ఓటు విలువ తెలుసుకో
ఏలూరు, న్యూస్‌లైన్ : ప్రతి ఒక్కరు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక సీఆర్ఆర్ రెడ్డి కళాశాల నుంచి పాత బస్టాండ్ వరకు ఓటర్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సిద్ధార్థజైన్ బెలూన్లను ఆకాశంలో ఎగురవేసి ఈ ర్యాలీని ప్రారంభించారు. వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, తరలిరావడంతో నగరంలోని రోడ్లు కిక్కిరిసిపోయాయి. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్లో విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. పాతబస్టాండ్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ విగ్రహం వద్ద కలెక్టర్ ఓటర్ల ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిద్ధార్థజైన్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో 2.75లక్షల మంది ఓటర్లు కొత్తగా నమోదయ్యారని, ఇందులో 60వేల మంది యువ ఓటర్లు ఉండడం అభినందనీయమని అన్నారు.
ఓటరుగా నమోదు కాబడిన ప్రతి ఒక్కరూ ఎన్నికల సమయంలో ఓటు హక్కును వినియోగించుకుని బలమైన ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేందుకు దోహదపడాలన్నారు. జేసీ టి.బాబూరావునాయుడు, ఏఎస్పీ ఎన్.చంద్రశేఖర్, డీఆర్వో కె.ప్రభాకర్‌రావు, జెడ్పీ సీఈవో వి నాగార్జున సాగర్, ఖజానాశాఖ డీడీ మోహన్‌రావు, ఏలూరు ఆర్డీవో బి.శ్రీనివాసరావు, డీఈవో ఆర్.నరసింహారావు, హౌసింగ్ పీడీ జి.సత్యనారాయణ, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, డీఎస్పీ ఎం.సత్తిబాబు, వ్యవసాయశాఖ జేడీ వీడీవీ కృపాదాస్, ఐసీడీఎస్ పీడీ వి.వసంతబాల, సెట్వెల్ సీఈవో ఎండీ మెహర్రాజ్, నగర కమిషనర్ జి.నాగరాజు, డీఎస్డీవో బి.శ్రీనివాసరావు, తహసిల్దార్లు పాల్గొన్నారు.