సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు
సాక్షి, మెదక్ : జిల్లాలో అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు బి. వెంకటేశ్వర్‌రావు అన్నారు. ఆదివారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం సంగాయిపేట, చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రెండుచోట్ల అధికారులు గుర్తించిన ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్‌లో ఇన్‌చార్జి కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్, జాయింట్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన
మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఎజెంట్‌ను ఏర్పాటు చేసుకొని ఓటరు నమోదు కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలన్నారు. అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకునేలా చూడాలని నాయకులను కోరారు. ఫిబ్రవరి 14వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మామిండ్ల ఆంజనేయులు, టీఆర్‌ఎస్ నాయకులు చింతల నర్సింలు, టీడీపీ నాయకులు అప్జల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు పదే పదే స్థానిక సంస్థలకు ఒకచోట, సాధారణ ఎన్నికలకు మరోచోట ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు ఒకేచోట ఉండేలా చూడాలని వారు కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల కొంతమంది ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని, దీన్ని నివారించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, బీజేపీ నాయకుడు మల్లేశం, సీపీఎం నాయకుడు ఏ.మల్లేశం, డీఆర్‌ఓ రాములు, ఆర్డీఓలు మెంచు నగేష్, మధు, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment