ఇక వాళ్లు జోక్యం చేసుకోరట!
న్యూఢిల్లీ: కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ - లలిత్ మోదీ వ్యవహారంలో తలమునకలైన కేంద్రంలోని బీజేపీ సర్కారు - ఓటుకు కోట్లు వ్యవహారంలో తలదూర్చరాదనే ఆలోచనకు వచ్చినట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే కేసు కోర్టు ముందుకు వెళ్లడం, కీలక పాత్రధారిని ప్రశ్నించడం, అతను జైల్లో ఉండటం, మరో వైపు కేసులో అనుమానితుల్ని ప్రశ్నించేందుకు ACB వేగం పెంచడంతో ఇక ఇందులో జోక్యం చేసుకోరాదనే భావనలో ఢిల్లీ పెద్దలున్నట్టు సమాచారం. అసలు ఏపీ, తెలంగాణకు సంబంధించిన ఓటుకు కోట్లు వ్యవహారాన్ని పట్టించుకోరాదనే ధోరణి ఢిల్లీ నాయకుల్లో కనిపిస్తోంది.
దీనికి తోడు సుష్మా, లలిత్ మోదీ వ్యవహారంలో తాజాగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్ పేరు వినిపిస్తుండటంతో ఎటు పాలుపోని పరిస్థితి బీజేపీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో చట్టబద్ధంగా అన్ని సవ్యంగా ఉంటే నోటీసుల విషయంలో 'గో - ఎహెడ్' అని గవర్నర్కు ఢిల్లీ స్థాయి నుంచి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం పరిణామాల్ని గవర్నర్ నరసింహన్ ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నట్లు సమాచారం. గత వారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబుకు కూడా ప్రధాని మోదీ, బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని సూచించినట్టు తెలుస్తోంది. గవర్నర్ స్థాయిలోనే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని బాబుకు స్పష్టం చేసినట్టు సమాచారం.