మానవపాడులో పింఛన్లు పంపిణీ చేస్తున్న పంచాయతీ కార్యదర్శి
సాక్షి, మానవపాడు: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ వయస్సు 57 ఏళ్లకు తగ్గించడంతో అర్హులైన లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి రూ.2 వేల పింఛన్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో వృద్ధుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. పింఛన్ల వయస్సు 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు కుదిస్తూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మండల నిరుపేదలు ఊరట చెందుతున్నారు.
నూతన పింఛన్ విధానంతో మండలంలో లబ్ధిదారుల సంఖ్య బాగానే పెరిగే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఒక కుటుంబంలో ఒక్కరే పింఛన్‌కు అర్హులని ఆదేశాలు చేయడంతో వృద్ధులు ఉసూరుమంటున్నారు. ఇప్పటి వరకు ఇంట్లో ఒకరికి పింఛన్ ఉండగా నూతన విధానంతో ఇంట్లో మరొకరికి పింఛన్ వస్తుందని ఆశపడిన లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఎన్నికల సమయంలో 57 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పింఛన్ అందిస్తామని చెప్పిన కేసీఆర్ హామీ అమలు చేయడంలో షరతులు విధించడం సమంజసంగా లేదంటున్నారు.
నూతన పింఛన్ విధానంపై..
ప్రభుత్వం ఏప్రిల్ నెల నుంచి అందించనున్న రూ.2 వేల పింఛన్ పథకంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సమాజంలో 60 ఏళ్లు దాటితే పనిచేయలేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ప్రజల ఇబ్బందులను గుర్తించి వృద్ధాప్యం సమీపిస్తుండగానే వారికి అండగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అర్హతలివే..
మండలంలో అర్హులైన లబ్ధిదారులు తమ ఆదాయం రూ.1.50 లక్షలోపు ఉన్నట్లు ధ్రువపత్రం, తమ వయస్సు 57 ఏళ్లు పూర్తయినట్లు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు లేదా ఓటరు కార్డు కలిగి ఉండాలి. మూడెకరాల తరి భూమి, 7 ఎకరాల్లోపు మెట్ట భూమి కలిగి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. ఇందుకు సంబంధించిన షరతులతో దరఖాస్తు చేసుకోవాలి.
ఒక్కరికే ఇవ్వడం సరికాదు
ఇంటికి ఒక్కరికే పింఛన్ ఇవ్వడం సరికాదు. ఇంట్లో 57 ఏళ్లు పైబడిన వారు ఎంతమంది ఉంటే అందరికీ ఇవ్వాలి. 60 ఏళ్లు నిండాయంటే లేవడం, కూర్చోవడానికి సైతం ఇబ్బందులు పడుతుంటారు. ఈ వయస్సులో ఏ పని చేయలేని పరిస్థితి. ప్రభుత్వం పింఛన్ ఇస్తే ఆ డబ్బులు మందులు, తిండి ఖర్చులకు పనికొస్తాయి.
– సంజీవ నాయుడు, చెన్నిపాడు
అర్హుల వివరాలు సేకరిస్తున్నాం..
మండలంలో 57 ఏళ్లకు పైబడిన వృద్ధులకు ప్రతిఒక్కరి వివరాలు సేకరిస్తున్నాం. కుటుంబానికి ఒక్క పింఛన్ మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు వచ్చాయి. కొత్త పింఛన్ పథకం కోసం ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే దరఖాస్తులు స్వీకరిస్తాం. – ముషాయిదాబేగం
Comments
Please login to add a commentAdd a comment