీలోకి వెళ్లే మీడియాపై ఆంక్షలు విధించారు.
గ్యాలరీ పాసులున్నవారినే అనుమతించారు. దీంతో మీడియా సిబ్బందిలో పలువురు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో మీడియా సిబ్బంది శాసనసభ కార్యదర్శిని కలిసి తమను లోనికి అనుమతించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసిన మీదట లాబీ పాసులున్నవారిని అనుమతించేందుకు అంగీకరించారు. బిగ్గరగా మాట్లాడొద్దని, ఎవరూ లేచినిలబడకుండా కుర్చీల్లోనే కూర్చోవాలని.. ఇలాంటి సూచనలు చేస్తూ సభ వాయిదా పడేవరకు మార్షల్ అక్కడే ఉండటం విశేషం.