సాక్షి, హైదరాబాద్: నేరాభియోగాలు నిరూపణ కాకపోయినా, అభియోగాలు ఉన్నవారు కానిస్టేబుల్ వంటి పోస్టుల ఎంపికకు అర్హులు కాదని తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది. తనపై నమోదైన క్రిమినల్ కేసును కింది కోర్టు కొట్టేసిందని, అభియోగాల సమయంలో పోలీస్ నియామక మండలి రద్దు చేసిన తన కానిస్టేబుల్ ఎంపికను పునరుద్ధరించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న రిట్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది.క్రిమినల్ కేసుల్లో జోక్యం చేసుకున్నట్లు నేరాభియోగాలు రుజువు కాలేకపోతే, ఆ వ్యక్తిపై మచ్చ లేనట్లు కాదని స్పష్టం చేసింది.
ఇలాంటి నేపథ్యం ఉన్న వారి ఎంపికను రద్దు చేసే అధికారం పోలీస్ నియామక మండలికి ఉంటుందని న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు ఇటీవల తీర్పు చెప్పారు. ఇదే మాదిరిగా సుప్రీంకోర్టు కూడా తీర్పులు వెలువరించిందని వాటిని ఉదహరించారు.సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం, రాయకల్ గ్రామం చల్లిగడ్డ తండాకు చెందిన కర్రా కృష్ణకుమార్ అనే యువకుడు మెదక్ జిల్లా ఆర్మర్డ్ రిజర్వు కానిస్టేబుల్‌గా ఎన్నికయ్యాడు.
అయితే తర్వాత ఒక క్రిమినల్ కేసులో పాత్ర ఉందని, నారాయణఖేడ్ పోలీస్ స్టేషన్‌లో కేసు ఉందని తెలుసుకుని అధికారులు కృష్ణకుమార్‌కు నోటీసు జారీ చేశారు. అతని వివరణతో సంతృప్తి చెందని అధికారులు ఎంపిక జాబితా నుంచి అతని పేరును తొలగించారు. పోలీస్ నియామక మండలి అతని కానిస్టేబుల్ ఎంపికను రద్దు చేసింది.తన తండ్రి, సోదరుడు తనపై పెట్టిన తప్పుడు కేసును గత ఏడాది కింది కోర్టు కొట్టేసిందని, తనకు కానిస్టేబుల్ పోస్టు ఇవ్వాలని చేసుకున్న దరఖాస్తును మండలి పట్టించుకోలేదని కృష్ణకుమార్ హైకోర్టులో రిట్ దాఖలు చేశారు.
కింది కోర్టు అతనిపై ఉన్న క్రిమినల్ కేసును విచారించిందని, పోలీస్ కానిస్టేబుల్ వంటి పోస్టులకు ఎంపిక అయ్యే వారిపై నేరాభియోగాలు కూడా ఉండకూడదని హెకోర్టు తీర్పులో పేర్కొంది. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2015 డిసెంబర్ 31న నోటిఫికేషన్ వెలువడింది. ప్రాథమిక, శరీరదారుఢ్య పరీక్షల్లోనే కాకుండా రాత పరీక్షలో కూడా పిటిషనర్ ఉత్తీర్ణుడయ్యాడు. ఎంపిక జాబితాలో అతని పేరు కూడా ఉంది.
ఈ దశలో అతనిపై క్రిమినల్ కేసు ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు 2017 జూన్ 14న అతని ఎంపికను రద్దు చేసింది.ఆ తర్వాత కింది కోర్టు అతనిపై క్రిమినల్ కేసు కొట్టేయడంతో తాను నిర్దోషినని, కానిస్టేబుల్ ఎంపికకు తిరిగి అవకాశం ఇచ్చేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన రిట్‌ను న్యాయమూర్తి తోసిపుచ్చుతూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment