eligible candidates
-
ఉత్తమ ఉపాధ్యాయులుగా 54 మంది ఎంపిక
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రస్థాయిలో అవార్డులకు అర్హుల ఎంపికను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ అవార్డులకు అర్హతలున్న వారికి సంబంధించి జిల్లా స్థాయిలో ప్రతిపాదనలు స్వీకరించిన పాఠశాల విద్యాశాఖ యంత్రాంగం ప్రత్యేక కమిటీ ద్వారా పరిశీలన చేసింది. ఇందులో భాగంగా నాలుగు కేటగిరీల్లో 97 ప్రతిపాదనలు పరిశీలించిన పరిశీలన కమిటీ... 42 మందిని ఎంపిక చేసింది. అదేవిధంగా ప్రత్యేక కేటగిరీలో మరో 12 మందికి అవకాశం కల్పించింది. మొత్తంగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 54 మందిని ఎంపిక చేసిన పాఠశాల విద్యా శాఖ కమిషనర్... శనివారం వారి పేర్ల జాబితాను ప్రకటించింది. మంత్రి సబితతో ఉత్తమ ఉపాధ్యాయుల భేటీ రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఈ నెల 4వ తేదీన మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్ఐ)లో భేటీ కానున్నారు. ఉత్తమ ఉపాధ్యాయుల అనుభవాలు, విద్యాభివృద్ధికి దోహదపడే ఆలోచనలను వారు మంత్రితో పంచుకోనున్నారు. ఉత్తమ ఉపాద్యాయ అవార్డుకు ఎంపికైన టీచర్లు ఈనెల 4వ తేదీన మధ్యాహ్నం 2గంటల కల్లా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. రవీంద్రభారతిలో రాష్ట్రస్థాయి వేడుకలు... ఈనెల 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయి వేడుకలను రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉదయం 10గంటల నుంచి వేడుకలు ప్రారంభమవుతాయని వివరించింది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. -
నేరాభియోగాలున్నా పోలీస్ కాలేరు
సాక్షి, హైదరాబాద్: నేరాభియోగాలు నిరూపణ కాకపోయినా, అభియోగాలు ఉన్నవారు కానిస్టేబుల్ వంటి పోస్టుల ఎంపికకు అర్హులు కాదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును కింది కోర్టు కొట్టేసిందని, అభియోగాల సమయంలో పోలీస్ నియామక మండలి రద్దు చేసిన తన కానిస్టేబుల్ ఎంపికను పునరుద్ధరించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న రిట్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకున్నట్లు నేరాభియోగాలు రుజువు కాలేకపోతే, ఆ వ్యక్తిపై మచ్చ లేనట్లు కాదని స్పష్టం చేసింది. ఇలాంటి నేపథ్యం ఉన్న వారి ఎంపికను రద్దు చేసే అధికారం పోలీస్ నియామక మండలికి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు చెప్పారు. ఇదే మాదిరిగా సుప్రీంకోర్టు కూడా తీర్పులు వెలువరించిందని వాటిని ఉదహరించారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం, రాయకల్ గ్రామం చల్లిగడ్డ తండాకు చెందిన కర్రా కృష్ణకుమార్ అనే యువకుడు మెదక్ జిల్లా ఆర్మర్డ్ రిజర్వు కానిస్టేబుల్‌గా ఎన్నికయ్యాడు. అయితే తర్వాత ఒక క్రిమినల్ కేసులో పాత్ర ఉందని, నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్లో కేసు ఉందని తెలుసుకుని అధికారులు కృష్ణకుమార్‌కు నోటీసు జారీ చేశారు. అతని వివరణతో సంతృప్తి చెందని అధికారులు ఎంపిక జాబితా నుంచి అతని పేరును తొలగించారు. పోలీస్ నియామక మండలి అతని కానిస్టేబుల్ ఎంపికను రద్దు చేసింది.తన తండ్రి, సోదరుడు తనపై పెట్టిన తప్పుడు కేసును గత ఏడాది కింది కోర్టు కొట్టేసిందని, తనకు కానిస్టేబుల్ పోస్టు ఇవ్వాలని చేసుకున్న దరఖాస్తును మండలి పట్టించుకోలేదని కృష్ణకుమార్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు. కింది కోర్టు అతనిపై ఉన్న క్రిమినల్ కేసును విచారించిందని, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోస్టులకు ఎంపిక అయ్యే వారిపై నేరాభియోగాలు కూడా ఉండకూడదని హెకోర్టు తీర్పులో పేర్కొంది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్ 31న నోటిఫికేషన్ వెలువడింది. ప్రాథమిక, శరీరదారుఢ్య పరీక్షల్లోనే కాకుండా రాత పరీక్షలో కూడా పిటిషనర్ ఉత్తీర్ణుడయ్యాడు. ఎంపిక జాబితాలో అతని పేరు కూడా ఉంది. ఈ దశలో అతనిపై క్రిమినల్ కేసు ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 2017 జూన్ 14న అతని ఎంపికను రద్దు చేసింది.ఆ తర్వాత కింది కోర్టు అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయడంతో తాను నిర్దోషినని, కానిస్టేబుల్ ఎంపికకు తిరిగి అవకాశం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన రిట్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చుతూ తీర్పు చెప్పారు. -
కుటుంబంలో ఒక్కరికే పింఛన్
