b.venkatarao
-
అర్హులంతా ఓటు నమోదు చేసుకోవాలి
సాక్షి, మెదక్ : జిల్లాలో అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పరిశీలకుడు బి. వెంకటేశ్వర్రావు అన్నారు. ఆదివారం ఆయన జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొల్చారం మండలం సంగాయిపేట, చిలిపిచెడ్ మండలం చిట్కుల్ గ్రామాల్లో ఆయన పర్యటించారు. రెండుచోట్ల అధికారులు గుర్తించిన ఓటరు నమోదు కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఇన్చార్జి కలెక్టర్ మాణిక్కరాజ్ కణ్ణన్, జాయింట్ కలెక్టర్ నగేశ్‌తో కలిసి రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు కార్యక్రమాన్ని విజయంతం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక ఎజెంట్‌ను ఏర్పాటు చేసుకొని ఓటరు నమోదు కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలన్నారు. అర్హులైన వారంతా ఓటు నమోదు చేసుకునేలా చూడాలని నాయకులను కోరారు. ఫిబ్రవరి 14వరకు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మామిండ్ల ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు చింతల నర్సింలు, టీడీపీ నాయకులు అప్జల్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాలు పదే పదే స్థానిక సంస్థలకు ఒకచోట, సాధారణ ఎన్నికలకు మరోచోట ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. దీనివల్ల ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అన్ని ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు ఒకేచోట ఉండేలా చూడాలని వారు కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రెండుచోట్ల కొంతమంది ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని, దీన్ని నివారించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ లక్ష్మీకిష్టయ్య, జెడ్పీటీసీ లావణ్యరెడ్డి, బీజేపీ నాయకుడు మల్లేశం, సీపీఎం నాయకుడు ఏ.మల్లేశం, డీఆర్ఓ రాములు, ఆర్డీఓలు మెంచు నగేష్, మధు, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
తోటాడ ఇసుక ర్యాంపులపై దాడులు
ఆమదాలవలస టౌన్, న్యూస్‌లైన్: మండల పరిధి తోటాడ, గోపీనగర్ వద్ద ఉన్న ఇసుక ర్యాంపులపై మంగళవారం రెవె న్యూ అధికారులు దాడులు చేశారు. శ్రీకాకుళం ఆర్డీవో గణేష్‌కుమార్, ఆమదాలవలస, ఎచ్చెర్ల తహశీల్దార్లు జి.వీర్రాజు, బి.వెంకటరావు దాడులు చేసి పది ఇసుక ట్రాక్టర్లను సీజ్ చేశారు. జాతీయ రహదారిని ఆనుకుని నాగావళి నదిలో ఉన్న ర్యాంపును అధికారులు పరిశీలించారు. అధికారులను చూసిన ఇసుక అక్రమరవాణాదారులు ట్రాక్టర్లను జీడితోటల్లోకి తీసుకువెళ్లి విడిచిపెట్టి పారిపోయారు. జాతీయ రహదారి వంతెన కిందనే ఇసుక తవ్వకాలు జరగుతుండడంపై ఆర్డీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా తవ్వకాలు సాగితే భవిష్యత్‌లో వంతెనకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. పట్టుపడ్డ ట్రాక్టర్ల వివరాలు తీసుకొని వారిపై కఠిన చర్యలు చేపడతామని తెలిపారు. ట్రాక్టర్లను ఆమదాలవలస ఎస్ఐ బి.మంగరాజుకు అప్పగించి పోలీస్‌స్టేషన్‌కు తరలించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలమేరకు ఈ దాడులు నిర్వహించామని, ఇసుక మాఫియా అక్రమాలను అడ్డకట్టువేసేందుకు అధికారులంతా కార్యచరణ చేస్తున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. ఈ దాడుల్లో సర్వేయర్లు బి.గోవిందరావు, రామగణపతి, ఆర్ఐ శ్రీనివాసరావు, వీఆర్వో కిరణ్, పోలీసుసిబ్బంది పాల్గొన్నారు. పట్టుకున్నారు, వదిలేస్తారుకదా? ఇసుక మాఫియాను అరికట్టాలన్న ఉద్దేశంతో అధికారులు దాడులు చేసినప్పటి కీ అక్రమార్కులకు చీమకుట్టినట్లయినా లేదు. దాడులు జరిగినప్పుడు ఇసుకాసురులు, ట్రాక్టర్ల యజమానులు సమీపంలోని రోడ్లపైనే తిరుగుతుండడం విశేషం. అధికారులు పట్టుకున్న బళ్లను ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు అన్న ధీమా వారిలో కనిపిస్తోంది. ఇలా ఎన్నిసార్లు పట్టుకోలేదు, ఎన్నిసార్లు మేం తెచ్చుకోలేదని వారు వ్యాఖ్యానించడం ఆశ్యర్యం కలిగిస్తోంది.