vote right card
-
అర్హులంతా ఓటు నమోదు చేసుకోవాలి
సాక్షి, మెదక్ : జిల్లాలో అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు బి. వెంకటేశ్వర్రావు అన్నారు. ఆదివారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం సంగాయిపేట, చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రెండుచోట్ల అధికారులు గుర్తించిన ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్, జాయింట్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఎజెంట్‌ను ఏర్పాటు చేసుకొని ఓటరు నమోదు కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలన్నారు. అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకునేలా చూడాలని నాయకులను కోరారు. ఫిబ్రవరి 14వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మామిండ్ల ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు చింతల నర్సింలు, టీడీపీ నాయకులు అప్జల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు పదే పదే స్థానిక సంస్థలకు ఒకచోట, సాధారణ ఎన్నికలకు మరోచోట ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు ఒకేచోట ఉండేలా చూడాలని వారు కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల కొంతమంది ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని, దీన్ని నివారించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, బీజేపీ నాయకుడు మల్లేశం, సీపీఎం నాయకుడు ఏ.మల్లేశం, డీఆర్ఓ రాములు, ఆర్డీఓలు మెంచు నగేష్, మధు, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
కార్డు పోతే..?
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: ఇప్పుడు ఎవరిజేబులో చూసినా పచ్చనోట్ల కన్నా ఎక్కువ కార్డులే కనిపిస్తున్నాయి. ఏటీఎం కార్డు, పాన్‌కార్డు, డ్రైవింగ్‌లెసైన్స్, ఓటర్ గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు...ఇలా అన్నీ కార్డులే ఉంటున్నాయి. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ ఎలా పొందాలో తెలియక చాలామంది ఆందోళన చెందుతుంటారు. పోయిన కార్డుల స్థానంలో కొత్తకార్డులను ఎలా పొందాలో తెలిపేదే ఈ కథనం... పాన్‌కార్డు... ఈ రోజుల్లో ఉద్యోగులు, వ్యాపారులతోపాటు సామాన్యులు సైతం పాన్‌కార్డు తీసుకుంటున్నారు. దీన్ని పోగొట్టుకుంటే దీనికి సంబంధించిన ఏజెన్సీలో ఫిర్యాదు చేయాలి. దీనికి పాన్‌కార్డు నంబర్, కలర్‌ఫొటో, నివాస ధృవీకరణపత్రం లేదా రేషన్‌కార్డు జిరాక్స్ జతచేయాలి. దరఖాస్తుకు రూ.5, మరో కార్డు మంజూరు చేసేందుకు రూ.60 వసూలు చేస్తారు. విచారించి 20 రోజుల్లోపు పాన్‌కార్డు పంపిస్తారు. రేషన్‌కార్డు పోతే... ప్రస్తుతం రేషన్‌కార్డు ప్రాధాన్యత ఎక్కువే. దీని ద్వారా సరుకులు పొందడంతో పాటు, బ్యాంకు అకౌంట్లు, సిమ్‌కార్డులు పొందటం ఇలాంటి వాటన్నింటికీ దీన్నే ఉపయోగిస్తారు. ఒకవేళ రేషన్‌కార్డు పోగొట్టుకుంటే ముందుగా తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. దానికోసం రూ.10 లేదా 20 చెల్లిస్తే దీని స్థానంలో మరోకార్డును అందజేస్తారు. ఇలాగే ఓటరు గుర్తింపు కార్డు కూడా పొందవచ్చు. ఒకవేళ కార్డు నంబర్ తెలిసి ఉంటే అప్పటికప్పుడే మీ సేవాలో నామమాత్రపు ఖర్చుతో పొందవచ్చు. పట్టాదారు పాసుపుస్తకం... పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్ పోతే ముందుగా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. అక్కడ ఎఫ్ఐఆర్ ఆధారంగా పత్రికల్లో ప్రకటించాలి. ఏ ప్రాంతానికి చెందుతారో అక్కడ ఉన్న అన్ని బ్యాంకుల నుంచి ఒక ధ్రువీకరణ పత్రాన్ని పొందాలి. ఏ బ్యాంకులోనూ వీటిని తాకట్టు పెట్టలేదనే పత్రాన్ని సమర్పించాలి. వీటితో పాటు పట్టదారు పాసుపుస్తకానికి రూ.1000, టైటిల్ డీడ్ కోసం రూ.100 చలానా తీసి మీసేవాలో దరఖాస్తు చేస్తే మళ్లీ పొందవచ్చు. ఏటీఎం కార్డయితే... ఏటీఎం కార్డును పోగొట్టుకుంటే మాత్రం వెంటనే అప్రమత్తం కావాలి. లేదంటే అకౌంట్లోని డబ్బులను భారీగా నష్టపోయే అవకాశముంది. ఈ కార్డు ఎవరికైనా దొరికితే దానిద్వారా డబ్బులు తీయలేకపోయినప్పటికీ... విచ్చల విడిగా షాపింగ్ చేసే ప్రమాదం ఉంది. అందుకే కార్డు పోయిన వెంటనే సంబంధిత బ్యాంకుకు చెందిన వినియోగదారుల సేవా కేంద్రానికి ఫోన్ చేసి కార్డును బ్లాక్ చేయించాలి. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే ముందుగా మన చిరునామాకు కార్డు పంపిస్తారు. ఆ తర్వాత వారం రోజులకు రహస్య పిన్‌కోడ్ నంబర్ ఇస్తారు.