సాక్షి, మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో అర్హులైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.2 వేల పింఛన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ల వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండల నిరుపేదలు ఊరట చెందుతున్నారు. నూతన పింఛన్ విధానంతో మండలంలో లబ్ధిదారుల సంఖ్య బాగానే పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక్కరే పింఛన్‌కు అర్హులని ఆదేశాలు చేయడంతో వృద్ధులు ఉసూరుమంటున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో ఒకరికి పింఛన్ ఉండగా నూతన విధానంతో ఇంట్లో మరొకరికి పింఛన్ వస్తుందని ఆశపడిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఎన్నికల సమయంలో 57 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ హామీ అమలు చేయడంలో షరతులు విధించడం సమంజసంగా లేదంటున్నారు. నూతన పింఛన్ విధానంపై.. ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అందించనున్న రూ.2 వేల పింఛన్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో 60 ఏళ్లు దాటితే పనిచేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి వృద్ధాప్యం సమీపిస్తుండగానే వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అర్హతలివే.. మండలంలో అర్హులైన లబ్ధిదారులు తమ ఆదాయం రూ.1.50 లక్షలోపు ఉన్నట్లు ధ్రువపత్రం, తమ వయస్సు 57 ఏళ్లు పూర్తయినట్లు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేదా ఓటరు కార్డు కలిగి ఉండాలి. మూడెకరాల తరి భూమి, 7 ఎకరాల్లోపు మెట్ట భూమి కలిగి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఇందుకు సంబంధించిన షరతులతో దరఖాస్తు చేసుకోవాలి. ఒక్కరికే ఇవ్వడం సరికాదు ఇంటికి ఒక్కరికే పింఛన్ ఇవ్వడం సరికాదు. ఇంట్లో 57 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉంటే అందరికీ ఇవ్వాలి. 60 ఏళ్లు నిండాయంటే లేవడం, కూర్చోవడానికి సైతం ఇబ్బందులు పడుతుంటారు. ఈ వయస్సులో ఏ పని చేయలేని పరిస్థితి. ప్రభుత్వం పింఛన్ ఇస్తే ఆ డబ్బులు మందులు, తిండి ఖర్చులకు పనికొస్తాయి. – సంజీవ నాయుడు, చెన్నిపాడు అర్హుల వివరాలు సేకరిస్తున్నాం.. మండలంలో 57 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. కుటుంబానికి ఒక్క పింఛన్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. కొత్త పింఛన్ పథకం కోసం ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తాం. – ముషాయిదాబేగం -
గ్రీన్‌సిగ్నల్!
జిల్లాలో రేషన్‌దుకాణాలు 558 అంత్యోదయ కార్డులు 17,037 ఆహార భద్రత కార్డులు 2,11,566 అన్నపూర్ణ కార్డులు 42 ప్రతి నెలా సరఫరా చేసే బియ్యం 4,600 మెట్రిక్‌టన్నులు నాగర్‌కర్నూల్ టౌన్ : అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు మంజూరు చేసేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ జిల్లాలో కార్డులు జారీ చేయాలని వారం రోజుల క్రితం పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ ఆయా జిల్లాల సివిల్ సప్లయి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి సమీప మీసేవ కేంద్రాలలో కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు పాత కార్డులలో కూడా అవసరమైన మార్పులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. కొత్త కార్డుల ప్రక్రియపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్ ప్రకటన కూడా చేశారు. దీంతో ఎట్టకేలకు కొత్త కార్డుల జారీ ప్రక్రియపై స్పష్టత వచ్చినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కొత్త కార్డులను మంజూరు చేయలేదు. దీంతో మూడున్నరేళ్లుగా లబ్ధిదారులు కొత్త రేషన్‌కార్డుల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక దశలో శాశ్వత రేషన్ కార్డులను మంజూరు చేసేందుకు సిద్ధమైనప్పటికీ ఆ ప్రక్రియపై నేటికీ ఒక స్పష్టమైన ప్రకటన వెలువర్చలేదు. అదేవిధంగా సరుకుల పంపిణీలో అవినీతి, అక్రమాలను అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తేవడంతో పాటు రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించడంతో శాశ్వత రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ఇక ఉండదనే అధికారులు భావిస్తున్నారు. కేవలం రేషన్‌కార్డు నంబర్‌తో రేషన్ పొందే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయి ధ్రువీకరణ తప్పనిసరి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు రేషన్‌కార్డు కేవలం రేషన్ తీసుకునేందుకు మాత్రమే కాకుండా ఒక గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. ఆధార్ కార్డు అందుబాటులోకి రాక ముందు రేషన్‌కార్డు ప్రాముఖ్యత చాలా ఉండేది. ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకునేవారు. దీంతో అప్పట్లో ప్రతి ఒక్కరూ తెల్ల రేషన్‌కార్డు తీసుకునేందుకు పోటీ పడటంతో భారీస్థాయిలో అక్రమాలు జరిగాయి. గత ప్రభుత్వంలో రేషన్‌కార్డు ఉన్న వారికే కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కార్డును ఇచ్చారు. క్రమేణా రేషన్ కార్డు ప్రాముఖ్యత తగ్గుతూ వస్తుండడంతో కొంతమంది స్వచ్ఛందంగా వీటిని వదులుకున్నారు. మూడేళ్లుగా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోవడంతో గ్రామాల్లో చాలా వరకు ప్రజలు కొత్త కార్డులను తీసుకోలేకపోయారు. ప్రస్తుతం కొత్త కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారికి గ్రామాల్లో వార్షిక ఆదాయం రూ.1.5లక్షలు, పట్టణాల్లో రూ.2లక్షలకు మించకుండా ఉండాలి. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ఆయా గ్రామ వీఆర్వోలు, రేషన్ డీలర్లు పరిశీలించిన అనంతరం వాటిని మండల తహసీల్దార్ ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా ధ్రువీకరించిన వారి జాబితాను చివరగా జిల్లా పౌర సరఫరాల శాఖాధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి డీఎస్ఓ ఆమోదిస్తే వారికి కొత్త కార్డు మంజూరవుతుంది. ఏ ఆధారం లేని ఒంటరి మహిళలు, దివ్యాంగులకు ప్రభుత్వం అంత్యోదయ కార్డులను మంజూరు చేయనుంది. అత్యంత దీన స్థితిలో ఉన్న వారికి అన్నపూర్ణ కార్డులను ఇవ్వనుంది. తహసీల్దార్లకు ఆదేశాలు జిల్లాలో ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల వివరాలను పరిశీలించి జాబితా తయారు చేసి పంపాలని ఆయా మండల తహసీల్దార్లకు జిల్లా పౌర సరఫరాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రజావాణిలోనూ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను సేకరించి క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి కార్డులను మంజూరు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని 558 రేషన్‌షాపులలో 17,037అంత్యోదయ కార్డులు, 2,11,566 ఆహార భద్రత, 42 అన్నపూర్ణ కార్డులు ఉండగా, ప్రతి నెలా 4600 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. అర్హులకే కార్డులు జిల్లాలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైంది. అన్ని మీసేవ కేంద్రాలలో లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ దరఖాస్తును ఆయా మండల తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తే వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి కార్డులు జారీ చేస్తారు. గ్రామాల్లో కార్డులు మంజూరు చేయిస్తామని చెప్పే దళారులను నమ్మి ప్రజలు మోసపోవద్దు. – మోహన్‌బాబు, డీఎస్ఓ -
అర్హులంతా ఓటు నమోదు చేసుకోవాలి
సాక్షి, మెదక్ : జిల్లాలో అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు బి. వెంకటేశ్వర్రావు అన్నారు. ఆదివారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం సంగాయిపేట, చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రెండుచోట్ల అధికారులు గుర్తించిన ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్, జాయింట్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఎజెంట్‌ను ఏర్పాటు చేసుకొని ఓటరు నమోదు కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలన్నారు. అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకునేలా చూడాలని నాయకులను కోరారు. ఫిబ్రవరి 14వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మామిండ్ల ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు చింతల నర్సింలు, టీడీపీ నాయకులు అప్జల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు పదే పదే స్థానిక సంస్థలకు ఒకచోట, సాధారణ ఎన్నికలకు మరోచోట ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు ఒకేచోట ఉండేలా చూడాలని వారు కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల కొంతమంది ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని, దీన్ని నివారించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, బీజేపీ నాయకుడు మల్లేశం, సీపీఎం నాయకుడు ఏ.మల్లేశం, డీఆర్ఓ రాములు, ఆర్డీఓలు మెంచు నగేష్, మధు, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
అర్హులైన వారినే ఎంపిక చేస్తాం
జన్నారం: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బస్తీ పథకం కింద అర్హులైన వారినే ఎంపిక చేస్తామని తహశీల్దార్ సత్యనారాయణ పెర్కోన్నారు. అందుకే మొదటి విడతగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం మండలంలోని ధర్మారంలో గ్రామ సభ నిర్వహించి దళితుల నుంచి ధరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుంచి 40 ధరఖాస్తులు వచ్చాయని, అందులో నలుగురిని ఎంపిక చేశామని చెప్పారు. ఎంపికలో ఎలాంటి అక్రమాలు జరిగే ప్రసక్తి లేకుండా అందరి సమక్షంలోనే ఎంఫిక చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో సర్పంచ్ ప్రణవ్‌కుమార్, మార్కేట్ కమిటీ వైస్ చైర్మన్ సతీశ్‌కుమార్, ఆర్ఐ సంతోశ్, టీఆర్ఎస్ నాయకులు సత్యం, ఎమ్మార్పీఎస్ నాయకులు రాజరాం తదితరులు పాల్గోన్నారు.